విదేశాలలో ఉన్నత విద్య (మాస్టర్స్ / డాక్టరేట్) అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాత్మ జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి’ పథకం (ఆగస్టు/సెప్టెంబర్ 2026 - ఫాల్ సెషన్) దరఖాస్తుల గడువును పొడిగించారు. గతంలో చివరి తేదీగా సెప్టెంబరు 30ను పేర్కొన్నారు. అయితే, మరో 15 రోజుల పాటు, అంటే అక్టోబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాల మాయాదేవి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హతలు
* కుటుంబ వార్షిక ఆదాయం: అన్ని మార్గాల ద్వారా కలిపి రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
* వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే సమయానికి 35 సంవత్సరాలు మించరాదు.
పరీక్షలలో కనీస అర్హత మార్కులు:
* డిగ్రీ (Graduation): కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
* GRE / G-MAT: GRE లో కనీసం 260 మార్కులు లేదా G-MAT లో 500 మార్కులు సాధించాలి.
* ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష: TOEFLలో 60 మార్కులు లేదా IELTSలో 6.0 బ్యాండ్ లేదా PTEలో 50 మార్కులు పొంది ఉండాలి.
రిజిస్ట్రేషన్, పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్‌సైట్ http://www.telanganaepass.cgg.gov.in ను చూడొచ్చు.


