హైదరాబాద్: నాదర్‌గుల్, ఆదిభట్ల, ఎం.ఎం.కుంట ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్క్, వర్క్ సెంటర్ పేరుతో గత 23 సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మంగళవారం అఖిలపక్ష సదస్సులో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్ పరిధిలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం సేకరించని భూములు, నష్టపరిహారం అందని వ్యవసాయ భూములు, వేలాది నివాస ప్లాట్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే హార్డ్‌వేర్ పార్క్ పరిధి నుంచి తమ భూములను తొలగించాలని పోరాడుతున్న భూ యజమానులకు, ఇటీవల 22-A నిషేధిత జాబితాలో భూములను చేర్చడం మరో సమస్యగా మారిందని పేర్కొన్నారు.
హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ (జేఏసీ), తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన అఖిలపక్ష సదస్సులో వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, CPI రాష్ట్ర కార్యదర్శి ఈటీ నరసింహ, పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు పాల్గొని మాట్లాడారు.
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ పార్క్ భూ సమస్య పరిష్కారానికి భూ బాధితులు, రైతులు, ప్లాట్ల యజమానులు ఐక్యంగా ఒక సమష్టి కదలికను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. 2004లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమై రెండు దశాబ్దాలకు పైగా గడిచినా, హార్డ్‌వేర్ పార్క్ కోసం సేకరించిన భూమి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని, మరోవైపు భవిష్యత్ అవసరాల కోసం కష్టపడి కొనుగోలు చేసిన వేలాది ప్లాట్ల యజమానులు తమ భూములను వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. భూసేకరణ ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఆ ప్రక్రియను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ సమస్యపై వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డితో చర్చించడంతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి కూడా తీసుకెళ్లామని, సంబంధిత అధికారులను సమగ్ర వివరాలు, సర్వే నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ప్రస్తుతం సమస్య ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకునే కీలక దశకు చేరుకుందని, అందుకే ఈ సమావేశం నిర్వహించామని చెప్పారు. ప్రతి లేఅవుట్‌కు సంబంధించిన భూములు, ప్లాట్లు, యజమానుల వివరాలను సేకరించి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేయాలని, వాటి ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అవసరమైతే తదుపరి కార్యాచరణను జేఏసీ నిర్ణయిస్తుందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. విడివిడిగా చేసే ప్రయత్నాలతో ఈ సమస్య పరిష్కారం కాదని, ఐక్యంగా కదిలితేనే న్యాయం సాధించగలమని, “బలహీనుడికి ఆయుధం ఐక్యత” అని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.
భూ యజమానుకు ఇబ్బందులు: కోదండ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ, భూదాన్, ఎండోమెంట్ తదితర భూముల అక్రమ విక్రయాలు, రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు 22-A నిబంధనలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. అయితే వాటిని అమలు చేసే క్రమంలో జరిగిన తప్పిదాల వల్ల నిజమైన భూ యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 22-A జాబితాలో ఉన్న భూముల వాస్తవ పరిస్థితిని పరిశీలించి, అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యను టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, సంబంధిత మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. భూములు కొనుగోలు చేసిన బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు.
వివరాలను తెలుసుకుంటా: చామల
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2004లో హార్డ్‌వేర్ పార్క్ కోసం ఎంత భూమిని సేకరించారని, ప్రస్తుతం ఎంత భూమి వినియోగంలో ఉందని, ఇంకా ఎంత భూమి వినియోగంలోకి రాలేదనే అంశాలపై పూర్తి వివరాలను సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. TGIIC అధికారులతో మాట్లాడి ఈ వివరాలను తెలుసుకుంటానని తెలిపారు. హార్డ్‌వేర్ పార్క్ పరిధిలో గ్రామపంచాయతీ లేఅవుట్ల ద్వారా ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారు, భవిష్యత్ అవసరాల కోసం ప్లాట్లు కొనుగోలు చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయని, వారి పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉందన్నారు. వ్యవసాయ భూములు, నివాస ప్లాట్లు, ప్రభుత్వ భూములు, ఇప్పటికే కంపెనీలకు కేటాయించిన భూములను విడివిడిగా గుర్తించి, వాస్తవ పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. సమస్యను కేవలం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కాకుండా, పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాల్సి ఉందని అన్నారు. పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో చర్చించి పరిష్కార మార్గాన్ని రూపొందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
CPI రాష్ట్ర కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భూ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు. భూదాన్ భూములకు సంబంధించి గతంలో అధికారులే పట్టాలు మంజూరు చేసినప్పటికీ, ప్రస్తుతం వాటిలోని భూములు కూడా నిషేధిత జాబితాలో ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఆదిబట్లలో భూదాన్ భూముల్లో సుమారు వెయ్యి ప్లాట్లను నిరుపేదలకు కేటాయించినప్పటికీ, వాటి వినియోగానికి ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. సమస్య పరిష్కారానికి భూ బాధితులు, రైతులు, ప్లాట్ యజమానులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి జేఏసీగా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భూ బాధితుల న్యాయం కోసం జేఏసీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి CPI పూర్తి మద్దతు ఇస్తుందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు వారి పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు.
సదస్సులో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ పార్క్ కోసం భూసేకరణ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, దాదాపు 20 వేల నివాస ప్లాట్ల యజమానుల సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. 22-A జాబితాలో చేర్చిన భూముల విషయంలోనూ వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, TGIIC అధికారులు, భూ యజమానుల ప్రతినిధులతో సమగ్ర చర్చలు నిర్వహించి కాలపరిమితితో కూడిన కార్యాచరణ రూపొందించాలని సదస్సు కోరింది. భూముల సమస్య పరిష్కారం అయ్యే వరకు అఖిలపక్షంగా, సంఘటితంగా పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హార్డ్ వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయవాది మాధవరం రామేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా టీజేఏస్ అధ్యక్షులు దార సత్యం, జేఏసీ కన్వీనర్ ముద్దం వెంకట్ రెడ్డి, జేఏసీ కో కన్వీనర్ ఏం. వినయ్ రెడ్డి, కళ్ళెం చంద్రారెడ్డి, శ్రీరాం రెడ్డి, అంజి రెడ్డి లేఅవుట్ శ్రీనివాస్ రెడ్డి, ఆచార్య వినోబా నగర్ కన్వీనర్ డా. రాజశేఖర్, టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, టీజేఏస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సలీమ్ పాషా, టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్, టీజేఏస్ రాష్ట్ర నాయకులు హనుమంత్ రెడ్డి, విద్యార్థి నాయకులు పేరాల ప్రశాంత్, శేఖర్ యాదవ్, టీజేఏస్ రంగారెడ్డి జిల్లా నాయకులు సామ నిరంజన్, నాగని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


