ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తన దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.
23 నెలల వేదాంశ్ సింగ్ అనే చిన్నారి 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చికిత్స కోసం సుమారు రూ.9 కోట్లు అవసరమని సమాచారం. ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం కుటుంబానికి కష్టంగా మారడంతో.. ఆ చిన్నారి చికిత్స కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ మొదలైంది.
ముంబైకి చెందిన 26 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మయూరేష్ గుజర్.. తన టీమ్‌తో కలిసి వేదాంశ్ కోసం నిధులు సేకరిస్తున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలిసి.. చిన్నారి పరిస్థితిని వివరించి, తమకు తోచినంత సాయం చేయాలని కోరారు. ఈ ప్రయత్నాలతో ఇప్పటివరకు దాదాపు రూ.2.22 కోట్లు సేకరించినట్లు సమాచారం. అయితే.. సెప్టెంబర్ 21న జరిగిన ఓ సంఘటన చిన్నారి జీవితంలో వెలుగు నింపింది.
మయూరేష్ గుజర్, అతడి టీమ్ లాల్‌బాగ్‌చా రాజా వద్ద ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో.. అనంత్ అంబానీ వారి బ్యానర్లను గమనించినట్లు.. తన కారును ఆపి, టీమ్‌తో దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా.. వేదాంశ్ పరిస్థితి, అతడి చికిత్సకు అవసరమైన మొత్తం, ఇప్పటివరకు వారు చేస్తున్న ఫండ్ రైజింగ్ గురించి అనంత్ అంబానీకి వివరించినట్లు గుజర్ తెలిపారు.
వివరాలు తెలుసుకున్నాక.. వేదాంశ్ చికిత్సకు ఎంత ఖర్చయినా తాను చూసుకుంటానని అనంత్ అంబానీ చెప్పినట్లు గుజర్ తెలిపారు. అంతేకాదు.. వేదాంశ్‌ను తమ ఆసుపత్రికి తీసుకురావాలని సూచించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ ఫోన్ నంబర్లను కూడా మార్చుకున్నారని వెల్లడించారు.
దీనికి సంబంధించిన గుజర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఎన్నో రోజులుగా వేదాంశ్ కోసం తాము కష్టపడుతున్నామని, ఎండ, వానలను లెక్కచేయకుండా నిధులు సేకరిస్తున్నామని చెప్పారు. ఆ సమయంలో అనంత్ అంబానీతో మాట్లాడటం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే వేదాంశ్ చికిత్స ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: గడ్కరీ ఆలోచన: ఇదే జరిగితే.. రోడ్లు అవసరం లేదు!
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు మయూరేష్ గుజర్, అతడి టీమ్‌ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకాలం చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కాలని కోరుకుంటున్నారు. అనంత్ అంబానీ ఉదారతను కూడా కొనియాడారు.


