
ఒకప్పుడు రచయిత తాను రాసిన నవలలను ప్రచురణ సంస్థ ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేసి పాఠకుల చెంతకు చేర్చేవాడు. లేదంటే అప్పట్లో వచ్చిన వారపత్రికలు, సీరియళ్లు తదితర మాధ్యమాల ద్వారా తన నవల ఇతివృత్తాన్ని పాఠకులతో పంచుకునేవారు. ప్రస్తుతం వారపత్రికలు ఆదరణ కోల్పోవడం, సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగా రచయితలు నేరుగా పాఠకులతో సంభాషించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
తద్వారా పుస్తక ప్రియుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్‌లో రచయితలను, పాఠకులను ఒక చోటకు చేర్చేందుకు పలు క్లబ్స్ సైతం ఏర్పాటయ్యాయి. అంతేకాదు వాటికి డిమాండ్ కూడా పెరుగుతోంది. నవలలను పాఠకుడికి చేర్చడం, పాఠకుడి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, తద్వారా పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకోవడం ప్రస్తుతం ట్రెండ్‌గా నడుస్తోంది.
దశాబ్దం క్రితం రచయితలు పాఠకులతో ముచ్చటించడానికి తమ నవలను పరిచయం చేయడానికి అక్షర పుస్తక విక్రయశాలతో పాటు, సప్తపరి్ణ, లా మకాన్, రవీంద్ర భారతి, ఆంధ్ర సారస్వత పరిషత్, విశాలాంధ్ర బుక్‌హౌస్, స్టార్ హోటళ్లు, ప్రసాద్ ల్యాబ్స్, ప్రెస్‌క్లబ్స్ తదితర వేదికలను ఎంచుకునేవారు. ప్రస్తుతం వీటితోపాటు ఈ క్లబ్స్ కూడా రచయితలకు బాసటగా నిలుస్తున్నాయి.
ఆఫ్‌లైన్ క్లబ్ పేరుతో..
పాఠకులతో నేరుగా ముచ్చటించేందుకు పలువురు రచయితలు ఎదురు చూస్తున్న తరుణంలో కొన్ని క్లబ్స్ వేదికలుగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ఆఫ్‌లైన్ క్లబ్ పేరిట కొంత మంది యువతీ, యువకులు ఓ క్లబ్‌ను ఏర్పాటుచేసి, రచయితలను ఆహా్వనిస్తూ.. పాఠకులతో ముచ్చటించే సదావకాశాన్ని కలిగిస్తున్నాయి.
ఇందుకోసం వీరు స్టార్ హోటళ్లను, పెద్ద పెద్ద హాళ్లను ఎంచుకోకుండా ఆసక్తిగలవారు ఉండేచోటనే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం కెఫేలు బుక్ చేసుకుంటూ నెల రోజుల ముందు నుంచే ఆ రచయితతో మాట్లాడుతూ ఫలానా తేదీన రచయితతో ఇంటరాక్షన్ ఉంటుందని తెలియజేయడం, ఆ తర్వాత పరస్పర భావాలు పంచుకోవడానికి వేదికగా నిలుస్తున్నారు.
యువ రచయితల సంఖ్య పెరుగుతోంది..
ఔత్సాహిక యువ రచయితలను ప్రోత్సహిస్తూ.. పాఠకులను, రచయితలను ఒకే వేదికపై చేర్చి ఓ గొప్ప సాహిత్య సంఘాన్ని నిర్మించాలన్నదే లక్ష్యం. ఇప్పటి వరకూ ఎందరో రచయితలతో ఈ ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహించాం. నగరంలో యువ రచయితల సంఖ్య పెరుగుతోంది. పాఠకులతో ముచ్చటించాలనుకునే రచయితలు ఇన్‌స్టా ద్వారా ఆఫ్‌లైన్ క్లబ్‌లోగానీ, ఆథర్ బ్యాంటర్ క్లబ్‌లోగానీ సంప్రదించవచ్చు.
– బిశ్వరూప్ బారిక, ఆఫ్‌లైన్ క్లబ్ వ్యవస్థాకురాలు
పాఠకులు ఉత్సాహంగా సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు ఇటీవల యువ రచయిత చైతన్య ముంగందతో ఆయన రాసిన ‘ప్రేమ కావ్యం’ నవలపై క్లబ్‌లో ముచ్చటించాం. జూబ్లీహిల్స్‌లోని ఓ కెఫే దీనికి వేదికైంది. ఈ ప్రేమ కావ్యం ఓ మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆశయాలు, బాధ్యతలు, సంబంధాలను సమతుల్యం చేస్తూ.. ఓ విద్యార్థి ప్రొఫెషనల్‌గా మారడాన్ని చిత్రీకరించింది.
పాఠకులు ఎంతో ఉత్సాహంగా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
– మహ్మద్ నుష్రత్ ఖాద్రి
పాఠకులతో ప్రత్యేక సెషన్స్..
తాము రాసిన నవల సారాంశాన్ని, అందులోని పాత్రలను కూలంకషంగా చర్చించేందుకు పాఠకులు ముందుకొస్తున్నారు. పలువురు రచయితల తమ పుస్తక ప్రయాణాన్ని, ఆ పుస్తకాల్లోని కథల సారాంశాన్ని చర్చిస్తున్నారు. ఆఫ్‌లైన్ క్లబ్స్ ఇన్‌స్టాలో చురుకుగా ఉంటూ కొత్త రచయితలను ప్రోత్సహించడమే కాకుండా పాత రచయితలను కూడా ఈ వేదికలకు దగ్గరచేస్తున్నారు. ప్రతి సెషన్ కూడా పుస్తక సంతకంతో ముగుస్తుస్తోంది. ఇది రచయితలకు, పాఠకులకు ఒక మధురానుభూతిని కల్పిస్తుంది. కెఫేల్లో కాఫీ విత్ ఆథర్ పేరుతో ఇటీవల కాలంలో ఈ తరహా కార్యక్రమాలు జోరందుకున్నాయి.
గొప్ప అనుభూతినిచ్చింది..
‘ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రెయిన్ బో’ అనే పుస్తకాన్ని రచించా. ఇది భావోద్వేగ ప్రేమకు ప్రతీక. నిజజీవిత సమస్యలు, సామాజిక అంచనాలు తాకుతుంది. పోరాటాలు, భావోద్వేగాలను అన్వేషిస్తూ ఆశను కలిగిస్తుంది. కష్టాల ద్వారా ప్రేమ బలాన్ని చూపుతుంది.
ఆఫ్‌లైన్ క్లబ్ ద్వారా పాఠకులతో నేరుగా ముఖాముఖిలో పాల్గొన్నా. వారి అభిప్రాయాలను విని, సందేహాలను నివృత్తి చేశా. రాయడం కన్నా.. సారాంశాన్ని పాఠకులతో పంచుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది.
– కావ్య కృష్ణన్, రచయిత్రి
ఆవిష్కరణ కేంద్రాలుగా..
రచయితలు, పాఠకులను ఒక చోట చేర్చడం, ఆఫ్‌లైన్ క్లబ్ రచయితల సమావేశాలు ఏర్పాటు చేయడం, రచయితలను, పాఠకులను ఒక చోట చేర్చడం నగరంలో కొంతకాలంగా జరుగుతున్న ట్రెండ్. వారానికోమారు గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో రచయితలతో సమావేశాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. పాఠకుల నుంచి వస్తున్న ఆదరణను రచయితలు కూడా ఆస్వాదిస్తున్నారు.
(చదవండి: 22 నుంచి నవకర్ నవరాత్రి ఉత్సవ్)