సందర్భం
ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరు గుతూ ఉంది. దానితో విద్వే షాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తు డిగా కాకుండా స్వచ్ఛమైన నీతి మంతుడైన మానవుడిగా మిగు లుతాడు. ప్రజల మధ్య అడ్డు గోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చి నప్పుడు సోదరభావం దానంతట అదే వెళ్లి విరుస్తుంది. ప్రేమ, అప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది!– అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా) అలోచనలు.
ఎవరీ గోరా? ఒరిస్సాలో పుట్టి(1902 నవంబర్ 15), కృష్ణా జిల్లా విజయవాడను ప్రపంచ నాస్తిక కేంద్రంగా మలచినవాడు. భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు. గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వేళ్ళూను కుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స– ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. అస్పృశ్యతా నివార ణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే– ప్రజల్లో కుల, మతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి.
గోరా అనేకచోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధుర లోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పని చేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్ళి కాలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడ య్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో ఆధ్యాప కుడిగా చేరారు. నాస్తిక కేంద్ర స్థాపన నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన – ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయవాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించి... భార్యా పిల్ల లతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించాడు. సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని అను కున్నారు. ఆ ఆలో చనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు.
సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కుల మతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని ప్రవేశపెడుతూ కృష్ణా జిల్లా ముదు నూరులో ‘నాస్తిక కేంద్రం’ ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా అలహాబాదు, ఢిల్లీలలో పని చేశారు. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పని చేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృత పరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందు వయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత ఆయనదే! అప్పు డాయన వయసు 70 సంవత్సరాలు.
భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జూలై 26న గోరా తుదిశ్వాస విడిచారు. ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే పుట్టే పిల్లలకు ‘గ్రహణం మొర్రి’ రాదని, తన భార్య గర్భ వతిగా ఉన్నప్పుడు తప్పని సరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిదిమంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. రాహు–కేతువులు ఎక్కడో లేరు, సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెబుతూ
ఉండేవారు.
- డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు ‘గోరా’ వర్ధంతి)


