నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జీవవైవిధ్యంలో మరో రెండు కొత్త సరీసృపాలు చేరాయి. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రెండు కొత్త రకాల బల్లి (హెమిడాక్టైలస్) జాతులను హైదరాబాద్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఐరోపాకు చెందిన ప్రతిష్టాత్మక ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ టాక్సానమీ’లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. నల్లగొండ జిల్లా వర్ధమాని గూడెం బస్ షెల్టర్, గుంటు మడుగు ప్రాంతంలో హెమిడాక్టైలస్ కేర్నికాలా బల్లిని కనుగొన్నారు.
స్థానికంగా రాళ్ల కుప్పల మధ్య నివసించే అలవాటు ఉండటం వల్ల దీనికి కేర్నికాలా అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది గరిష్టంగా 49 మి.మీ. పొడవుతో వెనుక భాగంలో ముదురు చుక్కలు, నలుపు రంగు రాళ్లపై కనిపించకుండా దాక్కునేలా రంగు కలయిక ఉంటుంది. ఇది రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తుంది. ఇక, వరంగల్ జిల్లా పాకాల్ వన్యప్రాణి అభయారణ్యం పరిసరాల్లో హెమిడాక్టైలస్ కోయాఒరమ్ బల్లిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ప్రాంత అడవులు, కొండలను సంరక్షిస్తున్న స్థానిక కోయ, గిరిజన తెగ గౌరవార్థం ఈ జాతి బల్లికి కోయాఒరమ్ అని నామకరణం చేశారు. గరిష్టంగా 55.6 మిమీ పొడవుతో ఉండే ఈ బల్లికి బూడిద రంగు శరీరంపై తెల్లటి పువ్వు ఆకారంలో ఉండే నాలుగు ప్రత్యేకమైన మచ్చలు ఉన్నాయి. ఈ రెండు కొత్త జాతుల కలయికతో తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన (ఎండెమిక్) సరీసృపాల సంఖ్య ఆరుకు చేరింది.


