మన దేశంలో దాదాపు 3 కోట్ల మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులోనూ పల్లెల్లో ఉండేవారి కంటే నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండే దంపతులను సంతానలేమి సమస్య ఎక్కువగా బాధిస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లోని 1.83% మందిలో ఈ సమస్య ఉండగా... పల్లెల్లో ఈ సంఖ్య కాస్త తక్కువగా అంటే 1.76%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఎటూ కదలకుండా స్థిరంగా ఉండి చేసే ఉద్యోగాలూ, చాలా దూరాలు ప్రయాణాలు చేయడం వంటి అంశాలు సంతానలేమి సమస్యను పెంచేస్తున్నాయి. అయినప్పటికీ బిడ్డల కోసం ఆరాటం, ఉద్వేగాలూ ఎమోషన్స్ మాత్రం ఇటు పట్టణ ప్రాంతాల్లోనైనా అటు పల్లెల్లోనైనా ఒకేలా ఉంటాయి. కేవలం పిల్లలు లేకపోవడంతో పాటు ఈ కృత్రిమ గర్భధారణ ప్రక్రియలు అవసరమైన వారు ఎవరెవరు, ఏయే కారణాలు వారిని ఫెర్టిలిటీ సెంటర్లవైపునకు ఆకర్షిస్తాయో చూద్దాం...
గర్భధారణ జరగకపోవడానికి కారణాల్లో మూడింట ఒక వంతు మహిళల్లో ఉంటే, మరో మూడింటి ఒక వంతు పురుషుల్లోనూ... ఇంకో మూడింట ఒక వంతు స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఉండవచ్చు. ఈ మొత్తంలోనూ దాదాపు 90% మందిలో లోపమేదో తెలుసుకోవచ్చుగానీ... సంతానలేమికి అసలు కారణాలేమిటో తెలియని కేసులు మరో 10% వరకు ఉంటాయి. సమస్యను ఈ కోణంలో చూసినప్పుడు సంతానం కలగకపోతే దంపతులు ఒకరినొకరు నిందించుకోవడం సరికాదు. అలాగే ఆ ఇంటి కుటుంబ సభ్యులు, సమాజం కూడా ఎవరినీ తప్పు పట్టకూదు.
జడ్జ్ చేయడం అస్సలు సరికాదు. తగిన వైద్యపరీక్షల ద్వారా స్త్రీ, పురుషుల్లో ఈ లో పాలను కనిపెట్టినప్పుడు వాటిల్లో సరిదిద్దగల సమస్యలను చక్కదిద్దాక కూడా గర్భం రాలేదంటే అందుకు కారణాలేమిటో చెప్పలేని, ఏదీ తెలియని అంశాలు (అన్ ఎక్స్‌ప్లెయిన్‌డ్ ఇన్‌ఫెర్టిలిటీ) ఉండవచ్చు. అయితే ఇప్పుడున్న సాంకేతిక అభివృద్ధి, వైద్యరంగంలోని పురోగతితో తగిన కారణాలను తెలుసుకుని, వాటికి చికిత్స అందించడం లేదా వీలుకాని సందర్భాల్లో కృత్రిమ గర్భధారణను సుసాధ్యం చేస్తున్నారు.
కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎవరి కోసమంటే...
కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందునా ప్రధానంగా ఐవీఎఫ్ వంటి ప్రక్రియలు ఎవరెవరికి బాగా ఉపకరిస్తాయో చూద్దాం...
⇒ ఐయూఐ: పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, కదలిక (మొటిలిటీ) అంతగా లేకపోవడం వంటి కారణాలతో గర్భం రాకపోతే... పురుషుల నుంచి వీర్యకణాలను సేకరించి ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.
టెస్ట్‌ట్యూబ్ బేబీ ఎవరెవరిలోనంటే...
⇒ సాధారణ చికిత్సలూ, (ఐయూఐ)తోనూ గర్భం రాకపోవడంతో పాటు... ఇతరత్రా వేరే సమస్యలేవీ లేకుండా ఉండి, ఇంకా వేచిచూసేంత ఓపిక, సమయం లేనివాళ్లకి ⇒ మహిళ వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి; అంతేకాకుండా 35 ఏళ్లు దాటి, మహిళల్లో వారి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోతూ... సాధారణ చికిత్సతో గర్భం రాని సందర్భాల్లో ∙రెండు ట్యూబ్‌లూ మూసుకుపోయిన వాళ్లకి, ట్యూబెక్టమీ తర్వాత, ఏవో కారణాలతో మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు; పురుషుల్లో వాసెక్టమీ చేయించుకున్న తర్వాత మళ్లీ ఏదైనా కారణాల వల్ల పిల్లలను కోరుకుంటూ అందుకోసం ‘రీకెనలైజేషన్’ చేయించుకున్నప్పటికీ సక్సెస్ కానప్పుడు
⇒ ఎండోమెట్రియాసిస్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు
⇒ వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు.
జన్యుపరమైన సమస్యలు: భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు... ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా రూ పొందించిన పిండాలలో ఒక దాన్ని తీసి, ప్రీ–ఇం΄్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ ద్వారా పరీక్ష చేస్తారు. ఇలా చేశాక సమస్యలేవీ లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపే ప్రక్రియ వల్ల జన్యు సమస్య లేని ఆరోగ్యకరమైన సంతానం దాదాపు సాధ్యమే.
⇒ క్యాన్సర్ చికిత్స: దేహంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ వచ్చిందని తెలిశాక... అందుకు చికిత్సగా రేడియేషన్, కీమోథెరపీ చికిత్సకు వెళ్లేముందర, మహిళ తన అండాలను బయటకు తీసి, వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదా అండాలను ఫలదీకరణ చేసుకొని, పిండాలను ఫ్రీజ్ చేసి, చికిత్స పూర్తయ్యాక వాటిని ‘ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్’ పద్ధతిలో గర్భాశయంలోకి పంపవచ్చు.
⇒ సామాజిక కారణాలు: కొందరు కెరియర్ కోసం లేదా వ్యక్తిగత కారణాల వల్ల గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకొని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ద్వారా గర్భశయంలోకి ప్రవేశింపచేయడం ద్వారా గర్భం ధరిస్తారు. మరికొందరు పెళ్లిని వాయిదా వేసుకొని, అండాలను ఫ్రీజ్ చేసుకుంటారు. ఫ్రీజ్ చేసిన అండాలు, పిండాలను ఆ తర్వాత ఉపయోగించుకుంటారు.
ఇలాంటి వారందరూ కృత్రిమ గర్భధారణ ప్రక్రియల కోసం ముందుకెళ్లవచ్చు.
నిర్వహణ: యాసీన్
సాధారణ కారణాలు...
మహిళల్లో:
⇒ అండం విడుదల సరిగా జరగకపోవడం
⇒ గర్భాశయంలో సమస్యలు
⇒ ఎండోమెట్రియాసిస్ సమస్యలు
⇒ ఫెలోపియన్ ట్యూబుల్లో లో పాలు
⇒ ఫలదీకరణ సమస్యలు
⇒ సికిల్‌సెల్ అనిమియా వంటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు.
పురుషుల్లో...
మగవారిలో...
⇒ వీర్యకణాల్లో లో పాలు
⇒ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం
⇒ వీర్యకణాల కదలికలూ తగ్గడం
⇒ వీర్యం నాణ్యత బాగాలేకపోవడం.
ముప్పై ఏళ్ల తర్వాత...
అది 1992వ సంవత్సరం... అప్పట్లో ఒక ల్యాబ్‌లో ప్రాణం పోసుకున్న రెండు జీవకణాలు, బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు ఏకంగా ముప్పై ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రానికి చెందిన రేచెల్, ఫిలప్ రిజ్డ్ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లల కోసం నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్‌లో అప్లై చేశారు. ఫలదీకరణ చెందిన అండాలను డాక్టర్లు రేచల్ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. కొన్ని నెలల తర్వాత రే^è ల్ పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఆమె జన్మనిచ్చింది సాధారణ శిశువులకి కాదు... ఏకంగా ముప్పై ఏళ్ల పాటు ల్యాబ్‌లో పిండస్థ దశలో ఉన్న రెండు జీవాలకి... 1992లో ఓ అజ్ఞాత దంపతులకి ఐవీఎఫ్ ద్వారా పిండాలను సృష్టించారు.
వారికి సంతానం కలిగిన తర్వాత మిగిలిన ఎంబ్రియోలను అలానే భద్రపరిచారు. 2007లో ఈ పిండాలను నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్‌కి దానం చేశారు. చివరికి 2022 మార్చిలో అంటే ముప్పై ఏళ్ల తర్వాత రేచల్, ఫిలిప్ దంపతులు ఈ ఎంబ్రియోలను దత్తత తీసుకోగా వాటిని yీ ఫ్రాస్ట్ చేసి తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. 2022 అక్టోబర్ లో రేచల్ పండంటి కవలలు (ఆడ శిశువు లిడియా, మగ శిశువు థిమోతి)కు జన్మనిచ్చింది.
ఈ జననంతో అప్పటివరకు ప్రపంచంలో అత్యధిక కాలం పిండస్థ దశలో ఉండి పుట్టిన కవల శిశువులుగా లిడియా, థిమోతి రికార్డ్ సృష్టించారు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ ఎంబ్రియోలను ఫ్రీజ్ చేసినప్పుడు అంటే 1992లో రేచల్‌కు అక్షరాలా ఐదేళ్లు. అప్పుడు తయారైన ఎంబ్రియోలకు అదే చిన్నారి పెరిగిన తర్వాత తల్లిగా మారింది. మానవ మేధస్సుతో ఆవిర్భవించిన జీవకణాలు కాలాన్ని జయించి జీవించగలవని ఈ జననం నిరూపించింది.

డాక్టర్ వసుంధర చీపురుపల్లి సీనియర్ గైనకాలజిస్ట్ – ఫెర్టిలిటీ స్పెషలిస్ట్


