పేరెంటింగ్‌కు సంబంధించి ఇప్పుడు సరికొత్త ట్రెండ్... ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్. కొందరికి నచ్చినా, నచ్చకపోయినా ఇన్‌స్టాగ్రామ్ అనధికారికంగా కొత్త పేరెంటింగ్ మాన్యువల్‌గా మారింది. పేరెంటింగ్‌కు సంబంధించిన సలహాల కోసం పెద్దలు, ఇరుగు పొరుగువారు, వైద్యులు, పుస్తకాల మీద ఆధారపడడం అనేది ఒక విధానం. దీనికి భిన్నంగా ఆన్‌లైన్ దారిలో వెళ్లడమే ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్.
శిశువుకు పాలివ్వడం నుంచి పిల్లలను స్కూలుకు పంపడం వరకు పేరెంటింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. మనసులోని సందేహాన్ని టైప్ చేస్తే చాలు సెకన్‌ల వ్యవధిలో వందలాది వీడియోలు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడతాయి. ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్ ప్రత్యేకత ఏమిటంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది.
బేబీఫుడ్, రెండు సంవత్సరాల పిల్లలకు కలర్‌ఫుల్ ప్లేట్స్, సూటబుల్ డయపర్స్... మొదలైన ఎన్నో విభాగాల ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. ‘గతంలో పేరెంటింగ్‌కు సంబంధించి సందేహాలు, సమస్యలు, సవాళ్లు కుటుంబ పరిధిలోనే ఉండేవి. ఇప్పుడు మాత్రం పేరెంట్స్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి.
ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి సలహాల కోసం ఇతరుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. సోషల్ మీడియా విస్తృతస్థాయిలో పేరెంటింగ్ విధానాలను పరిచయం చేయడంతో, చిన్న కుటుంబాల వారు పేరెంటింగ్‌కు సంబంధించిన సలహాల కోసం సోషల్‌మీడియాపై ఆధారపడుతున్నారు. ట్రెండ్ సంగతి ఎలా ఉన్నా, నిజంగా ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్ తల్లిదండ్రులకు సహాయపడుతుందా? లేక ఒత్తిడిని పెంచుతుందా?
‘కంటెంట్‌లో కొంత భాగం పరిశోధన ఆధారితమైనప్పటికీ, ఎక్కువ శాతం ట్రెండ్ ఆధారితమైనది. పేరెంటింగ్‌కు సంబంధించి సలహాలు, సూచనలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రొఫెషనల్, పర్సనలైజ్‌డ్ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్ సమానం కాదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్ శిశువు చరిత్ర, స్వభావం, ఆహార అలవాట్లు, ఆరోగ్య అవసరాలు తల్లిదండ్రుల మానసిక పరిస్థితులను అంచనా వేయదు’ అంటున్నారు నిపుణులు.


