వెన్నుపోటు పార్టీ బీసీలకు మరోసారి ‘వెన్నుపోటు’: వరుదు కల్యాణి | YSRCP Varudu Kalyani Questions Chandrababu Over 34% BC Reservation, Demands Immediate Action For Implementation | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పార్టీ బీసీలకు మరోసారి ‘వెన్నుపోటు’: వరుదు కల్యాణి

Oct 1 2026 7:57 PM | Updated on Oct 1 2026 8:15 PM

Ysrcp Varudu Kalyani Fires On Chandrababu

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు నిజంగా న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి వెన్నుపోటు పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి ఉంటే వెంటనే  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, వైఎస్సర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి సవాల్ చేశారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం కూటమి పార్టీల ఎంపీలు రాజీనామాలు చేస్తే, ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. తద్వారా కేంద్రం దిగివచ్చి బడుగులకు అవసరమైన 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపడుతుందని సలహా ఇచ్చారు.

కేంద్రంపై ఒత్తిడి తేకుండా బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ హామీని  ఎలా అమలు చేస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కేవలం రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా, రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు.

రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన పరిమితులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని, వాటిని అనుసరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రాజకీయ అవసరాలకు కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి సమాజంలో అట్టడుగున ఉన్న బడుగులకు ద్రోహం చేయడం తగదని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

50 శాతం పరిమితిని అధిగమించాల్సి వస్తే అవసరమైన రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాలన్న జ్జానం చంద్రబాబుకు లేదా అని నిలదీశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి  బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు  చట్టపరమైన ప్రక్రియ అవసరం అనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదు అని తెలిసి కూడా  కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జీఓలు జారీ చేయడం వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమె ఇంకా ఏం మాట్లాడరంటే..

ఆ కమిషన్ల నివేదికలపై చర్యలు ఏవీ..?
గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ల నివేదికలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. మంజునాథ కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వంటి కమిషన్లను ఏర్పాటు చేసి నివేదికలు తీసుకున్న తర్వాత వాటిని బుట్టదాఖలు చేసింది. ఆ నివేదికల పరిస్థితి ఏమిటో ప్రజలకు వివరించాలి. కమిషన్ల నివేదికలను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రకటనలతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం వెనుకబడిన వర్గాలకు వెన్నపోటు పోడవడమే.  2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో నష్టం జరిగింది.

ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే బీసీలకు లభించే రాజకీయ అవకాశాలు మరింతగా ఉండేవి.  వేలాది స్థానిక సంస్థల పదవులను బీసీలు కోల్పోయారు. అంతేగాక భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు కాకుండా నిలిచిపోయాయి. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో చంద్రబాబు బాధ్యతగా లేకుండా, రాజకీయ అవసరాలే పరమావధిగా వ్యవహరించారనడానికే ఇదే నిదర్శనం.

గ్రామగ్రామానికి వెళ్లి బాబు ద్రోహాన్ని వివరిస్తాం
కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు తమ రాజకీయ బలాన్ని ఉపయోగించి బీసీల రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.  బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దు. 34 శాతం రిజర్వేషన్ల అమలుపై కూటమి పార్టీలు వెనుకబడిన వర్గాలకు చేస్తున్న దగాను గ్రామగ్రామానకు వెళ్లి బీసీలకు వివరిస్తాం. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిపై ద్రోహం చేస్తున్న తీరును  ప్రజలకు వివరిస్తాం. వైఎస్సార్‌సీపీ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది.  గ్రామగ్రామాన పర్యటించి బీసీలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తాం.  నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పించాలి. బీసీలకు సంబంధించిన సంస్థలు, పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.

వైఎస్‌ జగన్ హయాంలోనే బీసీలకు భరోసా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు అనేక చర్యలు చేపట్టింది.139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లు, డైరెక్టర్లుగా బీసీలకు అవకాశం కల్పించింది.  బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యత కల్పించాం. బీసీల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ద్వారా ప్రైవేట్ బిల్లులు కూడా ప్రవేశపెట్టించాం. 

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్ చేసిన విషయాన్ని  కూడా గుర్తు చేస్తున్నా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీసీలకు భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందించాం.  డీబీటీ ద్వారా రూ.1,22,451 కోట్లు, నాన్-డీబీటీ ద్వారా రూ.50,657 కోట్లు, మొత్తంగా రూ.1,73,109 కోట్లు బీసీలకు అందించాం. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.

పారదర్శక ఎన్నికలే మా లక్ష్యం
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహించడంతో అనేక అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉందని న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరాం. వలసలు, మరణాలు, ఇతర కారణాలతో తొలగించాల్సిన ఓట్లను సరిచేసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలి. తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితాపై మరింత స్పష్టత ఉంటుంది.

సవరణ ప్రక్రియ పూర్తికాకముందు పాత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే తొలగించాల్సిన ఓట్లు కూడా అందులో ఉండే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయి తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే అనవసరమైన వివాదాలకు అవకాశం ఉండదు. ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, ఓటర్ల జాబితా విషయంలో కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కోరారు.

ఇదీ చదవండి: ‘పాన్‌ ఇండియా జోకర్‌ నారా లోకేష్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement