అతను–ఆమె
ఐవీఎఫ్
సామాన్య ప్రజలు టెస్ట్‌ట్యూబ్ బేబీ అని పిలిచే ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అంటారు. దీని కంటే ముందుగా కొందరిలో ఇంటా యుటెరైన్ ఇన్‌సెమినేషన్ (ఐయూఐ) ప్రక్రియను అనుసరిస్తారు. ఐయూఐలో మిగతాదంతా నేచురల్ పద్ధతిలోనే జరిగినప్పటికీ కేవలం వీర్యకణాలను నేరుగా యోని మార్గం గుండా సెర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు. దీనితో పోలిస్తే ఐవీఎఫ్ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో దంపతులకు ఓ వరం. ఇందులో వరసగా ఏమేం జరుగుతుందో, స్టెప్ బై స్టెప్ చూద్దాం...
ఐవీఎఫ్‌లో ముందుగా మహిళలో అండాల సంఖ్య పెద్దమొత్తంలో పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి బాగా ఆరోగ్యంగా ఉన్న కొన్నింటిని సేకరించి, పురుషుడి నుంచి సేకరించిన వీర్యకణాలతో ల్యాబ్‌లోని ‘టెస్ట్‌ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు. ఇలా ఫెర్టిలైజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పిండాలూ పెరగవచ్చు.
ఇలా రూపొందించిన పిండాల్లో ఆరోగ్యకరమైన వాటిని మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలప్పుడు ఒకసారి చూసి... మళ్లీ నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ప్లాన్ చేస్తారు.
వరుస క్రమంలో జరిగే ప్రక్రియలు..
(ఒవేరియన్ స్టిమ్యులేషన్) ఇందులో అండాశయాల నుంచి ఎక్కువ అండాలు తయారుకావడం కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్నే ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు. ఈ టైములో వెజైనల్ స్కానింగ్ ద్వారా మహిళలోని అండాలను పర్యవేక్షిస్తూ, హార్మోన్ పరీక్షలు చేస్తూ, అండాల సంఖ్య, సైజు నిర్ణీత స్థాయికి వచ్చేవరకు వేచిచూస్తారు.
అండాలను తీయడం అండాలు తగిన సైజుకు పెరిగాక... అనస్థీషియాతో మహిళకు నొప్పి తెలియకుండా యోని మార్గం నుంచి సన్నటి, పొడవాటి సూది ద్వారా అండాశయాల నుంచి అండాలను బయటకు తీస్తారు. దీన్ని ‘ఎగ్/ఊసైట్ రిట్రైవల్’ అంటారు.
3. ఫలదీకరణ (ఫెర్టిలైజేషన్): బయటకు తీసిన అండాలను మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తూ, మంచి అండాలను వేరుచేస్తారు. వాటిని శుభ్రపరచి, వాటిల్లో నాణ్యమైనవిగా గుర్తించిన వాటిని శుక్రకణాలతో న్యూట్రిషన్ మీడియా ఉన్న ఓ చిన్న డిష్‌లో కలుపుతారు. ఇలా ఫలదీకరణ జరుగుతుంది. ఇది అనేక కణాలుగా విభజితమవుతూ, పిండంగా మారుతుంది. వీటిల్లో ఇలా కలిపిన అండాలన్నీ ఫలదీకరణ చెందకపోవచ్చు. కొన్ని మాత్రమే పిండంగా ఏర్పడతాయి.
→ ఐసీఎస్‌ఐఈ (ఇక్సీ): అండాలను, శుక్రకణాలతో కలిపే సమయంలో కొన్నిసార్లు వీర్యకణాలు వాటంతట అవే అండంలోకి వెళ్లలేకపోవచ్చు. అప్పుడు శుక్రకణాన్ని సన్నటి సూది ద్వారా అండంలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ‘ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఇక్సీ) అంటారు.
కణవిభజన (ఎంబ్రియో కల్చర్): ఫలదీకరణ జరిగిన ఆ అండాలను, న్యూట్రిషన్ మీడియా ఉన్న ఒక డిష్‌లో పెట్టి, ఇంక్యుబేటర్‌లో 3 – 5 రోజుల పాటు అలా ఉంచేస్తారు. వీటిలో కణాలు విభజన జరుగుతూ తయారైన పిండాన్ని 3 నుంచి 5 రోజులలోపు బయటకు తీసి, మైక్రోస్కోప్‌లో వాటి నాణ్యతను పరీక్షిస్తారు.
ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్: ఇంక్యుబేటర్‌లో కాస్తంత పెరిగిన పిండాల్లోని నాణ్యమైన వాటిని వేరుచేసి, వాటిలో 2, 3 పిండాలను సన్నటి కాన్యులా ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మిగిలిన పిండాలను ఫ్రీజ్ చేస్తారు. ఇలా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్’ అంటారు.
ఇంప్లాంటేషన్: ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ద్వారా గర్భాశయంలోకి పంపిన పిండాలు... గర్భాశయంలోని పొరలోకి అంటుకుపోయి, పెరగడం మొదలవుతాయి. ఇది అందరిలోనూ నార్మల్‌గా జరగకపోవచ్చు. ఈ ప్రక్రియ సజావుగా జరడానికి, గర్భాశయపొర బాగుండాలి. దానికి రక్తప్రసరణ, హార్మోన్లతో పాటు ఇంకా తెలియని అనేక అంశాలు సరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భాశయం పిండాన్ని స్వీకరిస్తుంది. అలా స్వీకరిస్తేనే గర్భం నిలుస్తుంది. అయితే అందరిలోనూ పిండం ఎందుకు అతుక్కోదనే దానికి కారణాలు ఇంకా తెలియదు. అందుకే ఈ ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) పద్ధతిలోనూ గర్భం దాల్చే అవకాశాలు 40 – 50 శాతమే!
ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్
→ పిండం గర్భాశయపొరలోకి అంటుకుపోయేలా చేసే ‘ఇంప్లాంటేషన్’ సక్సెస్ అయ్యేందుకు కొన్ని మందులను మాత్రలూ, ఇంజెక్షన్లూ, జెల్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.
→ దంపతుల్లో ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ పద్ధతి ఒకసారి ఫలించకపోతే, మళ్లీ కొన్ని నెలలు ఆగి, మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు. ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నించి చూస్తారు. ఒకసారి సఫలం కాకపోతే, మళ్లీ ఒకసారి దంపతులకు చేయించిన పరీక్షలన్నీ తిరిగి సరిచూసుకుంటూ, కారణాలను పునఃసమీక్షించుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ విశ్లేషించుకుంటూ, అవసరమైన పరీక్షలేమైనా ఉంటే అవి కూడా చేయిస్తూ, చికిత్సల్లో కొద్దిపాటి మార్పులు చేస్తూ, డాక్టర్లు టెస్ట్‌ట్యూబ్‌బేబీ పద్ధతిని మళ్లీ ప్రయత్నిస్తారు.
కన్నది మేమే కాని...
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పాట వరకు పాడుకుంటాం కాని, నిజ జీవితంలో కొన్ని తికమకల వల్ల జీవితాలే తలకిందులవుతాయి. నవ మాసాలు మోసి కన్న తల్లికి పుట్టింది తన బిడ్డ కాదని అంటే? ఐవీఎఫ్ పద్ధతిలో జరిగిన తప్పిదాల వల్ల ఇప్పుడు అలాంటి వింతలే వినాల్సి వస్తోంది.
అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన టిఫనీ స్కోర్, ఆమె భర్త స్టీవెన్ మిల్స్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. ఫెర్టిలిటీ సెంటర్ ఆఫ్ ఓర్లాండ్‌లో రూపొందించిన ఎంబ్రియోలలో ఒక దానిని టిఫనీ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. 2025 డిసెంబర్ 11న టిఫనీ ఆరోగ్యవంతమైన ఆడబిడ్డ (షియా)కు జన్మనిచ్చింది. కాని ట్విస్ట్ ఏంటంటే, పుట్టిన బిడ్డకి జన్యుపరంగా టిఫనీ, స్టీవెన్‌లు తల్లిదండ్రులు కారు. డీఎన్‌ఏ పరీక్ష చేయించగా... ఆ బిడ్డకి బయోలాజికల్స్ పేరెంట్స్ తాము కాదని తెలిసింది. కాని టిఫనీ మనసు బరువైంది. జన్యుపరంగా తమ బిడ్డ కాకపోయినా నవ మాసాలు మోసింది తానే కదా.. ఆ మాతృత్వ భావన తనని, బిడ్డని వేరు చేయడానికి ఇష్టపడలేదు.. షియాని తామే పెంచుకుంటామని టిఫనీ, స్టీఫెన్లు నిర్ణయించుకున్నారు.
మరో సంఘటనలో ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లోని ఓ ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ మోనాష్ ఐవీఎఫ్ సెంటర్‌లో మానవ తప్పిదం కారణంగా ఒక మహిళకు మరో కుటుంబానికి చెందిన ఎంబ్రియో పొరపాటున బదిలీ అయ్యింది. ఇది తెలియక సదరు మహిళ గర్భం దాల్చి ఒక మగశిశువుకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి ఇప్పుడు రెండేళ్లు కావస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై విచారణ చేయగా పొరపాటు వల్లే ఇంతటి పెను సమస్య వచ్చిందని నిర్ధారించారు. ఈ రెండు కథలలో బిడ్డకు జన్యుపరంగా తల్లులు కాలేకపోయినా పేగుపాశం ఆ బంధాలను శాశ్వతం చేసింది.
డాక్టర్ రాధికా గుప్తా
సీనియర్ కన్సల్టెంట్ – ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
నిర్వహణ: యాసీన్


