స్టార్‌ పేరెంటింగ్‌ | Star celebrities parenting experiences on social media platform | Sakshi
Sakshi News home page

స్టార్‌ పేరెంటింగ్‌

Dec 16 2025 12:44 AM | Updated on Dec 16 2025 12:44 AM

Star celebrities parenting experiences on social media platform

‘పేరెంటింగ్‌ అంటే ఇలా ఉండాలి. ఇలా మాత్రమే ఉండాలి’ అని పుస్తకంలో రాసుకొని ఏ తల్లిదండ్రులు పేరెంటింగ్‌ చేయరు. పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి.  అది సహజమైనది. సృజనాత్మకమైనది. ఎవరి దారి ఏదైనా అందులోని మంచి ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సోషల్‌ మీడియా వేదికగా  ప్రియాంక చోప్రా, ట్వింకిల్‌ఖన్నా, కరీనా కపూర్, సానియా మీర్జా... మొదలై వారు వివిధ సందర్భాలలో తమ పేరెంటింగ్‌ అనుభవాలను పంచుకున్నారు. పాతతరం, కొత్తతరంలోని అంశాలతో మిళితమైన ఈ నయా పేరెంటింగ్‌ గురించి...

మన మూలాల్లోకి...
‘గ్లోబల్‌ ఐకాన్‌’గా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ప్రియాంక చోప్రా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరవలేదు. కూతురు మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలు తెలిసేలా పెంచుతోంది. అమెరికాలో ఉన్నా సరే ఇంట్లో రోజూ హిందీ వినపడాల్సిందే. దీంతో మాల్తీ చిన్న చిన్న హిందీ మాటలు మాట్లాడుతుంటుంది. కూతురు నోటి నుంచి హిందీ వినిపించినప్పుడు ఆ తల్లి సంతోషం ఇంతాఅంతా కాదు!

ప్రియాంక మాటల్లో చెప్పాలంటే... ‘భాష అనేది కమ్యూనికేషన్‌ మాత్రమే కాదు, కనెక్షన్‌ కూడా!’ భాష మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తుంది. అమెరికాలోని తన ఇంట్లో ఇండియాను ఆవిష్కరించడానికి మన పండగలను తప్పనిసరిగా జరుపుకుంటుంది ప్రియాంక. వాటి వి«శిష్ఠత గురించి పిల్లలకు చెబుతుంది. మనదైన సంగీతం వినిపిస్తుంది. మన జానపద కథలు చెబుతుంది. ఇంట్లో  వండిన భారతీయ వంటకాల గురించి వివరిస్తుంది.

‘మా అమ్మాయికి పనీర్, బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని సంతోషంగా చెబుతుంది ప్రియాంక. ‘నా ప్రయత్నాల వల్ల భౌగోళికంగా,  సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా తాను ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాల్తీ తెలుసుకోగలుగుతుంది’ అంటుంది ప్రియాంక. మన మూలాలను మరిచిపోనివ్వని పేరెంటింగ్‌ ఎలా ఉంటుందో ప్రియాంక 
పెంపకంలో చూడవచ్చు. ‘నా కూతురు నా నీడ కాదు. నా వారసత్వం... మాల్తీ ఒక ఫైర్‌’ అని కూతురు గురించి మురిసిపోతుంటుంది ప్రియాంక.

తల్లే గురువు
టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌కు తల్లి మాత్రమే కాదు, ఆటలో గురువు కూడా. ఆమె తల్లి నసీమా మీర్జా షేర్‌ చేసిన వీడియోలో సానియ ఇజాన్‌తో కోర్టులో తిరగడం, ఫోర్‌ హ్యాండ్, బ్యాక్‌ హ్యాండ్‌ గురించి నేర్పించడం కనిపిస్తుంది. నసీమా ఈ అందమైన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.... ‘నోస్టాల్జిక్, నోస్టాల్జిక్, నొస్టాల్జిక్‌! కూతురు, మనవడు ఒకే రకమైన పాషన్‌తో టెన్నిస్‌ ఆడుతున్న దృశ్యం చూడడం’ అని రాసింది.

నసీమాకు సానియా బాల్యం గుర్తొచ్చి ఉంటుంది. చిన్నారి సానియాతో తాను కూడా టెన్నిస్‌ కోర్టులకు వెళుతుండేవి. ‘ఆటలెందుకమ్మా...చక్కగా చదువుకోకుండా’ అని ఆమె అని ఉంటే టెన్నిస్‌ స్టార్‌గా సానియా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘పిల్లల  ఇష్టాయిష్టాలు కనిపెట్టాలి, ఇష్టపడే వాటిలోనే వారిని తీర్చిదిద్దాలి’ అనే సూత్రాన్ని నమ్మి పాటించింది నసీమా. 

ఇప్పుడు ఆమె కూతురైన సానియా కూడా  అంతే. కుమారుడు ఇజాన్‌లోని ఇష్టాన్ని కనిపెట్టి ఆ చిన్నారికి టెన్నిస్‌లో ఓనమాలు దిద్దిస్తోంది. తల్లే గురువు అయితే అంతకంటే ఆనందం ఏముంటుంది! తల్లికొడుకులకు తేడా ఏమిటంటే... తల్లి రైట్‌–హ్యాండెడ్‌. కొడుకు లెఫ్ట్‌–హ్యాండెడ్‌. ఒక పాషన్‌తో ఏడు సంవత్సరాల ఇజాన్‌ స్ట్రోక్స్‌ ప్రాక్టిసింగ్‌ చూస్తుంటే, ఈ సాధన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఇజాన్‌ తల్లి మెచ్చిన తనయుడు అవుతాడు అనడంలో సందేహాం లేదు.

ఆమె అడుగు జాడల్లో..
పేరెంటింగ్‌కు సంబంధించి పెద్దలు మహా విశ్వవిద్యాలయాలు! కరీనా కపూర్‌కు సంబంధించి మహా విశ్వవిద్యాలయం ఆమె అత్తయ్య షర్మిలా ఠాగోర్‌. ‘ఎప్పుడూ మీ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తుంటాను’ అని షర్మిలా ఠాగోర్‌కు ఇటీవల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది కరీనా. ఈ సందర్భంగా అత్తయ్య ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. పిల్లలతో షర్మిల ఎలా కలిసిపోతుందో చెప్పడానికి ఈ ఫొటోలే సాక్ష్యం.

ఆరోజుల్లో సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల చిన్నారి సైఫ్‌ అలీఖాన్‌తో ఎక్కువ సమయం గపపడానికి షర్మిలకు సమయం చిక్కేది కాదు. దాని గురించి ఇప్పటికీ బాధ పడుతూ ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతుంటుంది. ఎలాంటి అంతరాయం కలిగించకుండా పిల్లల మాటలను శ్రద్ధగా వింటుంది ఠాగోర్‌. ‘మన నుంచి పిల్లలే కాదు, పిల్లల నుంచి మనం నేర్చుకునేది కూడా ఏదో ఒకటి ఉంటుంది’ అంటుంది షర్మిలా.

‘కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. పిల్లల పెంపకానికి సంబంధించి సంప్రదాయ విధానాలకు, ఆధునికి విధానాలను జత చేయాలి’ అంటుంది షర్మిలా ఠాగోర్‌. అత్తయ్య మాటలను అక్షరాల అనుసరించే ప్రయత్నం చేస్తోంది కరీనా కపూర్‌.

ఆత్మగౌరవం
పేరెంటింగ్‌కు సంబంధించి రచయిత్రి, నటి ట్వింకిల్‌ఖన్నా తన తల్లి డింపుల్‌ కపాడియాను సందర్భానుసారంగా ఉదాహరిస్తుంటుంది. ప్రసిద్ధ బాలీవుడ్‌ నటి డింపుల్‌ కపాడియ ఆరోజుల్లో మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తూ ఉండేది. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల చదువు, బాగోగులకు  సంబంధించి అశ్రద్ధ వహించేది కాదు. పొద్దున అయిదు గంటలకే లేచి వ్యాయామాలు చేస్తూ ఉండేది.

‘వ్యాయామాలు చేస్తున్న అమ్మను చూస్తున్నప్పుడు సూపర్‌ ఉమెన్‌ను చూసినట్లుగా ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ట్వింకిల్‌ ఖన్నా. ఆత్మగౌరవానికి సంబంధించి తన తల్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతుంటుంది ట్వింకిల్‌. ‘మీరు ఆధారపడగల ఏకైక వ్యక్తి మీరే. ప్రతి మహిళా స్వతంత్రంగా ఉండాలి’ అని కూతుళ్లు ట్వింకిల్, రింకిలకు చెబుతుండేది డింపుల్‌.

‘అత్తయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలతో మా ఇళ్లు సందడిగా ఉండేది. ఇంట్లో ఎందరు ఉన్నప్పటికీ అమ్మతో గడపడం అనేది అపురూపమై అనుభవం’ టింకిల్‌ ఖన్నా దృష్టిలో పేరెంటింగ్‌ అంటే... ‘పేరెంటింగ్‌ నిర్మాణత్మకంగా ఉండాలి. అదే సమయంలో స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్‌లో క్రమశిక్షణ ఉండాలి. సరదాగా నవ్వుకునే స్వేచ్ఛ ఉండాలి. పేరెంటింగ్‌లో బ్యాలెన్సింగ్‌ అనేది ప్రధానం’ ‘పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పుడు తల్లిదండ్రులు సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారు’ అని చెబుతున్న ట్వింకిల్‌ ఖన్నా వాటి పరిష్కార మార్గాల గురించి పత్రికలలో, పుస్తకాలలో, సోషల్‌ మీడియాలో రాస్తూ ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement