అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాక్‌ నుంచి బలగాల నిష్క్రమణ | US troops to exit Iraq after 20 years | Sakshi
Sakshi News home page

అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాక్‌ నుంచి బలగాల నిష్క్రమణ

Sep 29 2026 3:25 PM | Updated on Sep 29 2026 3:37 PM

US troops to exit Iraq after 20 years

ఇరాక్‌లోని చివరి సైనిక స్థావరాల నుంచి అమెరికా బలగాలు బుధవారం నాటికి పూర్తిగా వైదొలగనున్నాయి. 20 ఏళ్లకు పైగా సాగిన అమెరికా సైనిక ఉనికి ముగియడాన్ని ఇరాన్‌, దాని మద్దతు ఉన్న సాయుధ వర్గాలు విజయంగా అభివర్ణిస్తున్నాయి. ఈ పరిణామంతో ఇరాక్‌లో ఇరాన్‌ ప్రభావం మరింత పెరగవచ్చని, మరోవైపు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు తిరిగి బలపడేందుకు భద్రతాపరమైన ఖాళీ ఏర్పడే అవకాశం ఉందని ఇరాక్‌ భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా బలగాల ఉపసంహరణకు 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో ఒప్పందం కుదిరింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. 2003లో సద్దాం హుస్సేన్‌ను గద్దె దించేందుకు అమెరికా ఇరాక్‌పై దాడి చేసింది. 2011 చివర్లో అమెరికా బలగాలు వెనుదిరిగాయి. అయితే 2014లో ఇస్లామిక్‌ స్టేట్‌ భారీ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇరాక్‌ భద్రతా బలగాలకు సహాయం చేసేందుకు అమెరికా సైన్యం తిరిగి వచ్చింది. 2014 నుంచి 2017 వరకు ఇస్లామిక్‌ స్టేట్‌పై జరిగిన ప్రధాన పోరులో అమెరికా కీలక పాత్ర పోషించింది.

ఇరాక్‌ భద్రతా విశ్లేషకుడు జాసిమ్‌ అల్‌-బహాద్లీ మాట్లాడుతూ.. అమెరికా నేతృత్వంలోని కూటమి వెళ్లిపోవడం వల్ల ఇరాక్‌లో ఇరాన్‌ ప్రభావాన్ని అడ్డుకునే సైనిక సమతుల్యత తొలగిపోతుందని అన్నారు. ఇరాన్‌ అనుకూల మిలీషియా వర్గాలు ఈ పరిణామాన్ని తమ విజయంగా చూపించుకుని భద్రతా నిర్ణయాలు, రాజకీయ వ్యవహారాల్లో మరింత ప్రభావం సాధించేందుకు ప్రయత్నించవచ్చని తెలిపారు.

 ఇరాకీలకు చారిత్రక విజయం

ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధ వర్గాల కూటమి ‘ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ ఇన్‌ ఇరాక్‌’ కమాండర్‌ అబు మోజ్తబా అల్‌-యాసిరి అమెరికా నిష్క్రమణను “ఇరాక్‌ ఇస్లామిక్‌ ప్రతిఘటన వర్గాలకు, ఇరాకీలకు చారిత్రక విజయం, అమెరికా ప్రాజెక్టుకు ఘోర పరాజయం”గా అభివర్ణించారు. సెప్టెంబర్‌ 30న “ఇరాక్‌ చరిత్రలోని చీకటి అధ్యాయం ముగింపును” జరుపుకుంటామని తెలిపారు.

అయితే ఫలూజా ప్రాంతానికి చెందిన సున్నీ గిరిజన నేత అబ్దుల్‌రహ్మాన్‌ అల్‌-జుబాయీ మాట్లాడుతూ.. ఇరాక్‌ భద్రతా వ్యవస్థ పూర్తిగా బాధ్యత చేపట్టేందుకు ఇంకా సిద్ధంగా లేదని అన్నారు. అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ విధంగా వెళ్లిపోవడం వల్ల ఏర్పడే ఖాళీపై ఇరాకీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

ఇస్లామిక్‌ స్టేట్‌ కూడా మరోసారి చురుగ్గా మారే ప్రమాదం ఉందని ఇరాక్‌ అధికారులు చెబుతున్నారు. ఆ సంస్థకు ఇప్పటికీ రహస్య కార్యకర్తల నెట్‌వర్క్‌ ఉందని, అమెరికా నిఘా సమాచారం, సాంకేతిక సహాయం, డ్రోన్ల మద్దతు లేకపోవడం ఉగ్రవాదులకు తిరిగి సమూహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించవచ్చని కుర్దిష్‌ కమాండర్‌ సిర్వాన్‌ బర్జానీ తెలిపారు. ఉపసంహరణ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన రహస్య కార్యకర్తల కదలికలు పెరిగినట్లు గమనించామని ఆయన చెప్పారు.

ఇరాక్‌ భద్రతా బలగాల ప్రకారం, అమెరికా నిష్క్రమణను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు సిద్ధమైనట్లు అనుమానిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠాను గుర్తించారు. అమెరికా బలగాల నిష్క్రమణ తర్వాత ఇరాక్‌లో ఇరాన్‌ ప్రభావం, భద్రతా పరిస్థితి, ఇస్లామిక్‌ స్టేట్‌ కార్యకలాపాలు ఎలా మారతాయన్నది కీలకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement