బంగ్లాదేశ్‌కు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చిన పాకిస్థాన్ | Pakistan blocks airspace for Russian flight carrying Bangladeshs nuclear fuel | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చిన పాకిస్థాన్

Sep 29 2026 4:08 PM | Updated on Sep 29 2026 4:46 PM

Pakistan blocks airspace for Russian flight carrying Bangladeshs nuclear fuel

బంగ్లాదేశ్‌లోని రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రానికి రష్యా నుంచి అణు ఇంధనాన్ని తీసుకెళ్లాల్సిన విమానానికి పాకిస్థాన్ తన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో 2026 సెప్టెంబర్ 24న జరగాల్సిన తొలి సరుకు రవాణా వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తీవ్ర విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

రూప్పూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును రష్యా ప్రభుత్వ రంగ అణు ఇంధన సంస్థ రోసాటమ్ నిర్మిస్తోంది. బంగ్లాదేశ్‌కు యురేనియం సరఫరా బాధ్యత కూడా ఆ సంస్థదే. రష్యా నుంచి బయలుదేరే విమానం అజర్‌బైజాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, భారత్ మీదుగా ప్రయాణించి ఢాకా చేరాల్సి ఉంది.

పాకిస్థాన్ అనుమతి ఇవ్వలేదని బంగ్లాదేశ్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫకీర్ మహబూబ్ అనామ్ ధ్రువీకరించారు. అయితే అనుమతి ఎందుకు నిరాకరించారో ఇస్లామాబాద్ నుంచి తమకు స్పష్టమైన కారణం తెలియలేదని ఆయన తెలిపారు. విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత రోసాటమ్ నుంచి గగనతల అనుమతి రాలేదన్న సమాచారం అందిందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి తౌహిదుల్ ఇస్లామ్ చెప్పారు.

తాజా సమాచారం ప్రకారం రోసాటమ్ ప్రత్యామ్నాయ మార్గంలో అణు ఇంధన సరఫరాను పునఃప్రారంభించేందుకు ప్రణాళిక మార్చింది. అక్టోబర్‌లో సరఫరా తిరిగి ప్రారంభం కానుంది. మిగిలిన ఇంధన సరుకులను 7 వేర్వేరు సరుకు విమానాల ద్వారా డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌కు చేరుస్తామని రోసాటమ్ తెలిపింది. ప్రాజెక్టు షెడ్యూల్‌పై ప్రభావం ఉండదని హామీ ఇచ్చింది.

పాకిస్థాన్ హైకమిషన్ మాత్రం ఈ ఘటనకు సాంకేతిక, విధానపరమైన సమస్యలే కారణమని పేర్కొంది. రూప్పూర్ ప్రాజెక్టులో ఇప్పటికే 2 ఏళ్ల ఆలస్యం జరిగింది. ప్రస్తుతం యూనిట్-1లో ఇంధనాన్ని నింపే ప్రక్రియ పూర్తయి, అక్టోబర్‌లో సుమారు 300 మెగావాట్ల విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా జాతీయ గ్రిడ్‌కు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement