డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్‌ | ys jagan on YSRCPs Record on BC Empowerment and Welfare | Sakshi
Sakshi News home page

డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు?: వైఎస్ జగన్‌

Oct 1 2026 7:46 PM | Updated on Oct 1 2026 7:58 PM

ys jagan on YSRCPs Record on BC Empowerment and Welfare

తాడేపల్లి: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడవటంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల పేరుతో చేసిన మోసాన్ని ఖండిస్తూ ఎక్స్‌లో వైఎస్‌ జగన్ పోస్ట్‌ చేశారు. బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారని చంద్రబాబుని ప్రశ్నించారు.

‘‘ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు. సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు చేసింది కపట నాటకం కాదా? ఇవాళ  మీరిచ్చిన  జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండి చంద్రబాబూ. 

నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే. మీరు చేయాల్సింది కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారు? 

కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్‌ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం.. బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా?  రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా?’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

చేతల్లో చూపించాలి
బీసీలపై ప్రేమ మాటల్లో కాదని, చేతల్లో చూపించాలని చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘మా ప్రభుత్వ హయాంలో మనసా, వాచా, కర్మణా బీసీలు సహా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగాపైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా పనిచేశాం. చరిత్రలో తొలిసారి విప్లవాత్మకమైన చట్టాన్ని, 2019 ఆగస్టులో తీసుకువస్తూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, కమిటీలలోని నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో  బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించాం.

పదవులు పొందిన ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక మెట్టు పైకి వచ్చి, ప్రజాసేవలో పాల్గొన్నారు. దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వర్గాల్లో సరికొత్త నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత ఒక్క వైఎస్సార్‌సీపీకే దక్కింది. అంతేకాదు 139 బీసీ కులాలను కవర్‌ చేస్తూ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మీ ప్రభుత్వం వద్దే మేం తెచ్చిన చట్టం ఉంది. రెండున్నరేళ్లుగా ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మా మాదిరి మీరు ఎందుకు అమలు చేయలేదు?’’ అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి 
కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘‘ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి. అంతేకాదు, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మాకు మేముగా బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలను కల్పించాం. 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు బీసీలకు అవకాశం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాం. 

చివరకు స్థానిక సంస్థల్లో కూడా జనరల్‌ స్థానాల్లో టిక్కెట్లు బీసీలకే ఇచ్చాం. 13 జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవుల్లో ఆరు, 13 మేయర్‌ పదవుల్లో తొమ్మిది, 84 మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవుల్లో 44 బీసీలకు ఇచ్చాం. 636 మండలాధ్యక్ష పదవుల్లో 239, 639 జడ్పీటీసీల్లో 227 బీసీలకే ఇచ్చాం. చంద్రబాబూ.. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? 

అంతేకాదు.. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీసీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో లబ్ధిపొందాయి. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు మొత్తం రూ.1.82 లక్షల కోట్ల ప్రయోజనం అందించాం. ఇప్పుడు వీటన్నింటినీ నాశనం చేసి బీసీల ఉసురు తీస్తున్నారు. 

ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావడం కోసం మేం ఏర్పాటు చేసిన నిచ్చెనలను విరగ్గొట్టారు. పైగా మీరిచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లు సహా అనేక హామీలను మోసాలుగా మార్చారు. చంద్రబాబూ.. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34% రిజర్వేషన్‌ ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34% రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement