లోకం మెచ్చిన వీరుడు  | Airline captain Smit Machhar praised after cockpit attack on FlyDubai flight | Sakshi
Sakshi News home page

లోకం మెచ్చిన వీరుడు 

Oct 2 2026 5:47 AM | Updated on Oct 2 2026 5:47 AM

Airline captain Smit Machhar praised after cockpit attack on FlyDubai flight

చిన్ననాటి కల పైలట్‌’ కాదు  

కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని యోచన  

తొలుత టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్, తర్వాత బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌  

ఒక సెమినార్‌తో విమానయాన రంగంపై పెరిగిన ఆసక్తి  

న్యూఢిల్లీ:  కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌.. ఇప్పుడు ప్రపంచమంతటా మార్మోగిపోతున్న పేరిది. సామాన్యుల నుంచి దేశాధినేతల దాకా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన ప్రాణాలను పణంగా పెట్టి 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి.. స్మిత్‌ మచ్ఛార్‌ లోకం మెచ్చిన వీరుడయ్యాడు. పుట్టింది ముంబైలో. పెరిగింది అక్కడే. అతడి కుటుంబం వస్త్ర వ్యాపారంలో కొనసాగుతోంది. దాంతో సహజంగానే అదే వ్యాపారంలోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

 దానికి తగ్గట్టే టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాడు. అది పూర్తయ్యాక వ్యాపారంలో మెళకువలు నేర్చుకోవడానికి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో సైతం ప్రవేశం పొందాడు. విమానయాన రంగంలో చేరాలని, పైలట్‌గా విమానాలు నడపాలన్న ఆలోచన ఏనాడూ లేదు. విమానయానం అతడి చిన్ననాటి కల కాదు. కానీ, విధి రాసిన రాత మరోలా ఉంది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ఉన్నప్పుడు ఓ సెమినార్‌కు హాజరు కావడం స్మిత్‌ ఆలోచనను ఒక్కసారిగా మార్చేసింది. 

అప్పటికి అతడి వయస్సు 19 ఏళ్లు. ఆ సెమినార్‌ స్మిత్‌కు విమానయాన రంగాన్ని పరిచయం చేసింది. ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు.   పైలట్‌ శిక్షణ కోసం స్మిత్‌ న్యూజిలాండ్‌లోని ‘మెయిన్‌ల్యాండ్‌ ఎయిర్‌’ఏవియేషన్‌ కాలేజీలో చేరాడు. స్పైస్‌జెట్‌లో చేరడానికి ముందు అక్కడ శిక్షణ పొందాడు. పైలట్‌ శిక్షణ పూర్తయిన తర్వాత బోయింగ్‌ 737 విమానాన్ని నడిపించాడు. మొదటి వాణిజ్య విమాన ప్రయాణం బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు సాగింది. 

అతడి లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం... 2011 జూన్‌లో స్పైస్‌జెట్‌లో చేరి, 11 ఏళ్లకు పైగా పనిచేశాడు. సీనియర్‌ కమాండర్‌గా, లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. 2020 నవంబర్‌లో స్పైస్‌జెట్‌లో లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌గా మారాడు. ఆ హోదాలో ఇతర పైలట్లకు స్వయంగా శిక్షణ ఇచ్చాడు. వారి పనితీరును పర్యవేక్షించేవాడు. 737–800, 737 మ్యాక్స్‌ 8, 9లతో సహా బోయింగ్‌ 737 విమానాలను దాదాపు 9,750 గంటలు నడిపిన అనుభవం ఉంది. స్పైస్‌జెట్‌లో పైలట్‌–ఇన్‌–కమాండ్‌గా 6,400 గంటలకు పైగా పని చేశాడు. 2022 జూన్‌లో ఫ్లై దుబాయ్‌ సంస్థలో డైరెక్ట్‌–ఎంట్రీ కెప్టెన్‌గా చేరాడు.  

పని గురించే ఆలోచిస్తా
‘బోనాఫైడ్‌ బాంటర్‌’ అనే పాడ్‌కాస్ట్‌లో గత ఏడాది స్మిత్‌ మచ్ఛార్‌ తన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘‘పైలట్‌గా యూనిఫామ్‌ ధరించిన తర్వాత వేరే ఆలోచనలేవీ మనసులోకి రాకుండా జాగ్రత్తపడతాను. పని గురించే వంద శాతం ఆలోచిస్తా. వ్యక్తిగత, వృత్తి జీవితానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల మరింత శక్తి సామర్థ్యాలతో పనిచేయవచ్చు’’అని చెప్పాడు. తాను నడిపించిన ఏ విమానం కూడా అత్యవసరంగా ల్యాండ్‌ కావాల్సిన అవసరం ఏనాడూ రాలేదని వెల్లడించాడు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తన సీనియర్‌ అధికారులు నేర్పించారని పేర్కొన్నాడు. సంక్షోభ సమయాల్లోనూ ప్రశాంతంగా పని చేయగల శక్తి స్మిత్‌లో ఉందని మెయిన్‌ల్యాండ్‌ ఎయిర్‌ సంస్థ సీఈఓ పిలిఫిన్‌ కీన్‌ చెప్పారు. చాలా నిజాయతీ గల వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతాడని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement