ఏమైనా సరే... ఆరు ఆరే! | Guest Column Special Story On Indian Philosophy | Sakshi
Sakshi News home page

ఏమైనా సరే... ఆరు ఆరే!

Jul 26 2026 12:48 PM | Updated on Jul 26 2026 12:54 PM

Guest Column Special Story On Indian Philosophy

అభిప్రాయం

భారతీయ తత్త్వంలో అరిషడ్వర్గాలు, షడ్దర్శనాలు, షడ్రసాలు, షట్చక్రాలు, షడృతువులు వంటి ఎన్నో భావనలు ఆరు (6) అంకెతో నిర్వచితమయ్యాయి. బౌద్ధంలో షట్పారమితలు, జైనంలో షడ్ద్ర వ్యాలు, జొరాస్ట్రియనిజంలో అమేష స్పెంతాలు, తావోయిజంలో హెక్సాగ్రాం... ఇలా విదేశీ సంప్ర దాయాల్లోనూ ‘ఆరు’ విశిష్టంగా నిలిచింది. ఈ సంప్రదా యాలు, వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించినా, అన్నింటిలోనూ ఆరు పరిపూర్ణతకు సూచికగా నిలవడం విశేషం.

భారతీయ తత్త్వశాస్త్రం మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు శత్రువులుగా గుర్తిస్తే; న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతాలనే ఆరు దర్శ నాలు (షడ్దర్శనాలు) విశ్వాన్ని వివరించాయి. కణాదుని వైశేషిక దర్శనం ఈ విశ్వం సూక్ష్మమైన పరమా ణువులతో నిర్మితమైందని చెప్తూ... దాన్ని ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ మనే ఆరు పదార్థాలుగా విభజిస్తే; పతంజలి యోగం చిత్తవృత్తి నిరోధమే లక్ష్యంగా చూపింది. విష్ణుపురాణం ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యమనే ఆరు గుణాల సమాహారమే భగవంతుడని నిర్వచిస్తే; శైవ సంప్రదాయంలో షట్కోణాకారం శివ–శక్తుల సంయోగానికి సంకేతం. దీని నుంచి జన్మించిన సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడయ్యాడు.

వేదాధ్యయనానికి శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిషమనే షడంగాలు అవసరమైతే; ఆయుర్వేదంలో మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయమనే ఆరు రసాల సమతుల్యతే ఆరోగ్యానికి మూలమని చరక సంహిత చెప్తుంది. శరీరాన్ని కూడా శిరస్, ఉరస్, ఉదరం, పృష్ఠం, ఊర్ధ్వ, అధశ్శాఖలనే ఆరు అంగా లుగా చరక, సుశ్రుత సంహితలు విభజించాయి. హఠయోగం నేతి మొదలు త్రాటక వరకు ఆరు శుద్ధి క్రియలను, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలను నిర్దేశించింది.

కాలగణనలో వసంతం మొదలు శిశిరం వరకు ఆరు ఋతు వులు, రోజుకు ఆరు భాగాలు కనిపిస్తాయి. సంగీతంలో మొదటి స్వరం షడ్జం– నారదీయ శిక్ష ప్రకారం నాసిక, కంఠం, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతాలనే ఆరు అవయ వాల నుంచి పుట్టేది కాబట్టే ఆ పేరు వచ్చింది. జ్యోతిష్యంలో రాశి, హోర, ద్రేక్కాణం వంటి ఆరు వర్గ పట్టికలను షడ్వర్గం అంటారు. ఒక్కో పట్టిక జీవితంలో ఒక్కో కోణాన్ని చూపిస్తుంది. వేదాంతంలో శోక, మోహ, జర, మృత్యు, క్షుధ, పిపాసలనే షడూర్మి మానవ అస్తిత్వపు ఆరు అలలుగా వర్ణితమయ్యాయి.

బౌద్ధంలో దాన, శీల, క్షాంతి, వీర్య, ధ్యాన, ప్రజ్ఞలనే ఆరు పారమితలు మోక్షమార్గం చూపిస్తే; సంసారంలో దేవతలు, మానవులు, అసురులు, జంతువులు, ప్రేతలు, నరకభోగులనే ఆరు గతులు జీవులకు నిర్దేశించబడ్డాయి. జైనంలో జీవ, పుద్గల, ధర్మ, అధర్మ, ఆకాశ, కాలమనే ఆరు ద్రవ్యాలు విశ్వాన్ని నిర్వచి స్తాయి. శ్వేతాంబరులు సామా యికం మొదలు ప్రత్యాఖ్యానం వరకు ఆరు నిత్యకర్తవ్యాలను (షడావశ్యకాలు) పాటిస్తారు.

ఆరు రోజుల సృష్టి
తోరా, బైబిల్‌ల ప్రకారం సృష్టి ఆరు రోజుల్లో పూర్తయి, ఏడవ రోజు విశ్రాంతి జరిగిందని నమ్మకం. ఖురాన్‌ లో ఆరు రోజుల సృష్టి ప్రస్తావన ఏడు చోట్ల వస్తుంది, అయితే విశ్రాంతి భావన అందులో లేదు. ఇస్లాంలో విశ్వాసానికి అల్లా, దూతలు, గ్రంథాలు, ప్రవక్తలు, తీర్పుదినం, దైవ నిర్ణయమనే ఆరు మూలసూత్రాలు (అర్కానుల్‌ ఈమాన్‌) పునాది. జొరాస్ట్రియనిజంలో అహురమజ్డా సృష్టించిన ఆరు అమేష స్పెంతాలు– పశువులు, అగ్ని, లోహాలు, భూమి, జలం, వృక్షాలకు అధిపతులుగా నిలిచాయి. చైనా తావో యిజంలో ఐ చింగ్‌ గ్రంథం ఆరు గీతల 64 హెక్సాగ్రాంలపై నిర్మిత మైంది. ప్రతి హెక్సాగ్రాం ఒక్కో జీవన పరిస్థితిని సూచిస్తుంది.

గణితశాస్త్రంలో ఆరు ఒక పరిపూర్ణ అంకె (1+2+3=6, దాని భాజకాల మొత్తం దానికే సమానం), త్రిభుజ అంకె కూడా. అందుకే పురాతన గ్రీకు గణితవేత్తలు ఆరును విశేషంగా పరిగణించారు. ప్రకృతిలోనూ ఆరు భుజాల నిర్మాణం పదే పదే కనిపిస్తుంది: తేనెతుట్టెలు, మంచు పలకలు, బెంజీన్‌ రింగ్‌లోని కార్బన్‌ అణువులు, అగ్నిపర్వత లావా చల్లారి ఏర్పడే బసాల్ట్‌ శిలా స్తంభాలు (ఉదా: ఐర్లాండ్‌లోని జయింట్స్‌ కాజ్‌వే), అన్నీ షడ్భుజా కారాన్నే ఎంచుకుంటాయి. ఎందుకంటే తక్కువ పదార్థంతో అత్య ధిక స్థలాన్ని ఆవరించే, శక్తిని సమర్థవంతంగా పంచుకునే జ్యామి తీయ ఆకారం అదే.

వేర్వేరు కాలాల్లో ఉద్భవించిన ఎన్నో వైరుధ్య సంప్రదాయా లలో ఆరు అంకెకు ఇంతటి ప్రత్యేక స్థానం ఎందుకు వచ్చిందో చెప్పలేం. తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, గణితం, ప్రకృతి శాస్త్రం అన్నీ ఏకగ్రీవంగా ఈ ఒక్క అంకె చుట్టూ తిరగడం యాదృచ్ఛికమా, ఏదైనా తాత్త్విక సూత్రం దాగుందా? బహుశా ఆరుకే తెలుసు!

- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement