
సత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ సీఐ సెలవుపై వెళ్లిపోయారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు తీవ్రంగా అవమానించడంతో మనస్థాపం చెంది సెలవుపై వెళ్లారన్న చర్చ హిందూపురంలో సాగుతోంది. వివరాల్లోకి వెళితే... రెండురోజలు క్రితం హిందూపురం పట్టణానికి చెందిన ఓ టీడీపీ నేత కుమారులిద్దరు పట్టణంలో పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. దీంతో వారిపై టూ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
అయితే తాను పార్టీ కోసం కష్టపడితే... తన బిడ్డలపై కేసు నమోదు చేశారని సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీఏలు రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ ఆంజనేయులుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమకు చెప్పకుండా టీడీపీ నేత కుమారులపై కేసు ఎలా నమోదు చేశావని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తప్పు చేసిన వారిని బాలకృష్ణ పీఏలు వెనకేసుకురావడంతో పాటుగా నిజాయితీగా పనిచేసిన తనపైనే ఆగ్రహంచడంతో సీఐ ఆంజనేయులు మనస్థాపం చెంది సెలవులో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.