సాక్షి, మచిలీపట్నం: గ్రామంలో కష్టం వచ్చిన ప్రతీ ఇంటి దగ్గర వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉండాలని.. ప్రజల్లో మమేకమయ్యేవాడినే మీరు ఎన్నుకోండీ. డబ్బులతో మనుషులను కొనలేరు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులకు సాగునీరివ్వాలనే ఆలోచన ఎమ్మెల్యేకు లేదు. నీళ్లు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కాల్వల్లో సాగునీరు పారకపోయినా... సారా మాత్రం పారుతుంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘జనం గొంతు తడపడానికి తాగు నీరు లేదు కానీ బెల్ట్ షాపులకు మాత్రం కొదవ లేదు. నీరు లేదు వరి పండించడం మానేయండని చంద్రబాబు అంటున్నాడు. అక్టోబర్ 1 తేదీన కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. మీటింగ్ పెట్టి పాత వాళ్లకే పెన్షన్లు ఇచ్చి చంద్రబాబు జారుకున్నాడు. మూడు సెంట్ల స్థలం ఇస్తా.. సైట్ ఓపెన్ అయ్యిందని హడావుడి చేస్తున్నాడు. చంద్రబాబు జీవితంలో పేదవారికి ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.
‘‘పేదలకు పట్టాలిచ్చిన ఘనత వైఎస్సార్, వైఎస్ జగన్‌లకే దక్కుతుంది. కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తేనే గతంలో ఇళ్ల స్థలాలు వచ్చేవి. కానీ ఎలాంటి ఉద్యమాలు లేకుండా వైఎస్ జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. నిజాయితీగా బతికిన కమ్యూనిస్టు నాయకుడు పాటూరి రామయ్య వైఎస్ జగన్‌ను మెచ్చుకున్నారు. ఇంతకంటే ఏం కావాలి మనకు. రిజర్వేషన్లపై కోర్టు ఏం చెప్పిందో వైఎస్ జగన్ అదే చేశారు. కానీ చంద్రబాబు దుర్మార్గంగా జగన్‌పై నిందలు వేస్తున్నారు
..ఇవాళ కోర్టులో అన్ని కేసులు కొట్టించుకున్నారు. మరి రిజర్వేషన్లపై కేసును ఎందుకు నీకు అనుకూలంగా తెచ్చుకోలేదు. డబ్బున్నోళ్లకు, పారిశ్రామిక వేత్తలకు లోకేష్ డోలో 650 అవుతా అంటున్నాడు. పేదలకు లోకేష్ పేరు గుర్తొస్తే పురుగుల మందు గుర్తుకొస్తుంది. హామీల గురించి విలేకరి అడిగితే మమ్మల్ని నమ్మడానికి జనానికి బుద్ధి లేదా అని లోకేష్ అంటున్నాడు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్


