ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:
‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!
మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!
ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.
మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు.
– రాచమడుగు శ్రీనివాసులు


