తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగానే బీసీలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మోసం చేయడం, మాయ చేయడం చంద్రబాబుకు అలవాటేనని, ఇప్పుడు బీసీలకు కూడా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. . బీసీలకు రాజకీయంగా అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీనేనని ఆయన స్పష్టం చేశారు.
ఈరోజు(గురువారం, అక్టోబర్ 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి బొత్స మాట్లాడుతూ.. ‘ సుప్రీంకోర్టుకు వెళ్తానని బాబు చెప్తున్నారు.. ఇది మోసం చేయడం కాదా?, బీసీల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే రాజ్యాంగ సవరణ చేయండి వెన్నుపోటు పార్టీలో ఉన్న బీసీ నేతలు.. చంద్రబాబును ఎందుకు నిలదీయరు?, ఎన్నికల కోసం బాబు రాజకీయ డ్రామాలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు చంద్రబాబు మోసాలను గమనించాలి’ అని సూచించారు.
చట్టబద్ధమైన పరిష్కారం చూపండి
‘కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే. మరి బీసీలకు న్యాయం చేయడానికి అడ్డంకి ఏమిటి?, 50 శాతం రిజర్వేషన్ పరిమితిపై న్యాయపరమైన పరిస్థితి తెలిసినా 34 శాతం పేరుతో బీసీలను ఎందుకు మభ్యపెడుతున్నారు?, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామనడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు, చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్టబద్ధమైన పరిష్కారం చూపండి. బీసీల మనోభావాలతో రాజకీయాలు చేయడం చంద్రబాబు మానుకోవాలి. బీసీ రిజర్వేషన్లను వైఎస్సార్‌సీపీ అడ్డుకుందని చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది?.. ఆధారాలు చూపాలి.
బీసీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు?
కోర్టుల తీర్పులకు వైఎస్సార్‌సీపీని బాధ్యులను చేయడం ఏంటి?, రాజ్యాంగపరమైన అంశాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన ఉంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ, కూటమిలోని బీసీ నేతలు తమ నాయకత్వాన్ని పార్లమెంట్‌లో పరిష్కారం కోసం ఎందుకు ప్రశ్నించడం లేదు?, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కూటమిలోని బీసీ నేతలు కూడా గళమెత్తాలి. రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల రాజకీయాలకు ఉపయోగించుకోవడం సమంజసం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా మార్చొద్దు. 1994లోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. అంతా తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం చరిత్రను వక్రీకరించడమే
మా డిమాండ్ ఇదే..
బీసీలకు 34 శాతం తానే ఇచ్చానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సరికాదు. ప్రతి సున్నితమైన అంశాన్నీ రాజకీయ కోణంలో చూడటమే చంద్రబాబు విధానం. బీసీ సోదరులు చంద్రబాబు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలి. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీల ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధమైన, న్యాయపరంగా నిలబడగల పరిష్కారం తీసుకురావాలి’ అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. చంద్రబాబు వరుస డ్రామాలు!


