నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు | nightclub market grow steadily know how to business going on in night clubs | Sakshi
Sakshi News home page

నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు

Dec 11 2025 1:24 PM | Updated on Dec 11 2025 1:24 PM

nightclub market grow steadily know how to business going on in night clubs

గోవా నైట్‌క్లబ్‌లో ఇటీవల జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌తో నైట్‌లైఫ్‌ ఇండస్ట్రీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, దాని ఆర్థిక వ్యవస్థలోని అంశాలు చర్చకు వస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే లైట్లు, డీజే సంగీతం ఉండే నైట్‌క్లబ్‌ల్లో కోట్లాది రూపాయల బిజినెస్‌ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. భారతదేశంలో కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి నగరాలు ఈ రాత్రిపూట వినోద రంగంలో ఏటా సుమారు 10% వృద్ధిని నమోదు చేస్తున్నాయి.

నైట్‌క్లబ్ వ్యాపార నమూనా

నైట్‌క్లబ్‌లు ప్రధానంగా అధిక మార్జిన్ కలిగిన ఉత్పత్తులు, సర్వీసులను విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జిస్తాయి. నైట్‌క్లబ్ ఆదాయంలో అత్యంత కీలకమైన భాగం ఆల్కహాల్, ఇతర పానీయాల విక్రయం. పానీయాలపై లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. వీఐపీ టేబుల్స్ లేదా ప్రత్యేక విభాగాల్లో ‘బాటిల్ సర్వీస్’ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇందులో కస్టమర్‌లు అధిక ధరలకు ఖరీదైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తారు. దీనికి ప్రత్యేక సర్వీస్ అందిస్తుండడంతో నైట్‌క్లబ్‌లు ఆదాయం సంపాదిస్తాయి.

ప్రవేశ రుసుము, కవర్ ఛార్జీలు

వారాంతాల్లో లేదా ప్రత్యేక ఈవెంట్‌ల సమయంలో కస్టమర్‌ల సంఖ్యను నియంత్రించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ రుసుము లేదా కవర్ ఛార్జ్ (దీనిలో కొంత మొత్తం పానీయాలకు లెక్కిస్తారు) వసూలు చేస్తారు.

ప్రత్యేక ఈవెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లు

ప్రముఖ జాతీయ/ అంతర్జాతీయ డీజేలు, కళాకారులతో ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా టికెట్ ధరలను పెంచుతుంటారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో కస్టమర్‌లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.

కార్పొరేట్ ఈవెంట్‌లు

ప్రైవేట్ పార్టీలు, కార్పొరేట్ ఫంక్షన్‌లు, ప్రొడక్ట్ లాంచ్‌ల కోసం క్లబ్‌ను అద్దెకు ఇస్తుంటారు.

బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు

మద్యం, సాఫ్ట్‌డ్రింక్స్ లేదా ఇతర లైఫ్‌స్టైల్ బ్రాండ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.

నిర్వహణ, సవాళ్లు

నైట్‌క్లబ్‌ను విజయవంతంగా నడపడం కేవలం సంగీతం, డ్రింక్స్‌కు సంబంధించినది మాత్రమే కాదు. ఇది సంక్లిష్టమైన నిర్వహణ సవాళ్లతో కూడుకుంది. మద్యం లైసెన్స్, అగ్నిమాపక భద్రతా ధ్రువీకరణ, మ్యూజిక్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వంటి అనేక రకాల అనుమతులను పొందాలి. వాటిని ఎప్పటికప్పుడు రెన్యువల్‌ చేసుకోవాలి. గోవాలో జరిగిన సంఘటన వంటి వాటి నేపథ్యంలో నైట్‌క్లబ్‌ల భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వాల నుంచి పర్యవేక్షణ, నియంత్రణ మరింత కఠినతరం కావాల్సి ఉంది.

భద్రతా వాతావరణం

నాణ్యమైన ధ్వని, లైటింగ్ సిస్టమ్, విభిన్న వాతావరణం (Ambiance), ప్రముఖ డీజేల ఎంపిక క్లబ్ పేరును, ప్రజాదరణను పెంచుతాయి. తాగుబోతుల నియంత్రణ, గొడవలు, ముఖ్యంగా మహిళా కస్టమర్ల భద్రత కోసం బలమైన భద్రతా సిబ్బంది అవసరం.

ఖర్చుల నిర్వహణ

క్లబ్‌ల ఏర్పాటు కోసం స్థలం అద్దె, విద్యుత్, నీరు, బీమా వంటి స్థిర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. క్లబ్‌లో స్టాక్‌ను నిర్వహించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, పానీయాల నాణ్యతను కాపాడటం లాభాలకు కీలకం. డీజేలు, బార్‌ అటెండర్లు, వెయిటర్లు, భద్రతా సిబ్బందికి అయ్యే వేతనాలుంటాయి.

భద్రతా ప్రమాణాల ఉల్లంఘనల పర్యవసానం

క్లబ్‌ల్లో కిటికీలు లేని చీకటి ప్రదేశాలు, ఇరుకైన మెట్లు, మూసివేసిన ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం లేదా ఉన్నా పని చేయకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను పెంచుతాయి. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన క్లబ్ యజమానులు, నిర్వాహకులు భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులను ఎదుర్కోవలసి వస్తుంది. భద్రతా వైఫల్యాలు క్లబ్ బ్రాండ్‌కు, నైట్‌లైఫ్ పరిశ్రమ ప్రతిష్టకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

ఇప్పుడేం చేయాలంటే..

భారతదేశంలో నైట్‌క్లబ్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. అయితే, ఇది నిలకడగా, సురక్షితంగా మనుగడ సాగించాలంటే కేవలం లాభాలపైనే కాకుండా.. భద్రతా ప్రమాణాలపై, చట్టపరమైన నిబంధనల అమలుపై నిర్వాహకులు, ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలి. గోవా సంఘటన లాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వ్యాపార లాభాలతో పాటు కస్టమర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తక్షణ అవసరం.

ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement