మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్
7,800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు బిడ్డింగ్
భవిష్యత్తు విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి,సరఫరా సామర్థ్యం పెంపు
కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ప్రాజెక్టులు
రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు రెండు డీఏలు
ప్రాజెక్టులకు సంబంధించిన 10 ఈపీసీ ఒప్పందాలు రద్దు.. కొత్తగా మళ్లీ టెండర్లు
కోహెడలోని సమీకృత పండ్ల మార్కెట్‌కు రూ.650 కోట్లు
ఎల్ నినోతో కరువు, ఉపశమన చర్యలపై నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీకి ఆదేశం
నివేదిక వచ్చాక కేంద్ర సహాయం కోసం ఢిల్లీకి మంత్రుల బృందం
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు త్వరలో కేంద్రాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి, సరఫరా సామర్థ్యం పెంచడంలో భాగంగా రాష్ట్రంలో 7,800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సత్వరమే టెండర్లను నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 3,000 మెగావాట్ల సోలార్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించి ఆమోదించింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులు చేపట్టడానికి అనుమతించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు.
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
‘ఎల్ నినో పరిస్థితులతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. రోజూ సగటున 15,000 మెగావాట్ల వరకు గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుండగా, బుధవారం అది రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్లకు చేరింది. గత ఏడాది అత్యధికంగా 16,613 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పెరగనున్న డిమాండ్‌ను తీర్చడానికి 7,800 మెగావాట్ల విద్యుత్ కోసం టెండర్లను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు డీఏలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇటీవల ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలలో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఉన్న బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడనుంది.
ఎల్ నినోపై సుదీర్ఘ చర్చ
రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రంలో ఈ వానాకాలంలో దాదాపు 17 శాతం వర్షపాతం లోటు ఉంది. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారంతో రుతుపవనాల సీజన్ కూడా ముగిసింది. తుపానులు ఉంటే తప్ప మళ్లీ వర్షాలు కురిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కరువు, ఉపశమన చర్యలపై చర్చించిన కేబినెట్ నివేదిక సమర్పించాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని ఆదేశించింది. నివేదిక వచ్చాక అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. శాస్త్రవేత్తలు, మేధావులు, రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ప్రత్యేక మంత్రివర్గ సమావేశం నిర్వహించి మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులపై చర్చించి కార్యాచరణను ఖరారు చేస్తాం. కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి విద్యుత్, ఇతర అంశాల్లో తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ మేరకు త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని నివేదిస్తుంది.
ధాన్యం కొనుగోళ్లకు ఓకే..
ఖరీఫ్ సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల విభాగం అంచనా వేసింది. ఇలావుండగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ప్రపంచ స్థాయి సమీకృత పండ్ల మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తొలి దశ కింద రూ.650 కోట్లను మంజూరు చేసింది.
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై పునఃసమీక్ష
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పునః సమీక్షించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఈపీసీ విధానంలో 2006–07 మధ్యలో జరిగిన 10 సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాలను రద్దు చేసి మళ్లీ కొత్తగా టెండర్లు ఆహ్వానించడానికి అనుమతినిచ్చింది. కల్వకుర్తి ఎత్తిపోతల కింద 14–15 వేల ఎకరాల పెండింగ్ ఆయకట్టుకు సాగునీరు అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. తదుపరి మంత్రివర్గ సమావేశంలో 22ఏ (నిషేధిత భూములు), యూఎల్సీ పెండింగ్ దరఖాస్తులు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు అనుమతిచ్చిన లేఅవుట్లు, జీవో 118, జీవో 76ల కింద కొత్త దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రంలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీకి ఆమోదం తెలిపింది..’ అని మంత్రి పొంగులేటి తెలిపారు.


