అసెంబ్లీ ఘటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు | Telangana Assembly Row: High Court Directs DGP to Identify Erring Cops | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఘటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు

Sep 29 2026 12:12 PM | Updated on Sep 29 2026 12:17 PM

Telangana Assembly Row: High Court Directs DGP to Identify Erring Cops

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(DGP) ఆదేశించింది. ఘటనపై విచారణ జరిపి.. బాధ్యులపై తీసుకున్న చర్యల వివరాలతో నివేదికను స్పీకర్‌ ముందు ఉంచాలని సూచించింది. అలాగే అసెంబ్లీ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలున్న టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే పోలీసులు వారిని అడ్డుకున్నారని అడ్వొకేట్‌ జనరల్‌ ఏ. సుదర్శన్‌రెడ్డి వివరించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియమావళితో పాటు నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని, విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో అనుచితంగా ప్రవర్తించారని ఆయన వాదించారు.

అసెంబ్లీ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని.. ఆయన ఆదేశాల మేరకే చీఫ్‌ మార్షల్స్‌, పోలీసులు వ్యవహరించారని ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. స్పీకర్‌ నుంచి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా? ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేశారు? అసెంబ్లీ నియమావళికి సంబంధించిన విషయాలను ఎమ్మెల్యేలకు ముందుగానే తెలియజేశారా? అని ప్రశ్నించింది.

మహిళా ఎమ్మెల్యేల విషయంలో ఎందుకలా?
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ఎందుకు అనుచితంగా ప్రవర్తించారన్న అంశంపై హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఓ సీనియర్‌ మహిళా ఎమ్మెల్యే మెడపై చేయి వేసి ఎందుకు నెట్టారని ప్రశ్నించింది. మహిళా ఎమ్మెల్యేలు నల్ల చీరలు మాత్రమే ధరించారని, ఫ్లకార్డులు లేదా నినాదాలున్న టీషర్టులు ధరించలేదన్న అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.

అయితే మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలను ఏజీ ఖండించారు. అలాంటి ఘటన జరగలేదని కోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత పూర్తి వివరాలను పరిశీలిస్తామని చెప్పారు.

‘నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్‌దే అధికారం’
మరోవైపు బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది ప్రభుత్వ వాదనలను వ్యతిరేకించారు. ఎమ్మెల్యేలు ఏదైనా అసెంబ్లీ నిబంధన ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని.. పోలీసులు ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం లేదని వాదించారు. చీఫ్‌ మార్షల్స్‌కు స్పీకర్‌ ఆదేశాలు ఇచ్చినట్లు ఎలాంటి ఉత్తర్వులు చూపలేదని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని భావించినా ఎమ్మెల్యేలను స్పీకర్‌ వద్దకు తీసుకెళ్లాల్సిందని.. అరెస్ట్‌ చేసి తెలంగాణ భవన్‌కు ఎందుకు తరలించారని ప్రశ్నించారు.

స్పీకర్‌ ఆదేశాలైతే.. ఆయన పరిధిలోనే
స్పీకర్‌ ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరించి ఉంటే.. ఆ వ్యవహారం స్పీకర్‌ అధికార పరిధిలోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునేది స్పీకర్‌ మాత్రమేనని పేర్కొంది. అదే సమయంలో ఘటన అసెంబ్లీ లోపల కాకుండా బయట, గేటు వద్ద జరిగి ఉంటే.. ఆ అంశంపై ప్రత్యేకంగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆధారాలు లేవన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

మధ్యంతర ఉత్తర్వుల్లో మార్పులు
ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులను గుర్తించి.. వారిపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: రాష్ట్రం దాటితే.. ‘స్థానికత’ దూరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement