కాంతార వివాదంపై హీరో రిషబ్ శెట్టి స్పందించారు. రణ్‌వీర్ సింగ్ చేసిన కామెంట్స్ తనకు అసౌకర్యంగా అనిపించాయని అన్నారు. చెన్నైలో జరిగిన బిహైండ్‌వుడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రిషబ్ ఈ వివాదంపై మాట్లాడారు. ప్రతిష్టాత్మక వేదికలపై దేవతలను ప్రస్తావిస్తూ మిమిక్రీ చేయకూడదని సూచించారు. కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు గౌరవప్రదంగా చిత్రీకరించామని తెలిపారు.
రిషబ్ మాట్లాడుతూ, 'కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు పాప్ కల్చర్‌గా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక చిత్రనిర్మాతగా నేను ప్రతిదీ గౌరవప్రదంగా చిత్రీకరించాలి. వాటిని నిర్ధారించుకోవడానికి చాలా మంది పెద్దల మార్గదర్శకత్వం తీసుకున్నా. దేవతలపై మిమిక్రీ చేయడం నాకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సినిమాలో చాలా భాగం సినిమాటిక్, నటనకు సంబంధించింది. అయినా కూడా దైవం అనేది సున్నితమైన అంశం. ఎక్కడికి వెళ్లినా, వేదికలపై దేవతలను అపహాస్యం చేయవద్దని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం' అని అన్నారు.
కాగా.. ఈ చిత్రంలోని పంజర్లీ దేవతను ఉద్దేశించి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ చేసిన కామెంట్స్ ఆడియన్స్ ఆగ్రహానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇఫ్ఫీ వేడుకలో రణవీర్ సింగ్ పంజర్లీ దేవతను ఇమిటేట్ చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్‌వీర్ సింగ్ క్షమాపణలు కోరారు. తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రిషబ్ శెట్టి నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశమని అని అన్నారు. కాగా.. ఈ ఏడాది కాంతార: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


