ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం. కానీ ఇప్పుడు యువత.. అదంటేనే భయపడుతున్నారు. సరే సరైన జాబ్ లేదు, పోషించేందుకు డబ్బులు లేవు కదా వివాహానికి నో చెబుతున్నారని అనుకోవచ్చు. బోలెడంత ఫేమ్, కోట్లాది ఆస్తి ఉన్న స్టార్ హీరోహీరోయిన్లు కూడా కొందరు ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయారు. అలాంటి కొందరి గురించి ఈ స్టోరీ.
ఇండియన్ స్టార్స్‌లో బ్యాచిలర్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్‌లో గత కొన్ని దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లతో రిలేషన్, డేటింగ్ రూమర్స్ వచ్చాయి గానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. బహుశా ఇతడికున్న అనారోగ్య సమస్యలు కావొచ్చు. లేదంటే తన స్నేహితుల వైవాహిక జీవితంలో సమస్యల ప్రభావం కావొచ్చు సల్మాన్.. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు. ప్రస్తుతం ఇతడికి 59 ఏళ్లు. ఇకపై చేసుకునే అవకాశమే లేదు.
(ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)
ఈ లిస్టులో నెక్స్ట్ ఉండేది ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వరస సినిమాలు చేస్తున్నాడు. పెదనాన్న కృష్ణంరాజు బతికున్నప్పుడే ప్రభాస్‌కి పెళ్లి చేసేస్తాం అని చాలాసార్లు చెప్పారు. కానీ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత అస్సలు ఖాళీ అన్నదే దొరకట్లేదు. గతంలో హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ వచ్చాయి గానీ తామిద్దరం స్నేహితులు మాత్రమే అని చెప్పారు. అయితే ఇటు ప్రభాసే కాదు అటు అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. ఇకపై కూడా వీళ్లిద్దరికీ(వేర్వేరుగా) జరుగుతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో లేదు.
రీసెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ 'ధురంధర్'లో విలన్‌గా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడు అక్షయ్ ఖన్నా కూడా బ్యాచిలరే. ప్రస్తుతం ఇతడి వయసు 50 ఏళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి చాలానే కారణాలున్నాయి. గతంలో కరిష్మా కపూర్‌తో ఇతడికి వివాహం సెట్ అయి, రద్దయిందని.. అప్పటినుంచి అక్షయ్ ఖన్నా ఒంటరిగానే ఉండిపోయాడనేది టాక్. అలానే మరో వ్యక్తి బాధ్యత తీసుకోవడం తనకు సూట్ కాని పనికాని కూడా అక్షయ్ చెప్పాడు. చూస్తుంటే జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోవడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
ఈ లిస్టులో తర్వాతి నటి టబు. ఈమె వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. మరి పెళ్లి చేసుకుంటే నటిగా కెరీర్ ముగిసిపోతుందని భయపడిందో ఏమో గానీ అస్సలు ఆ వైపు చూడను కూడా చూడలేదు. ఇప్పటికీ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇందుకు గల కారణాన్ని కూడా గతంలో చెప్పింది. జీవితంలో కలిసిన కొందరు పురుషులు.. చాలా నిరాశపరిచారని చెప్పింది. అలానే తను దత్తత తీసుకున్న పిల్లల (రెనీ, అలీసా) ప్రాధాన్యత.. సరైన వ్యక్తి కోసం ఎదురుచూడటం లాంటివి కూడా కారణమని చెప్పుకొచ్చారు. మూడుసార్లు పెళ్లి చేసుకోవడం వరకు వెళ్లినప్పటికీ దేవుడే తనని రక్షించాడనేది ఈమె నమ్మకం.
తమిళ హీరో శింబు జీవితంలో చాలా ప్రేమకథలే ఉన్నాయి. నయనతార, నిధి అగర్వాల్ లాంటి పలువురు హీరోయిన్లతో ఇతడు డేటింగ్ చేశాడని రూమర్స్ వచ్చాయి. పెళ్లి కూడా జరుగుతుందని మాట్లాడుకున్నారు. తీరా చూస్తే 42 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉండిపోయాడు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో తెలియదు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి జీవితంలోనూ విషాదం ఉంది. హీరోయిన్ రష్మికతో చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది. మరి ఏమైందో ఏమో గానీ ఇది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి జీవితంలో పెళ్లి అనే ఆలోచన లేకుండా పోయింది.
(ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్‌లో సాయిపల్లవి?)


