అతను–ఆమె
ఐవీఎఫ్
కృత్రిమ గర్భధారణ కోసం ఐవీఎఫ్ ప్రక్రియకు వెళ్లడం లో కేవలం చికిత్స మాత్రమే కాకుండా ఇంకా ఉద్వేగపరమైన అంశాలూ ముడిపడి ఉంటాయి. అందుకే దంపతుల హక్కులను కేంద్రప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించిందీ, నిర్వచించింది. పిల్లల పట్ల దంపతులకు ఉండే సహజ ఉద్వేగాల కారణంగా వారు ఏ రకంగానూ ఎక్స్‌ప్లాయిట్ కాకుండా ఉండేందుకు ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లకు కొన్ని కీలకమైన బాధ్యతలనూ, మార్గదర్శకాలను రూపొందించింది. నేడు (జూలై 25న) ‘ఐవీఎఫ్ డే’ సందర్భంగా ఈ వరస కథనాల్లో చివరిదైన ఈ ఆర్టికల్‌లో ప్రభుత్వం నిర్దేశించిన ఆ మార్గదర్శకాలేమిటో చూద్దాం.
కృత్రిమ గర్భధారణ అంశంలో ఇటు సంతాన సాఫల్య కేంద్రాలకూ, అటు ప్రజలకోసం భారతీయ కేంద్ర ప్రభుత్వం ‘ద ఏఆర్‌టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) యాక్ట్ ఆఫ్ 2021’, అలాగే ‘సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021’ కింద కొన్ని చట్టాలు చేసింది. కృత్రిమ గర్భధారణ చికిత్స తీసుకునే పేషెంట్లు (దంపతులు), అండాలను లేదా శుక్రకణాలను ప్రదానం చేసే దాతలు, అలాగే ఐవీఎఫ్ ద్వారా పుట్టే చిన్నారులకు మేలు కలిగేందుకే ప్రభుత్వం ఈ చట్టాలు చేసింది. నైతిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ నియమ నిబంధనలను చట్టపరంగా అందరూ పాటించాలి.
ఏఆర్‌టీ చట్టం 2021 ప్రకారం దంపతులకు ఉన్న హక్కులు...
దంపతులందరికీ తమకు ఉన్న హక్కులపైనా అలాగే ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లలో నిర్వహించే ప్రక్రియల పైనా అవగాహన పొందేందుకుగాను దంపతులు ఏఆర్‌టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) చట్టం గురించి తెలుసుకుని ఉండాలి.
దేశంలోని ప్రతి ఐవీఎఫ్ సెంటర్... కేంద్రంతోపాటు రాష్ట్ర ఏఆర్‌టీ బోర్డు కింద తన సంస్థను నమోదు చేసుకుని ఉండాలి.
→ లెవల్ 1 కింద నమోదైన వారు – బేసిక్ ఫెర్టిలిటీ చికిత్సలు (ఐయూఐ)ల కోసం.
→ లెవల్ 2 కింద నమోదైన వారు – ఐవీఎఫ్, సరోగసీ క్లినిక్స్ కోసం.
చట్టం నిర్దేశించిన నియమ నిబంధనలను ఐవీఎఫ్ డాక్టర్లు, ఎంబ్రియాలజిస్టులు, యాండ్రాలజిస్టులు తప్పనిసరిగా పాటించి తీరాలి.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వసతులు: చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లలో ఉండాల్సిన వసతులూ, ఉపకరణాలూ, పరికరాలూ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) అన్నీ తప్పక / ఖచ్చితంగా ఉండి తీరాలి.
చట్టబద్ధంగా పేషెంట్లు ఇవ్వాల్సిన ఆమోద పత్రాలు (కన్సెంట్) ఆయా నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఫార్మాట్ (టెంప్లెట్స్)లో ఇవ్వాలి.
వయసు: వయసు నిబంధనలను తప్పక పాటించాలి. అంటే మనదేశంలో ఐవీఎఫ్ చికిత్సలు పొందడానికి మహిళల వయసు 21 – 50 ల మధ్య; అలాగే పురుషులు 21 – 55 మధ్య ఉండాలి.
ఇన్‌ఫార్మ్‌డ్ కన్సెంట్: ఐవీఎఫ్ చికిత్సకు తాము అంగీకరిస్తున్నట్టుగా దంపతులు ఆమోదపత్రం (కన్సెంట్) తప్పక ఇవ్వాలి – ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న నిపుణులు... ‘ఐవీఎఫ్ ప్రక్రియ గురించీ, దానివల్ల ఉండే రిస్కులు, దుష్ప్రభావాలూ, ప్రయోజనాలూ, సక్సెస్ రేటూ... ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులూ’... వీటన్నింటి గురించి దంపతులకు తాము వివరంగా చె΄్పామనీ, దానికి వారు ఆమోదం తెలిపారంటూ పేషెంట్స్ నుంచి రాతపూర్వకంగా ఇన్‌ఫార్మ్‌డ్ కన్సెంట్ తీసుకోవాలి.
గోప్యత: తమ వద్ద చికిత్స తీసుకుంటున్న దంపతుల వివరాలూ, వారి మెడికల్ రికార్డులను ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్‌లు పూర్తిగా గోప్యంగా ఉంచాలి. వారి గోప్యతకు (ప్రైవసీకి) ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం రానివ్వకూడదు.
కౌన్సెలింగ్‌తో సహా అన్నీ అందుబాటులో.. ఏదైనా సలహాల కోసం లేదా తమకు వచ్చే సందేహాలను తీర్చుకోవడం కోసం అవసరమైన కౌన్సెలింగ్ సదుపాయాలు పేషెంట్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఆ కౌన్సెలింగ్ నిర్వహించేవారు ఐవీఎఫ్ గురించి అన్ని విషయాలూ పేషెంట్లకు వివరిస్తూ సహాయపడుతుండాలి.
చికిత్స తీసుకునే/వద్దనే హక్కు: తాము ఐవీఎఫ్ తీసుకునేందుకు లేదా చికిత్స తీసుకుంటున్న ఏ సమయంలోనైనా తమకు వద్దనిపిస్తే చికిత్సనుంచి వైదొలగేందుకు పేషెంట్స్ ఎప్పుడూ హక్కు ఉంటుంది.
ఫిర్యాదులకు ఓ కేంద్రం (గ్రీవెన్స్ సెల్)
తమకు కలిగే అసౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు లేదా తమ అసమ్మతిని తెలిపేందుకు ప్రతి క్లినిక్ తమ దగ్గర ఓ ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో క్లినిక్‌పైన తమ అసౌకర్యాలను/ అసమ్మతిని... ఉన్నత వైద్యాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు కూడా పేషెంట్స్‌కు ఎప్పుడూ ఉంటుంది. పేషెంట్స్ ఎవరికి ఫిర్యాదు చేయవచ్చో తెలిపే వివరాలను గ్రీవెన్స్ సెల్ దగ్గర రాసి ఉంచాలి.
కృత్రిమ గర్భధారణ పొందడానికీ, ఈ ప్రక్రియలో కాబోయే తల్లిదండ్రులు తాము మోసపోకుండా ఉండటానికి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలివి. తమకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఈ నియమ నిబంధనలనూ, నైతికాంశాలను కాబోయే దంపతులు తెలుసుకుని ఉండటం వారికి మేలు చేసే అంశం.
పేషెంట్ల హక్కు
తమకు జరుగుతున్న వైద్యపరీక్షలు (డయాగ్నోసిస్), చికిత్స ప్రణాళికలు (ట్రీట్‌మెంట్ ప్లాన్స్), అవి సఫలమయ్యేందుకు గల అవకాశాలు (ప్రొగ్నోసిస్)... వీటన్నింటి గురించి దంపతులు వివరంగా తెలుసుకోవచ్చు. క్లినిక్ నిర్వాహకులు/డాక్టర్లు కూడా ఈ అన్ని వివరాలను ఏమాత్రం దాపరికం లేకుండా పేషెంట్లకు వివరించాలి. పేషెంట్లకు ఇచ్చిన ఇంజెక్షన్లూ, నిర్వహించిన పరీక్షలూ (ఇన్వెస్టిగేషన్లు), నిర్వహించిన లేదా నిర్వహించబోయే ప్రక్రియల అన్ని వివరాలూ... అంటే అండాలు/ శుక్రకణాల/ పిండం (ఎంబ్రియోలు) వీటన్నింటి గురించీ... దాపరికం లేకుండా వివరించడంతోపాటు వీటికి సంబంధించిన అన్ని రికార్డులూ పేషెంట్లకు ఇవ్వాలి. ఈ విషయంలో పేషెంట్ల పట్ల పారదర్శకత పాటించడం క్లినిక్‌లు తప్పనిసరిగా చేసి తీరాలి.
– నిర్వహణ: యాసీన్


