రీల్స్‌ దాటి రియల్‌ వరల్డ్‌లోకి | Teenagers From the World of Reels to Real-World Leaders | Sakshi
Sakshi News home page

రీల్స్‌ దాటి రియల్‌ వరల్డ్‌లోకి

Jul 23 2026 5:51 AM | Updated on Jul 23 2026 5:51 AM

Teenagers From the World of Reels to Real-World Leaders

సందర్భం

వారిని స్మార్ట్‌ఫోన్  తో పుట్టిన తరం అన్నారు. ‘స్క్రీన్‌ అడిక్ట్స్‌’ అని ముద్ర వేశారు. కాని నేటి జెన్‌–జి టీనేజర్లు మూస అంచనాలను ముక్కలు చేస్తున్నారు. కేవలం మార్కుల వేటలోనో ఆటల మైదానంలోనో వారు లేరు. సమాజంలోని తప్పులపై గొంతు విప్పుతున్నారు. సోషల్‌ మీడియాను అందుకు వేదికగా మలుస్తున్నారు. మరి ఇంతటి సామాజిక స్పందన గల పిల్లల పట్ల తల్లిదండ్రుల కర్తవ్యం ఏంటి? ‘గుడ్‌’ అనాలా? ‘నో’ అనాలా?

హైదరాబాద్‌లో 10వ తరగతి చదివే అన్విత తన స్కూల్‌లో ‘నో ఫుడ్‌ వేస్ట్‌’ క్యాంపెయిన్‌ మొదలుపెట్టింది. లంచ్‌ అవర్‌లో మిగిలిన అన్నాన్ని అనాథాశ్రమానికి పంపే సిస్టమ్‌ వచ్చేలా చేసింది.

బెంగళూరులో కొంతమంది టీనేజర్లు వృద్ధుల కోసం ‘డిజిటల్‌ సహాయ కేంద్రం‘ నడుపుతున్నారు. ఫోన్ లో యాప్‌ డౌన్ లోడ్‌ చేయడం దగ్గర నుంచి ఆన్ లైన్‌ పేమెంట్‌ వరకు వారికి నేర్పుతున్నారు. చెట్లను కొట్టేస్తున్న ప్రతిసారీ ‘సేవ్‌గ్రీన్‌’ పేరుతో టీనేజర్స్‌ రంగంలో దిగుతూనే ఉన్నారు.

ఒకప్పుడు పిల్లలంటే ఉదయం స్కూలు, సాయంత్రం ట్యూషన్, ఆదివారం సినిమా అనుకునేవాళ్లం. కానీ 2026 నాటి టీనేజర్లు ఆ గీతలన్నీ చెరిపేశారు. అన్యాయం కనిపిస్తే గొంతు విప్పుతున్నారు. గతంలో సమాజంలో ఏం జరుగుతుందో పెద్దలు చెబితేనే పిల్లలకు తెలిసేది. కానీ నేడు డిజిటల్‌ విప్లవం వల్ల ప్రపంచంలోని ప్రతి చలనం పిల్లలకు తెలిసిపోతూ ఉంది. 

గ్లోబల్‌ వార్మింగ్, సామాజిక సమానత్వం, లింగ వివక్ష, జంతు సంరక్షణ వంటి విషయాలపై వారు కేవలం పోస్టులు చదివి ఊరుకోవడం లేదు. లేదా పోస్టులు పెట్టడంతో ఆగడం లేదు. ఆ కారణాల కోసం వీధుల్లోకి వస్తున్నారు. ఒక అన్యాయం జరిగితే డిజిటల్‌ పిటిషన్లు వేస్తున్నారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సేకరించి బాధితులకు సాయం చేస్తున్నారు. వారి ఆలోచనల్లో స్వార్థం లేదు, వ్యవస్థను మార్చాలనే పట్టుదల తప్ప. మార్పు తమతోనే మొదలు కావాలని వారు బలంగా నమ్ముతున్నారు.

‘నో’ చెప్పాలా? ‘గుడ్‌’ అనాలా? 
పిల్లలు సామాజిక విషయాలపై తీవ్రంగా స్పందిస్తున్నప్పుడు ఇళ్లలో ఒక రకమైన నిశ్శబ్ద ఆందోళన మొదలవుతుంది. ‘ఇప్పుడే ఈ గొడవలు ఎందుకు? చదువు పాడు కాదా? కెరీర్‌ ఏమైపోతుంది? సమాజం మారదు, మన పిల్లలు ఇబ్బందుల్లో పడతారు’ అనే భయాలు తల్లిదండ్రులను వెంటాడుతుంటాయి. ఇది జనరేషన్‌ గ్యాప్‌ ఆందోళన. 

ఈ ఆందోళనతో పిల్లల ఉత్సాహాన్ని ‘నో’ అని నొక్కేయడం తప్పు. అలాగని ప్రతిదానికీ కళ్లు మూసుకుని ‘గుడ్‌’ అని వదిలేయడమూ ప్రమాదకరమే. ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఎంత సమాచారం ఉందో, అంతకంటే ఎక్కువ తప్పుడు ప్రచారాలు (ఫేక్‌న్యూస్‌), అజెండాలు ఉంటాయి. ఇంకా మానసికంగా పూర్తిగా పరిణతి చెందని టీనేజర్లు సులభంగా భావోద్వేగాలకు లోనై తప్పుదారి పట్టే లేదా సైబర్‌ బుల్లీయింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది నిషేధం కాదు, వివేకంతో కూడిన మార్గదర్శకత్వం. మరి ఏం చేయాలి?

అనుభవం అనే గేట్లు
పిల్లల చైతన్యం ఒక స్వచ్ఛమైన ప్రవాహం లాంటిది. అయితే ఆ ప్రవాహానికి పెద్దల అనుభవం అనే గట్లు తోడైనప్పుడే అది సమాజానికి ఉపయోగపడే శక్తిగా మారుతుంది. రేపటి పౌరులను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం అంటే వారి రెక్కలను కత్తిరించి పంజరంలో పెట్టడం కాదు. ఎటు ఎగరాలో, ఎలాంటి సుడిగాలులను తట్టుకోవాలో దిశను చూపించడం. జెన్‌–జి పిల్లల సామాజిక ఆరాటాన్ని గౌరవిస్తూ, వారికి అనుభవంతో కూడిన అండగా నిలవడమే నేటి పెద్దల అసలైన కర్తవ్యం. 
అప్పుడే ఈ తరం రీల్స్‌ ప్రపంచం నుండి రియల్‌ వరల్డ్‌ లీడర్స్‌గా ఎదుగుతుంది.

పెద్దలు చేయాల్సిన 5 పనులు
నేటి పిల్లలకు ‘డిక్టేటర్స్‌’ (శాసించేవారు) అవసరం లేదు. వారికి కావాల్సింది ’మెంటర్స్‌’ (మార్గదర్శకులు). తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలకు స్పేస్‌ ఇస్తూనే, రక్షణ కవచంగా మారాలి. 
→ ముందు వినండి: పిల్లలు దేని గురించి మాట్లాడుతున్నారో, ఏ సమస్యపై ఆందోళన చెందుతున్నారో ముందు కూర్చోబెట్టి వినండి. వారి అభి్రపాయాలను చిన్నపిల్లల మాటలని కొట్టిపారేయకండి.
→ లాజిక్‌తో సరిదిద్దండి: ఒకవేళ వారు తీసుకున్న స్టాండ్‌ ఆవేశపూరితంగానో లేదా తప్పుగానో అనిపిస్తే ‘వద్దు’ అని అరిచే కంటే, ఎందుకు వద్దో లాజికల్‌గా చెప్పండి. లీగల్‌ అంశాలను సున్నితంగా వివరించండి.
→ డిజిటల్‌ హైజీన్‌ నేర్పండి: సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాదని చెప్పాలి. ఉద్వేగంలో పెట్టే ఒక్క పోస్ట్‌ వారి భవిష్యత్తును, కెరీర్‌ను ఎలా దెబ్బతీస్తుందో ఉదాహరణలతో వివరించండి.
→ ఆచరణాత్మక మార్గం చూపండి: సమాజం కోసం ఏదో చేయాలనే వారి తపనను కేవలం ఆన్ లైన్‌ హ్యాష్‌ట్యాగ్‌లకే పరిమితం చేయకుండా, స్థానిక స్వచ్ఛంద సంస్థల్లో (ఎన్‌.జి.ఓ) సభ్యత్వం ఇప్పించడం, పర్యావరణ సేవల వంటి ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారి ఎనర్జీని సరైన దిశలో మళ్లించవచ్చు.
→ సమతుల్యత నేర్పండి: సామాజిక స్పందన మంచిదే అయినా, అది వారి చదువును, భవిష్యత్తును దెబ్బతీయకుండా సమతుల్యత పాటించాలని చెప్పండి. కెరీర్‌– కాజ్‌ రెండూ ముఖ్యమే అని చెప్పండి.

కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement