ఇది కులపరీక్షయే అందువా? | Complaint against Mera Yuva Bharat co ordinator for collecting students caste | Sakshi
Sakshi News home page

ఇది కులపరీక్షయే అందువా?

Oct 1 2026 4:39 PM | Updated on Oct 1 2026 5:06 PM

Complaint against Mera Yuva Bharat co ordinator for collecting students caste

Representative image

చెన్నై: కులం అనేది ఒక వ్యక్తి సామాజిక నేపథ్యాన్ని గుర్తించే సున్నితమైన వ్యక్తిగత వివరంగా పరిగణిస్తారు. అలాంటి సమాచారాన్ని ఏ సందర్భంలో, ఏ అవసరానికి సేకరిస్తున్నారనే అంశం చాలా ముఖ్యం. రక్తదానం వంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తికి, కులానికి ఏ సంబంధమూ ఉండదు. అయితే, ఊటీలో మాత్రం రక్తదానం చేస్తున్న వ్యక్తుల కులాల గురించి అడిగారు.

నీలగిరి జిల్లా ఊటీలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో విద్యార్థుల కుల వివరాలను సేకరించారనే ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ‘మేరా యువ భారత్’ నీలగిరి జిల్లా సమన్వయకర్త ఎస్. రంజిత్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం నీలగిరి జిల్లా పోలీసులను కోరింది.

సెప్టెంబర్ 30న నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో ఈ ఘటన జరిగినట్లు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ జె. ఎబెనసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శిబిరం ప్రారంభోత్సవ సమయంలో విద్యార్థులు ఊటీలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అందించిన రిజిస్టర్‌లో మాత్రమే వివరాలు నమోదు చేయాలని సూచించినట్లు తెలిపారు.

అయితే, రక్తదాన శిబిరం ప్రారంభమైన తర్వాత ‘మేరా యువ భారత్’ నీలగిరి జిల్లా సమన్వయకర్త విద్యార్థులకు ప్రత్యేకంగా అందించిన మరో ఫారంలో వ్యక్తిగత వివరాలతో పాటు కుల వివరాలను కూడా సేకరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ విధంగా వివరాలు సేకరించడం ద్వారా కళాశాలను తప్పుదోవ పట్టించినట్లు అయిందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

విద్యార్థుల అభ్యంతరాలు 
రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన కొంతమంది విద్యార్థులు తమ కుల వివరాలను ఎందుకు సేకరిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. కొంతమంది విద్యార్థులు తాము పూరించిన ఫారం వీడియోలను కూడా చిత్రీకరించారు. ఆ ఫారంలో రక్తదానం చేస్తున్న విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేదా సాధారణ వర్గానికి చెందినవారా అనే వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ అంశంపై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. శిబిరం సమన్వయకర్త ఎస్. రంజిత్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని నీలగిరి జిల్లా పోలీసులను కోరింది. ఈ ఆరోపణలపై పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement