రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇతర దేశాల పౌరులు, సైనికుల మోహరింపుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రష్యా వివిధ దేశాలకు చెందిన పౌరులను యుద్ధంలోకి లాగుతోందని ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇందులో భారత్ సహా పలు దేశాల పేర్లను ప్రస్తావించారు. ఇదే సమయంలో.. రష్యాకు ఉత్తర కొరియా సైనికుల తరలింపు కూడా ఇంకా కొనసాగుతోందని తాజాగా జెలెన్‌స్కీ వెల్లడించారు.
రష్యా భూభాగంలో ఇప్పటికే వేల మంది ఉత్తర కొరియా సైనికులు ఉన్నారని.. ఇప్పుడు మరో 10 వేల మందిని పంపేందుకు ప్యాంగ్యాంగ్ సన్నాహాలు చేస్తోందని సోమవారం జెలెన్‌స్కీ తెలియజేశారు. కొత్త సమాచారం ఆధారంగా ఈ సైనికులను తొలుత శిక్షణకు ఎంపిక చేస్తున్నారని.. అనంతరం రష్యాకు తరలించనున్నారని పేర్కొన్నారు.
కఠిన శిక్షణ.. కట్టుదిట్టమైన క్రమశిక్షణ.. పై అధికారుల ఆదేశాలకు తిరుగులేని విధేయత.. ఉత్తర కొరియా సైనికుల ప్రత్యేకత ఇదే. యుద్ధరంగంలోకి దిగితే వెనక్కి తగ్గకుండా దాడులు చేయడం.. ఆ దాడులు భయానక రీతిలో ఉండడం.. పట్టుబడినా కీలక సమాచారాన్ని బయటపెట్టకుండా మౌనం పాటించడం వారి గురించి తరచూ వినిపించే అంశాలు. పైగా రష్యా అత్యాధునిక సైనిక సాంకేతికతపై పట్టు సాధిస్తూ.. వినూత్న రీతిలో దాడులు చేస్తుంటారు. అందుకే రాక్షస సేనగా దీనిని అభివర్ణిస్తుంటారు.
ఉత్తర కొరియా సేనలు ఇలా..
ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మాస్కోకు మద్దతుగా ఉత్తర కొరియా 2024 నుంచి సైనికులను పంపుతున్నట్లు దక్షిణ కొరియా నివేదికలు ఇస్తోంది. ఇప్పటివరకు 14 వేల నుంచి 15 వేల మంది వరకు ఉత్తర కొరియా సైనికులు రష్యాకు వెళ్లినట్లు అంచనా. వీరిలో ఎక్కువ మందిని ఉక్రెయిన్ బలగాలను ఎదుర్కొనేందుకు కుర్స్క్ ప్రాంతంలో మోహరించినట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగానే ఉక్రెయిన్..నార్త్ కొరియాపై విరుచుకుపడుతూ వస్తోంది.
మరో 10 వేల మంది.. ఎందుకు?
తాజాగా రష్యా భూభాగంలో 8 వేల మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు ఉన్నారని జెలెన్‌స్కీ చెబుతున్నారు. వీరికి అదనంగా మరో 10 వేల మందిని పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సైనికులను ప్రస్తుతం శిక్షణ కోసం ఎంపిక చేస్తున్నారని.. శిక్షణ పూర్తయ్యాక రష్యాకు తరలించే ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
సైనికులను పంపడమే కాకుండా ఉత్తర కొరియా రష్యాకు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందిస్తున్నట్లు ఉక్రెయిన్ చెబుతోంది. మిలియన్ల కొద్దీ ఆర్టిలరీ, మోర్టార్ రౌండ్లతోపాటు బాలిస్టిక్ క్షిపణులు, లాంగ్‌రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థలు, మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థలను రష్యాకు సరఫరా చేసినట్లు సమాచారం.
50 వేల మందిపై గతంలోనే..
ఉత్తర కొరియా నుంచి రష్యాకు మరింత మంది సైనికులు వెళ్లే అవకాశం ఉందని జెలెన్‌స్కీ గతంలోనూ చెప్పారు. ఆగస్టులో ఏకంగా 50 వేల మంది వరకు ఉత్తర కొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తాజాగా మరో 10 వేల మంది కోసం సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పడంతో.. రష్యాకు ప్యాంగ్యాంగ్ అందిస్తున్న సైనిక సహాయంపై మరోసారి చర్చ మొదలైంది.
భారత్.. లెక్క వేరే!
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో భారత్ పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. రష్యా 47 దేశాలకు చెందిన పౌరులను మోసపూరిత మార్గాల్లో యుద్ధంలోకి లాగుతోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇందులో భారత్ కూడా ఉందని పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖకు అందిన సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 227 మంది భారతీయులు రష్యా సాయుధ దళాల్లో చేరగా, వారిలో 139 మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 51 మంది మరణించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
మంచి ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల ద్వారా రష్యాకు వెళ్లి.. అక్కడ సైన్యంలోకి వెళ్లాల్సి వచ్చిందని కొందరు భారతీయులు, వారి కుటుంబాలు గతంలో ఆరోపించాయి. అయితే ఈ 227 మంది అందరూ ఏజెంట్ల మోసానికి గురయ్యారని ప్రభుత్వం చెప్పలేదు. మిగిలిన భారతీయులను సైన్యం నుంచి విడుదల చేయించి స్వదేశానికి తీసుకురావడానికి రష్యాతో భారత్ పలు స్థాయిల్లో సంప్రదింపులు జరుపుతోంది. ఇలాంటి అక్రమ రిక్రూట్‌మెంట్ వ్యవహారాలపై అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ కూడా హెచ్చరిస్తోంది.
దక్షిణ కొరియాతోనూ వివాదం
ఉత్తర కొరియా సైనికుల అంశం మరో వివాదానికీ దారితీసింది. రష్యా తరఫున పోరాడుతూ ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను ఇటీవల దక్షిణ కొరియాకు బదిలీ చేసినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడంపై సియోల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బదిలీని గోప్యంగా ఉంచాలన్న అవగాహన ఉందని దక్షిణ కొరియా చెబుతుండగా.. అలాంటి గోప్యతా ఒప్పందం లేదని ఉక్రెయిన్ వాదించింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మరో 10 వేల మంది ఉత్తర కొరియా సైనికులను రష్యాకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని జెలెన్‌స్కీ ప్రకటించడం గమనార్హం.
ఇదీ చదవండి: భారత్ తల్చుకుంటే.. అమెరికా ఆంక్షలు ఫసక్


