రక్తదానం ప్రాణదానమే | Sakshi Funday Special Story: World Blood Donor Day happens on June 14th each year | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానమే

Jun 14 2026 1:40 AM | Updated on Jun 14 2026 1:40 AM

Sakshi Funday Special Story: World Blood Donor Day happens on June 14th each year

నేడు వరల్డ్ బ్లడ్ డోనర్ డే

రక్తదానం అంటే ప్రాణదానం. సకాలంలో దొరికే రక్తం ఆపదలో చిక్కుకున్న ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడుతుంది. సకాలంలో తగిన రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది మరణిస్తున్నారని, వీరిలో సుమారు 77 వేల మంది మహిళలు ప్రసవానంతర రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. మన దేశంలో ఏటా దాదాపు 1.80 లక్షల మంది సకాలంలో రక్తం అందక మరణిస్తున్నారు.

వీరిలో సుమారు 24 వేల మంది మహిళలు ప్రసవానంతర రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. ఇది విరివిగా అందుబాటులోకి వచ్చినట్లయితే, రక్తం కొరత వల్ల సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంకా రక్తదాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ప్రసవ సమయంలో కొందరు మహిళలకు, శస్త్రచికిత్సల తర్వాత పలువురు రోగులకు రక్తం అత్యవసరం అవుతుంది. సికిల్‌ సెల్‌ ఎనీమియా, థలసీమియా, హీమోఫీలియా వంటి జన్యువ్యాధులతో బాధపడేవారికి; లుకీమియా, లింఫోమా, మల్టిపుల్‌ మైలోమా వంటి రక్తసంబంధ క్యాన్సర్లతో బాధపడేవారికి తరచుగా రక్తం అవసరం అవుతుంటుంది. 

సకాలంలో రక్తం దొరకకుంటే, వీరు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎందరో స్వచ్ఛంద రక్తదాతలు తరచుగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. అయినా, రక్తం అవసరమైన వారికి తగినంత రక్తం అందుబాటులో లేని పరిస్థితులు ఎదురవుతుండటమే విషాదం. మన దేశంలో పరిస్థితులు చూసుకుంటే, రక్తదాతల నుంచి సేకరిస్తున్న రక్తం అవసరానికి తగినంతగా ఉండటం లేదు. గడచిన ఐదేళ్లలో మన దేశంలోని పరిస్థితిని పరిశీలిద్దాం.

రక్తదానంలో టాప్‌ –10
ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్‌క్రాస్‌ సహా పలు స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ఇటీవలి కాలంలో పలు దేశాలలో స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరిస్తున్న రక్తం యూనిట్లలో మన దేశం రెండో స్థానంలో ఉంది.  

 

స్వచ్ఛంద రక్తదాత వల్ల ఏటా సేకరిస్తున్న రక్తం పరిమాణం పెరుగుతూనే ఉంది. అయినా, మన దేశంలో ఏడాదికి దాదాపు ఒక మిలియన్‌ యూనిట్ల కొరత ఎదురవుతోంది.  

రక్త పరిశోధనల చరిత్ర
రక్తం కోల్పోయినప్పుడు ప్రాణాలు పోతాయని మనుషులకు చాలాకాలం కిందటే తెలుసు. అయితే, కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసే పక్రియ తెలుసుకోవడానికే శతాబ్దాల కాలం పట్టింది. అసలు మనుషుల్లో రక్తప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే చాలాకాలం పట్టింది. తొలిసారిగా ఇంగ్లిష్‌ వైద్యుడు విలియమ్‌ హార్వే 1628లో మానవ శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో మ్యాప్‌ చేశాడు. హార్వే రూపొందించిన మ్యాప్‌ ఆధారంగా యూరోపియన్‌ వైద్య పరిశోధకులు రక్తం కోల్పోయిన మనుషులకు రక్తాన్ని ఎక్కించే ప్రక్రియపై రకరకాల ప్రయోగాలు చేశారు.

మనుషులకు జంతువుల రక్తం ఎక్కించే ప్రయత్నం తొలిసారిగా 1667లో చేసినా, ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. తొలిసారిగా బ్రిటిష్‌ ప్రసూతి వైద్యుడు జేమ్స్‌ బ్లండెల్‌ 1818లో ప్రసవానంతరం అధిక రక్తస్రావానికి లోనైన ఒక మహిళకు విజయవంతంగా మనిషి రక్తాన్ని ఎక్కించాడు. అప్పటికి మనుషుల్లోని రక్తమంతా ఒకటే అనుకునేవారు. రక్తంలోని గ్రూపులను ఆస్ట్రియన్‌ వైద్యుడు కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ 1900లో కనుగొన్నాడు. ఈ పరిశోధనకుగాను ఆయనకు నోబెల్‌ బహుమతి దక్కింది.

 

రక్తదాన చరిత్ర
తగిన రక్తాన్ని ఎక్కించడం ద్వారా మనుషుల ప్రాణాలు నిలపడం సాధ్యమయ్యాక బ్రిటిష్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి పెర్సీ లేన్‌ ఆలివర్‌ ప్రపంచంలోనే తొలిసారిగా లండన్‌లో స్వచ్ఛంద రక్తదాతల సేవలను 1921లో ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో గాయపడిన సైనికుల కోసం అమెరికన్‌ రెడ్‌క్రాస్‌ నేతృత్వంలో విస్తృతంగా రక్తసేకరణ ప్రారంభించారు. రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వచేసేందుకు షికాగోలోని కుక్‌ కౌంటీ ఆస్పత్రిలో 1937లో ప్రపంచంలోని తొలి బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేశారు.

ఇది ఏర్పడిన రెండేళ్లకే– 1939లో మన దేశంలోని తొలి బ్లడ్‌బ్యాంకును కలకత్తాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీనిని డాక్టర్‌ శివ్‌దేవల్‌ సింగ్‌ గ్రీవల్‌ ప్రారంభించారు. తొలినాళ్లలో ఏర్పడిన బ్లడ్‌బ్యాంకులు రెండో ప్రపంచయుద్ధంలో గాయపడిన వేలాది సైనికుల ప్రాణాలను నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషించాయి. తొలినాళ్లలో రక్తదానం గురించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉండేవి. ప్రజల్లోని అపోహలను తొలగించడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు రక్తదానం ఆవశ్యకత గురించి 1960లలో సమాజంలో అవగాహన కల్పించడం ప్రారంభించారు.

అప్పటికి ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో బ్లడ్‌బ్యాంకులు ఏర్పడ్డాయి. క్రమంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా బ్లడ్‌బ్యాంకుల ఏర్పాటు మొదలైంది. హెచ్‌ఐవీ మహమ్మారి వల్ల 1980ల నుంచి రక్త సేకరణ విధానాల్లోను, రక్త మార్పిడి జాగ్రత్తల్లోను సమూలమైన మార్పులు వచ్చాయి. రెడ్‌క్రాస్‌ సహా పలు స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినా, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి తగిన రక్తం అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి.

ప్రపంచంలోని కోట్లాది మంది స్వచ్ఛంద రక్తదాతల నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు వెల్లడించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2004లో జూన్‌ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇదే రోజున రక్తదాతల గౌరవార్థం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం, రక్తదాన శిబిరాలను నిర్వహించడం ప్రారంభమైంది. ఈ ఏడాది డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ రక్తదాన దినం కోసం ‘ఒక చుక్క మానవత్వం. రక్తాన్ని ఇవ్వండి. ప్రాణాలను కాపాడండి’ అనే థీమ్‌ను ఎన్నుకుంది.

కృత్రిమ రక్తం కథా కమామిషూ
ఇప్పటి వరకు ఎక్కడ ఎవరికి రక్తం అవసరమైనా, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వచేసే బ్లడ్‌బ్యాంకులే శరణ్యం. రక్తదాతలు తమ రక్తాన్ని ధారపోయాల్సిన అవసరం లేకుండా చేయడానికి, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరమైనా తక్షణమే అందించడానికి వీలుగా అన్ని రకాల గ్రూపులకు చెందిన రక్తం ఉన్నవారికి సరిపోయే కృత్రిమ రక్తాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయోగాలు సాగిస్తూనే ఉన్నారు. తొలిసారిగా 1989లో జపాన్‌ శాస్త్రవేత్తలు ‘ఫ్లూవోసాల్‌’ పేరుతో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. దీనికి ఎఫ్‌డీఏ అనుమతి కూడా లభించింది. అయితే, దీనిని నిల్వచేయడంలో సాంకేతిక ఇబ్బందులు, తయారీ ప్రక్రియలో సంక్లిష్టతలు తదితర కారణాల వల్ల ‘ఫ్లూవోసాల్‌’ తయారీ 1994లో నిలిచిపోయింది.

కృత్రిమ రక్తం తయారీ తొలి ప్రయత్నం శాస్త్రీయంగా విజయవంతమైనా, సాంకేతిక కారణాల వల్ల కార్యాచరణలో విఫలమైంది. అలాగని ఆశలు అడుగంటిపోలేదు. శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. అమెరికన్‌ కంపెనీ ‘బయోప్యూర్‌’ వ్యవస్థాపకులైన శాస్త్రవేత్తలు డాక్టర్‌ బింగ్‌ ఎల్‌ వాంగ్, డాక్టర్‌ కార్ల్‌ డబ్ల్యూ రాష్‌ రక్తానికి ప్రత్యామ్నాయం కాగల ‘హెమోప్యూర్‌–201’ అనే ఉత్పత్తిని 2001లో రూపొందించారు. ఇది ‘హెమోగ్లోబిన్‌ బేస్డ్‌ ఆక్సిజన్‌ క్యారియర్‌’. హెమోగ్లోబిన్‌ ద్వారా తయారు చేసిన ఈ ఉత్పత్తి రక్తం మాదిరిగానే శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయడం ద్వారా ప్రాణాలను నిలిపి ఉంచగలదు. దీనికి ఎఫ్‌ఏడీ అనుమతి లభించింది. ‘ఫ్లూవోసాల్‌’తో పోల్చుకుంటే, దీనికి అనేక సానుకూలతలు ఉన్నాయి.

దీనిని నిల్వచేయడానికి రిఫ్రిజిరేటర్లు అక్కర్లేదు. సాధారణ పరిస్థితుల్లో సైతం ఇది నిక్షేపంగా రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఎలాంటి బ్లడ్‌ గ్రూపు వారికైనా చక్కగా సరిపోతుంది. ఇన్ని సానుకూలతలు ఉన్నా, దీని వాడుక పరిమితంగానే ఉంది. శస్త్రచికిత్సల తర్వాత తలెత్తే ఎనీమియా నివారణ కోసం ‘హెమోప్యూర్‌–201’ వాడుతున్నారు. ఇది రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు. అందువల్ల ప్లాస్మా, ప్లేట్‌లెట్లు వంటి ప్రత్యేక అవసరాల కోసం ఇంకా రక్తదాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.

‘హెమోప్యూర్‌–201’ పరిమితులను గుర్తించాక శాస్త్రవేత్తలు మరింత విస్తృతంగా ప్రయోగాలు సాగించి, తొలిసారిగా బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు  2022లో లాబొరేటరీలో ఎర్ర రక్తకణాలను తయారు చేయగలిగారు. బ్రిస్టల్‌ వర్సిటీ, కేంబ్రిడ్జ్‌ వర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు మూలకణాల నుంచి సేకరించిన ఎర్రరక్త కణాలతో కృత్రిమ ఎర్ర రక్తకణాలను విజయవంతంగా అభివృద్ధి చేయగలిగారు. సికిల్‌సెల్‌ ఎనీమియా, థలసీమియా రోగులకు నేరుగా రక్తం ఎక్కించే బదులుగా ఈ కృత్రిమ ఎర్ర రక్తకణాలను ఎక్కించడం ద్వారా వారి ప్రాణాలను నిలపవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు కృత్రిమ రక్తం తయారీకి జరిగిన ప్రయత్నాలు పాక్షిక ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. ఇవేవీ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి.

పరిమితులు ఏమిటంటే..?
రక్తానికి బదులుగా ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించినవేవీ పూర్తిస్థాయిలో రక్తానికి ప్రత్యామ్నాయం కాకపోవడానికి వీటి పరిమితులే కారణం. రక్తంలోని ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులలో ఎవరికైనా ఇవ్వడానికి పనికొచ్చేలాగానే ‘ఫ్లూవోసాల్‌’, ‘హెమ్‌ప్యూర్‌–201’ వంటి వాటిని, కృత్రిమ ఎర్ర రక్తకణాలను రూపొందించారు. వీటిలో రక్తంలో ఉండే పదార్థాలన్నీ పూర్తిగా ఉండవు. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు, ప్లాస్మా ఉంటాయి. ఇప్పటి వరకు రక్తానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన వాటిలో హెమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలు మినహా ఇతర కీలక పదార్థాలు లేకపోవడమే వీటి పరిమితి. ఇవి రక్తంలోని హెమోగ్లోబిన్‌ను, ఎర్ర రక్తకణాలను భర్తీ చేయగలవు. రక్తం మాదిరిగానే శరీరంలోని జీవకణాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయగలవు.

అయితే, ప్లేట్‌లెట్ల మాదిరిగా రక్తం గడ్డకట్టేందుకు దోహదపడలేవు. ప్లాస్మా మాదిరిగా రక్త పరిమాణాన్ని పెంచలేవు. డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడినవారికి ప్లేట్‌లెట్లు అత్యవసరం అవుతుంటాయి. కాలిన గాయాలకు లోనైన వారికి, విపరీతంగా రక్తస్రావం అయిన వారికి ప్లాస్మా అవసరం అవుతుంది. వీటి కోసం బ్లడ్‌బ్యాంకులపై ఆధారపడాల్సిందే! రక్తదాతల నుంచి సేకరించిన రక్తం ద్వారా ప్లేట్‌లెట్లు, ప్లాస్మా వేరు చేసి రోగులకు ఎక్కిస్తారు.

రక్తం నుంచి అవసరమైన పదార్థాలను వేరు చేసి, నిల్వచేసే పని బ్లడ్‌బ్యాంకులు చేస్తుంటాయి. రక్తం అవసరాలకు ఇప్పటి వరకు కృత్రిమంగా తయారైనవన్నీ పాక్షిక ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటున్నాయి. రక్తానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రూపొందించిన ఉత్పత్తులతో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రక్తం బదులుగా వీటిని ఎక్కించిన రోగులు కొందరిలో అధిక రక్తపోటు, రక్తనాళాల సంకోచం, అరుదుగా గుండెపోటు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరించే రక్తంతో పోల్చుకుంటే, ఈ కృత్రిమ ఉత్పత్తుల ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటోంది.

కృత్రిమ రక్తం భవితవ్యం
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సాంకేతికత సహజ రక్తానికి పరిమిత స్థాయిలో మాత్రమే కృత్రిమ ప్రత్యామ్నాయాలను అందించగలుగుతోంది. వీటిలో ప్లేట్‌లెట్లు, తెల్ల రక్తకణాలు, ప్లాస్మా ఉండనందున ఇవి సహజ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయాలు కాలేకపోతున్నాయి. అయితే, రానున్న ఇరవై ఏళ్లలో ఆక్సిజన్‌ క్యారియర్లుగా ఉపయోగపడే కృత్రిమ రక్త ఉత్పత్తులు ఎర్ర రక్తకణాల కోసం రక్తదాతలపై ఆధారపడే పరిస్థితిని గణనీయంగా తగ్గించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వారి అంచనా ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఆస్పత్రులు ఎర్ర రక్తకణాల అవసరాల కోసం కృత్రిమ రక్త ఉత్పత్తులను విరివిగా వాడటం ప్రారంభిస్తాయి. రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్లేట్‌లెట్లు, ప్లాస్మా తదితర అవసరాల కోసం వినియోగించుకుంటాయి. ఈలోగా మరిన్ని పరిశోధనలు జరిగి, పూర్తిస్థాయిలో సహజ రక్తానికి దీటైన సార్వత్రిక కృత్రిమ రక్తాన్ని (యూనివర్సల్‌ ఆర్టిఫిషియల్‌ బ్లడ్‌) రూపొందించే అవకాశాలు కూడా ఉన్నాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటికే లాబొరేటరీల్లో కృత్రిమంగా గుండె వాల్వులు, తాత్కాలికంగా పనిచేయగలిగే కృత్రిమ గుండెలు సహా పలు కృత్రిమ అవయవాలను తయారు చేయడం సాధ్యమైందని, అదే రీతిలో సహజ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాగల కృత్రిమ రక్తాన్ని తయారు చేయడం కూడా సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement