
ఒకప్పుడు నెలకు రూ.18,000 వేతనం వస్తున్నా, దేశంలోని ఖరీదైన నగరాల్లో ఒకటైన బెంగళూరులో నివసిస్తూ సంతోషంగా ఉన్నానని ఓ మహిళ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో గతంలో కంటే భారీగా జీతం సంపాదిస్తున్నా అప్పటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇదికాస్తా నెటిజన్ల కంటపడి వైరల్‌గా మారింది.
సీమా పురోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘బెంగళూరులో నా మొదటి ఉద్యోగం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నెలకు కేవలం రూ.18,000 సంపాదిస్తూ, దాన్ని అదృష్టంగా భావించి, సంతోషంగా జీవించాను. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిగా నేను ఫీల్ అయ్యాను. తక్కువ జీతంతో కూడా జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాను. బెంగళూరులో పీజీ ఫీజు చెల్లించడానికి, వీధుల్లో షాపింగ్ చేయడానికి, క్యాంటీన్‌లో తినడానికి, ప్రతి వారాంతంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి పోను ఇంకా కొంచెం డబ్బు మిగిలి ఉండేది’ అని చెప్పారు.
‘ప్రస్తుతం దుబాయ్‌లో పని చేస్తున్నాను. గతంలో కంటే భారీగానే వేతనం వస్తుంది. కానీ జీవితంలో సంతోషం కోల్పోయాను. అప్పటి ఆనందాన్ని చాలా మిస్ అవుతున్నాను’ అని వీడియోలో చెప్పుకొచ్చారు. ఆమె మాటలు ఆన్‌లైన్‌లో చాలా మందికి కనెక్ట్ అయ్యాయి. దాంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘మీరు చెప్పింది నిజమే.. ఇక్కడి జీవితం నాకు అసంతృప్తిగానే ఉంది’అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘పని-జీవిత సమతుల్యత, మానసిక ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు’ అని మరొకరు కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర!