విటమిన్ తక్కువైతే గుండె రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తం
కణాల స్థాయిలోనే నష్టం జరుగుతోందని గుర్తింపు
ఎన్‌ఐఎన్ పరిశోధనలో వెల్లడి
సాధారణంగా ఎముకల బలానికి, గట్టితనానికి విటమిన్–డి కావాలని అందరికీ తెలుసు. అయితే శరీరంలో విటమిన్–డి తక్కువగా ఉంటే, అది నేరుగా గుండె ఆరోగ్యాన్ని కణాల స్థాయిలో దెబ్బతీస్తుందని తేలింది. ఈ విటమిన్ స్థాయిలు తగినంతగా లేకపోవడం వల్ల గుండెను కాపాడే సహజ రక్షణ వ్యవస్థ పూర్తిగా పాడైపోతుందని హైదరాబాద్‌కు చెందిన భారతీయ వైద్య పరిశోధన మండలి–జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా కనుగొన్నారు. విటమిన్–డి తగినంత లేకపోతే గుండె కణాల్లో హానికరమైన ఒత్తిడి పెరిగిపోయి, అవి దెబ్బతినడమే కాకుండా కణాలు అకాలంగా చనిపోయే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వివరాలు స్టెరాయిడ్స్ అనే ప్రముఖ అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి.
– సాక్షి, హైదరాబాద్/లాలాపేట
పరిశోధన ఇలా..
శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం ల్యాబ్‌లో ఎలుకలపై రకరకాల ప్రయోగాలు చేశారు. సాధారణ ఆహారం తీసుకునే, తక్కువ విటమిన్–డి ఉన్న ఆహారం తీసుకునే, అలాగే, విటమిన్–డి పూర్తిగా లేని ఆహారం తీసుకునే ఎలుకల గుండెల్లో జరుగుతున్న మార్పులను చాలారోజుల పాటు గమనించారు. దీనితోపాటు ప్రయోగశాలలో ప్రత్యేకంగా పెంచిన గుండె కణాలపైనా పరిశోధనలు జరిపారు.
విటమిన్–డి లోపించిన ఆహారాన్ని తీసుకున్న ఎలుకల గుండెల్లో చెడు ఒత్తిడి, ఆక్సీకరణ నష్టం చాలా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన శరీరంలో కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించే ’గ్లుటాథియోన్’ అనే ముఖ్యమైన రసాయన నిల్వలు వాటిలో పూర్తిగా అడుగంటాయి. గుండెను కాపాడే ఇతర రక్షణ ఎంజైముల పనితీరు కూడా బాగా తగ్గిపోయింది. కణాలను ఒత్తిడి నుండి కాపాడే ప్రధాన అంతర్గత రక్షణ మార్గమైన ’ఎన్‌ఆర్‌ఎఫ్–2’ కూడా ఈ విటమిన్–డి లోపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు పరిశోధకులు నిరూపించారు.
ఒత్తిడిని తట్టుకుని సురక్షితంగా...
శరీరంలో విటమిన్–డి తగినంతగా లేకపోవడం వల్ల సుదీర్ఘకాలం పాటు కొనసాగే ఒత్తిడి కారణంగా గుండె కణాలపై భారం పెరిగిపోతుందని ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆయేషా ఇస్మాయిల్ చెప్పారు. దీనివల్ల కణాలు తీవ్రంగా గాయపడతాయని, కణాలు తమను తాము నాశనం చేసుకునే ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అయితే గుండె కణాలకు ముందే విటమిన్–డి అందించినప్పుడు, అవి ఆ ఒత్తిడిని తట్టుకుని చనిపోకుండా సురక్షితంగా ఉన్నట్లు ల్యాబ్‌లో రుజువైందని తెలిపారు. శరీరంలో తగినంత మోతాదులో విటమిన్–డి ఉండటం వల్ల గుండె కణాలు ఒత్తిడి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోగలవని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు.


