ఇక కరువు మండలాల గుర్తింపు | Now the identification of drought hit mandals | Sakshi
Sakshi News home page

ఇక కరువు మండలాల గుర్తింపు

Oct 2 2026 4:25 AM | Updated on Oct 2 2026 4:25 AM

Now the identification of drought hit mandals

వర్షపాతం లోటుతోపాటు సాగు విస్తీర్ణం, నేల తేమ, భూగర్భజలాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం 

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి కరువు మండలాలుగా ప్రకటించేందుకు కసరత్తు ప్రారంభమైంది. వర్షపాతం లోటు, సాగు విస్తీర్ణం తగ్గడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మండలాల వారీగా పరిస్థితిని అంచనా వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, మార్కెటింగ్‌ ఎండీ రాహుల్‌రాజ్, హార్టికల్చర్‌ ఎండీ యాస్మిన్‌ బాషా తదితర అధికారులతో మంత్రి సమీక్షించారు. 

కేంద్ర వ్యవసాయశాఖ రూపొందించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం కరువు పరిస్థితులను గుర్తించాల్సి ఉంటుందన్నారు. కేవలం వర్షపాతం లోటును ప్రాతిపదికగా తీసుకోకుండా.. వర్షపాతం వ్యత్యాసం, ప్రామాణిక వర్షపాత సూచీ (ఎస్‌పీఐ), పొడి కాలం, విత్తిన విస్తీర్ణం, మొక్కల ఆరోగ్య సూచీలు (ఎన్‌డీవీఐ/ఎన్‌డబ్ల్యూఐ), వృక్ష కవచ సూచీ (వీసీఐ), నేల తేమ వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. 

రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భజలాల పరిస్థితి, ప్రవాహ జలాలు, పశుగ్రాసం లభ్యత, తాగునీటి పరిస్థితి, ఉపాధి అవకాశాలు, ప్రజల వలసలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ అంశాల ఆధారంగా వ్యవసాయశాఖ వద్ద ఉన్న సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందించి కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ 100 శాతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement