కేటీఆర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న జీవన్‌రెడ్డి. చిత్రంలో రమణ తదితరులు
సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
నిరాధార ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు
రేవంత్ నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి
నా ఆస్తులు, ఆయన కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అన్నదమ్ములు, బావమరిది సాగిస్తున్న దోపిడీని బయట పెట్టినందుకే తనపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో తనపై, కేసీఆర్‌పై సీఎం నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి’అని వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవ¯న్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఏదో కొత్తగా కనుగొన్నట్టు చెబుతున్నడు..
తన ఆస్తులపై సీఎం చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అమెరికాలో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని, ప్రస్తుతం మూడు హోటళ్లుగా అభివృద్ధి చెందాయని చెప్పారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లోనే తన ఆస్తులు, వ్యాపార వివరాలు వెల్లడించానని తెలిపారు. ‘నేను అఫిడవిట్‌లో పెట్టిన విషయాన్నే మళ్లీ కొలంబస్ కొత్తగా కనుగొన్నట్టు చెబుతున్నడు..’అని ఎద్దేవా చేశారు. ‘వ్యాపారం చేసుకోవడం తప్పా? నా భార్యా పిల్లలను కూడా పోషించాలి కదా’అని అన్నారు. తన ఆస్తులు, రేవంత్ కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సవాల్ చేశారు. ‘మా తాతల ఆస్తుల నుంచి మీ తాతల ఆస్తుల వరకు విచారణ చేయండి’అని అన్నారు.
4 వేల పోలీసులతో పర్యటన ఎందుకు?
సిరిసిల్లలో సీఎం పర్యటన ప్రజల మధ్య జరిగినట్లు లేదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను ముందుగానే అరెస్టు చేసి, దుకాణాలు మూసివేయించి పర్యటించారని విమర్శించారు. చేనేత కార్మికుల సమస్యలపై సీఎం సమాధానం చెప్పలేదని, బతుకమ్మ చీరలు, పాఠశాలల దుస్తుల ఆర్డర్లు నిలిచిపోయాయన్నారు. నేతన్న బీమా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నడు..
కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై మూడేళ్లుగా ఆరోపణలు చేస్తూ ఏమి తేల్చారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రజల మనసు ఖాళీగా ఉంటే 420 హామీలు, ఆరు గ్యారెంటీలు గుర్తుకొస్తయి.. అందుకే అటెన్ష¯న్ డైవర్షన్ చేస్తున్నడు’అని విమర్శించారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు రైతులు కరెంటు,రైతుబంధు కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితబంధు, బీసీలకు రూ.లక్ష కోట్లు, మైనారిటీలకు రూ.4 వేల కోట్ల హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌కు ఉప ఎన్నికంటే భయం
అందుకే విజయారెడ్డితో హైకోర్టులో పిటిషన్ వేయించారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. దానం నాగేందర్ పార్టీ మారడంతో ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చిన తరువాత.. ఆ స్థానం ఖాళీ అయిందంటూ అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఆ స్థానానికి ఎన్నిక రావొద్దనే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి తన పార్టీకి చెందిన విజయారెడ్డితో కోర్టులో పిటిషన్ వేయించారని విమర్శించారు. ఎన్నికలంటే రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని అందుకే పిటిషన్ దాఖలు చేయించారని కేటీఆర్ ఆరోపించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికతోపాటు... పార్టీ మారిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.


