గత వీకెండ్ తెలుగులో రిలీజైన 'అఖండ 2'కు మిశ్రమ స్పందన వచ్చింది. వీకెండ్‌కి ఏమైనా పికప్ అవుతుందనుకుంటే అలా జరిగినట్లు కనిపించలేదు. ఎందుకంటే తొలిరోజు వచ్చిన కలెక్షన్లకు.. శని-ఆదివారాల్లో వచ్చిన వసూళ్లకు పొంతన లేదు. దీనితో పాటు రిలీజైన 'మోగ్లీ' తేలిపోయింది. టాక్-కలెక్షన్స్ ఏ మాత్రం రావట్లేదు. అయితే బాలకృష్ణ సినిమాకు ఓ హిందీ చిత్రం దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. అదే 'ధురంధర్'.
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇది. స్పై బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. డిసెంబరు 5న థియేటర్లలో హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. విడుదలకు ముందు ఎలాంటి హైప్ లేదు. టికెట్స్ కూడా పెద్దగా బుక్ అవ్వలేదు. కానీ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక్కసారిగా పికప్ అయిపోయింది. అలా 10 రోజుల్లోనే రూ.500 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దీనితో పాటే రావాల్సిన 'అఖండ 2' వారం వాయిదా పడటం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్'కి కలిసొచ్చిందనే చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: అఖండ2 సినిమాపై పవన్ కల్యాణ్ సైలెంట్.. ఎందుకు?)
ఎందుకంటే డిసెంబరు 12న 'అఖండ 2' రిలీజైనప్పటికీ 'ధురంధర్' జోరు ఆగలేదు. హైదరాబాద్‌లో చాలాచోట్ల ఈ హిందీ సినిమాకు శని-ఆదివారం హౌస్‌ఫుల్స్ పడ్డాయి. అఖండ సీక్వెల్ ఈ విషయంలో కాస్త వెనకబడిపోయింది. సోమవారం బుకింగ్స్‌లోనూ బాలకృష్ణ మూవీ కంటే రణ్‌వీర్ చిత్రమే కాస్త ముందుంది. మరోవైపు 'ధురంధర్' తెలుగు డబ్బింగ్‌ని ఈ శుక్రవారమే(డిసెంబరు 19) థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే 'అఖండ 2' కలెక్షన్స్ కి ఇంకాస్త దెబ్బ పడటం గ్యారంటీ. ప్రస్తుతం 'అఖండ 2' చిత్రానికి రూ.50 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ధురంధర్ విషయానికొస్తే.. ఓ భారతీయ స్పై ఏజెంట్, పాకిస్థాన్ వెళ్లి అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే విషయాల్ని చూపించారు. హీరో రణ్‌వీర్ సింగ్ అయినప్పటికీ.. కీలక పాత్ర చేసిన అక్షయ్ ఖన్నా యాక్టింగ్ ఇరగదీశాడని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని 'ఉరి' ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ తీశాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


