'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి? | Avatar 3 Movie Story Prediction And Recap Telugu | Sakshi
Sakshi News home page

Avatar 3 Movie: మన దేశంలో ఎందుకింత తక్కువ బజ్.. ఏంటి కారణం?

Dec 15 2025 4:24 PM | Updated on Dec 15 2025 4:45 PM

Avatar 3 Movie Story Prediction And Recap Telugu

ఈ శుక్రవారం(డిసెంబరు 19).. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'అవతార్ 3' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తొలి రెండు భాగాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈసారీ విజువల్స్, స్టోరీ గ్రాండియర్ అదే రేంజులో ఉండబోతున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. కానీ మన దగ్గర ఈ మూవీ వస్తుందనే విషయం కూడా చాలామందికి తెలీదు. హైప్ అంత తక్కువగా ఉంది మరి! అసలు దీనికి ఏంటి కారణం? మూడో భాగంలో స్టోరీ ఏమై ఉండొచ్చు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

1997లో 'టైటానిక్' లాంటి బ్లాక్ బస్టర్, ఆ‍స్కార్ విన్నింగ్ సినిమా తీసిన తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరున్ దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఓ విజువల్ వండర్ సృష్టించాడు. అదే 'అవతార్'. 2009లో ఇది రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.18-19 వేల కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తర్వాత ఇది ఫ్రాంచైజీలా వస్తుందని కామెరూన్ ప్రకటించాడు. కాకపోతే రెండో భాగం రావడానికి చాలా ఆలస్యమైంది. 2022 డిసెంబరులో 'అవతార్ 2' విడుదలైంది. తొలి భాగంతో పోలిస్తే దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. వసూళ్లు మాత్రం కళ్లు చెదిరేలా వచ్చాయి.

ఈ వారం మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తొలి రెండు భాగాలతో పోలిస్తే దీనిపై అనుకున్నంత బజ్ లేదు. తొలి పార్ట్ రిలీజైనప్పుడు విజువల్స్, పండోరా ప్రపంచం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో పార్ట్‌ వచ్చేసరికి చూసిన కంటెంట్‌లానే ఉంది కదా అనిపించింది. దీంతో రెండో భాగానికి మన దేశంలో రూ.450-480 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు రాబోయే మూడు పార్ట్ ట్రైలర్ కూడా విజువల్‌గా బాగున్నప్పటికీ స్టోరీ.. తొలి రెండు భాగాల్లో చూపించిందే ఉండబోతుందా అని సందేహం కలిగేలా చేస్తోంది. హైదరాబాద్ లాంటి చోట్ల బుకింగ్స్ ఇంకా పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు. బహుశా రిలీజైన తర్వాత అదిరిపోయిందనే టాక్ వస్తే జనాలు దీనిపై ఆసక్తి చూపిస్తారేమో?

(ఇదీ చదవండి: 'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!)

అవతార్ విషయానికొస్తే.. ప్రకృతినే ప్రాణమని భావించే 'నావి' జాతి వాళ్లకు, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్లే మానుషులకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా థీమ్‌. ఇందులో యాక్షన్‌ని మించిన లవ్‌స్టోరీ దాగుంది. ఆ ప్రేమకథ ఎన్నో హృదయాలని హత్తుకుంది. అలానే పంచభూతాలైన భూమి గురించి తొలి పార్ట్‌లో చూపించారు. నీటి గురించి రెండో భాగంలో, ఇప్పుడు అగ్ని గురించి మూడో భాగంలో చూపించబోతున్నారు.

'అవతార్' 22వ శతాబ్దంలో పండోరా అనే గ్రహంపై జరుగుతుంది. ఇక్కడ మానవులు 'అన్‌బ్టేనియం' అనే విలువైన ఖనిజం కోసం వచ్చి, స్థానిక 'నావి' తెగపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. వికలాంగుడైన మాజీ మెరైన్ జేక్ సుల్లీ.. నావి తెగలో ఒకడిగా మారేందుకు తన 'అవతార్' శరీరం ద్వారా వారి సంస్కృతిని అర్థం చేసుకుని, వారి ప్రేమలో పడి, చివరికి నావి పక్షాన నిలబడి మానవులతో పోరాడి గెలుస్తాడు. పండోరని రక్షించుకుంటాడు. ఇదే పార్ట్-1 స్టోరీ.

(ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్‌లో సాయిపల్లవి?)

అవతార్ 2 (ది వే ఆఫ్ వాటర్) కథ.. మొదటి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మొదలవుతుంది. దశాబ్దం గడిచిపోతుంది. జేక్ సుల్లీ, నెయితిరి తమ ఐదుగురు పిల్లలతో కలిసి పండోరాలో కొత్త జీవితం ప్రారంభిస్తారు. తర్వాత మనుషుల దాడుల నుంచి తమ కుటుంబాన్ని, తమ జాతిని కాపాడుకోవడానికి, సురక్షితంగా ఉండటంలో భాగంగా మరో చోటకు వెళ్లిపోతారు. నీటిలో నివసించే మెట్‌కైయినా తెగతో కలిసి మనుగడ సాగిస్తారు. కానీ మనుషులు తిరిగి రావడంతో మళ్లీ పోరాడతారు. పాత శత్రువు కల్నల్ క్వారిచ్‌తోనూ మరోసారి తలపడతారు.

అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) కథ.. రెండో భాగంగా ముగిసిన చోటనే మొదలవుతుంది. ఈసారి కల్నల్ క్వారిచ్.. నావి తెగలోని మనుషుల్లా మారిపోతాడు. ఇదే జాతికి చెందిన ఓ మహిళతో కలిసి జేక్, అతడి బృందంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో ఏమైంది? జేక్, అతడి కుటుంబం ఈసారి ఎలా తప్పించుకుంది? ఇందులో యాష్ తెగ పాత్ర ఏంటనేది మూడో భాగం స్టోరీ అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బతికున్నప్పుడే అన్నయ్య తన విగ్రహం గురించి చెప్పారు: ఎస్పీ శైలజ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement