breaking news
insemination
-
హార్ట్ఫీషియల్గా అమ్మానాన్నలుగా..
ఇటీవల మనదేశం వ్యంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా వెళుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి అన్నది కేవలం పిల్లలు కలగకపోవడం మాత్రమే కాదు... ఇది మరిన్ని సంక్షోభాలకు... అంటే ఉదాహరణకు జనాభాలో యువత శాతం తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనర్థాలకు దారితీయవచ్చు. దీనివల్ల దేశ ఆర్థిక సంపద తగ్గడంతోపాటు అనేక విధాలా నష్టం జరుగుతుంది. ఈ నెల 25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) డే సందర్భంగా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతులకు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కోసం కొన్ని ప్రశ్నలకు ఇన్ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ కట్టా శిల్ప సమాధానాలు.ఇటీవల మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరగడానికి కారణాలేమిటి?జ: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సామాజికం, రెండు ఆరోగ్యపరమైన కారణాలు. సామాజిక అంశాల విషయానికి వస్తే... ఇటీవల యువత పై చదువులు, మంచి ఉద్యోగాలంటూ కెరియర్ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలు.ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే... మహిళల్లో కనిపించే హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సాధారణంగా దంపతుల్లో సంతానలేమి ఉంటే ప్రధానంగా మహిళనే నిందిస్తారు. ఇదెంతవరకు సమంజసం?జ: ఇది మళ్లీ మరో సామాజిక సమస్య. వాస్తవానికి గర్భం రాకపోతే అందులో తప్పెవరిదీ ఉండదు. కానీ మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే, ఆమెనే తప్పుబడుతుంటారు. నిజానికి గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు మరో 10% మందిలో ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే... ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయపద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి.ఫలానా దంపతులకు సంతానలేమి అనే నిర్ధారణ ఎలా? జవాబు: ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులనుపాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.రెండో రకమైన సంతానలేమి ఏమిటంటే... మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోసం కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఇప్పుడున్న సాంకేతిక పురోగతితో కృత్రిమ గర్భధారణ ఎలా?జ: స్త్రీ, పురుషుల లోపాలు, వాటిని అధిగమించాల్సిన పద్ధతులన్నీ ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు కొన్ని అత్యాధునిక పద్ధతుల్లో సంతాన సాఫల్యాన్ని సాధించవచ్చు. అవి...ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ): అండం విడుదలలో లోపాలు,ఎండోమెట్రియాసిస్, పురుషుల వీర్యకణాల సంఖ్య, కదలికల్లో లోపాలు ఉన్నప్పుడు ఐయూఐ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.ఐవీఎఫ్: స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఐవీఎఫ్ అనే మార్గాన్ని సూచిస్తారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే మాటకు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. దీనికే ‘టెస్ట్ట్యూబ్ బేబీ’ అనే పేరు. ఇందులో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన కొన్ని అండాలను సేకరించి, పురుషుడి శుక్రకణాలతో ప్రయోగశాలలోని ‘టెస్ట్ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు.ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుతాయి. (అందుకే టెస్ట్ట్యూబ్ బేబీ ప్రక్రియను అనుసరించిన చాలామందిలో ట్విన్స్ పుట్టడం సాధారణం.) ఇందులోని ఆరోగ్యకరమైన పిండాలను మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలకు నిర్ధారణ పరీక్షలూ, నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ΄్లాన్ చేస్తారు.ఐసీఎస్ఐ: ఇంట్రా సైటో΄్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అనే ఈ ప్రక్రియ పురుషుల్లో సమస్య ఉన్నప్పుడు అనుసరిస్తారు. ఇది కూడా ఐవీఎఫ్ లాంటిదే. ఇందులో ఎంపిక చేసుకున్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందులోనూ మహిళల అండాల్లో లోపాలు ఉంటే మహిళా దాత నుంచి అండాన్ని సేకరించడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎగ్), పురుషుని వీర్యకణాల్లో లోపాలుంటే దాత నుంచి సేకరించిన శుక్రకణంతో ఫలదీకరణ చేయడం (ఐవీఎఫ్ విత్ డోనార్ స్పెర్మ్), దంపతుల్లోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉంటే మరో మహిళ, మరో పురుషుడి నుంచి అండం, శుక్రకణాలు సేకరించి ఫలదీకరించి దంపతుల్లోని మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎంబ్రియో) అనే పద్ధతుల్లో సంతాన సాఫల్యం కలిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.– డాక్టర్ కట్టా శిల్ప, కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
ఆవుకు ‘డిజిటల్’ కృత్రిమ గర్భధారణ
సాక్షి, హైదరాబాద్: పశువుల కృత్రిమ గర్భధారణ విధానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పశువైద్య నిపుణులు ముందడుగు వేశారు. ఇప్పటివరకు నాటు పద్ధతిలో (జననాంగంలోకి చేయి పెట్టడం ద్వారా) జరుపుతున్న ఈ ప్రక్రియను తొలిసారి డిజిటల్ పద్ధతిలో నిర్వహించారు. ఇందుకు పీవీ నరసింహా రావు పశువైద్య విశ్వవిద్యాలయం వేదిక అయింది. ఈ ప్రయోగంలో భాగంగా లేజర్ కిరణాలతో కూడిన ఎండోస్కోపీ ట్యూబ్ ఇచ్చే డిస్ప్లే సమా చారం ఆధారంగా వీర్యాన్ని ఓ ఆవు గర్భాశయంలోకి పంపారు. ఎండోస్కోపీ ట్యూబ్తోపాటు వచ్చే పెన్డ్రైవ్ను కాలర్ హ్యాంగింగ్ మొబైల్ ఫోన్కు అటాచ్ చేయడం ద్వారా గర్భాశయ ముఖద్వారం, వీర్యం వెళుతున్న విధానం కనిపించేలా ఏర్పాట్లు చేసుకొని ఈ ప్రయోగం నిర్వహించారు. అలా పంపిన వీర్యం పూర్తిస్థాయిలో పశువు గర్భాశయం లోకి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగంలో పశువైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంసింగ్ లకావత్తోపాటు ఇంటర్న్షిప్, ఫైనలియర్ విద్యార్థులు పాల్గొన్నారు. సర్జరీ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ ఇ.ఎల్. చంద్రశేఖర్ సమక్షంలో ఈ ప్రయోగం నిర్వహించారు. నాటు పద్ధతి వల్ల 30–40% ఫలదీకరణే జరుగుతుండగా డిజిటల్ గర్భధారణ విధానంలో 60–70 శాతం వరకు ఫలదీకరణ అవకాశం ఉందని పశువైద్య నిపుణులంటున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోందని పేర్కొన్నారు. -
హోమియోపతితో సంతాన సాఫల్యం
బోసినవ్వులతో, కేరింతలతో, చిలిపి చేష్టలతో పసిపిల్లలు నడయాడే ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది. మరి ఆ పిల్లల సవ్వడి ఇంట్లో వినబడకపోతే, అమ్మా, నాన్నా అనే పిలుపులకు కొందరు తల్లిదండ్రులు నోచుకోకపోతే... ఆ అదృష్టం మనకు లేదా అని బాధపడాల్సిన అవసరం లేదు. హోమియో చికిత్స ద్వారా సంతాన సాఫల్యానికి అవకాశాలున్నాయి. సంతానలేమికి కారణాలు సంతానం లేకపోతే చాలామంది దానికి మహిళలోనే లోపం ఉందని నిర్ధారణకు వస్తారు. కానీ సంతానలోపానికి కారణం దంపతులిద్దరిలోనూ ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలలో: వయసు 32-35 దాటిన స్త్రీలలో అండాశయ సామర్థ్యం తగ్గుతుంది. పీసీఓడీ, గర్భాశయ సమస్యలు, ట్యూబులు మూసుకుపోవడం, పీఐడీ, థైరాయిడ్, డీఎమ్, టీబీ వంటి సమస్యలు, ఎండోమెట్రియాసిస్ మొదలైనవి మహిళల్లో సంతానలేమికి కారణాలు. పురుషుల్లో: వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా అసలు లేకపోవడం, హార్మోన్ల అస్తవ్యస్తత, వరిబీజం, డయాబెటిస్, మూత్రనాళంలో అడ్డు... మొదలైనవి సంతానలేమికి పురుషుల్లో కారణాలు. కొంతమంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య సరిపడా ఉన్నా వాటిలో చలనం తక్కువగా ఉండటం, వాటి ఆకృతి (మార్ఫాలజీ)లో తేడా వంటి అంశాలను గమనించాల్సి ఉంటుంది. కొందరిలో వీర్యకణాల సంఖ్య, చలనం అన్నీ బాగానే ఉంటాయి. భార్యలో కూడా లోపాలు ఉండవు. వీర్యకణాలు అండాన్ని సమీపిస్తాయి. కానీ ఫలదీకరణ జరగదు. ఇందుకు విటమిన్-కె లోపం, వీర్యకణాలకు ఫలదీకరణ శక్తి లోపించడం వంటివి కారణం. చికిత్స: హోమియో చికిత్స ద్వారా సంతానలేమికి కారణమైన అన్ని అంశాలకూ పరిష్కారం లభ్యమవుతుంది. చాలామందికి గర్భం వస్తుంది కానీ నెలలు నిండకుండానే గర్భస్రావం అవుతుంటుంది. అటువంటివారికి కూడా హోమియో ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తే గర్భం నిలుస్తుంది. అయితే ఆయా అంశాలను బట్టి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో వైద్యం అవసరమవుతుంది. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్