'అఖండ 2' సనాతన హైందవ ధర్మం కోసం తీసిన సినిమా అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇదీ కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదంటూ.. ప్రపంచ సినిమా అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం మూలాలతో పాటు ధర్మం, గర్వం, తేజస్సు కలగలిపిన చిత్రమిదని బాలయ్య అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. త్వరలో ఢిల్లీలో అఖండ2 ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని, అఖండ2 షోను ప్రధాని మోదీ చూడబోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు.
మరి ఏపీలో అవతరించిన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కల్యాణ్‌కు అఖండ చూపించరా..? ఓజీ కోసం బాలయ్య త్యాగం చేశారు. అలాంటిది అఖండ గురించి ఒక్కమాటైన పవన్ మాట్లాడరా..? అంటూ నెట్టింట చర్చ జరుగుతుంది. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ మాత్రమే రాజకీయాల్లో సనాతన ధర్మం చాంపియన్‌గా రేసులో ఉంటే.. ఇప్పుడు అఖండతో బాలయ్య క్రెడిట్ కొట్టేస్తున్నాడనే ఏమైనా సందేహం వస్తుందా…?
ఈ దశాబ్దన్నర కాలంలో పవన్ కల్యాణ్ తన రాజకీయం కోసం చే గువేరా, గద్దర్, పెరియార్ రామస్వామి వంటి విప్లవకారుల అభిమానిగా గతంలో తాను చెప్పుకుని యువతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. అయితే, సందర్భం ఏదైనా సరే పవన్ నోటి నుంచి వచ్చే మొదటి మాట సనాతన ధర్మం.. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు దాని విలువలు ఏమిటో కూడా తెలియదు. కేవలం తన రాజకీయ భవిష్యత్ కోసం వాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ఓపెన్‌గానే చెబుతుంటారు.
మరి అఖండ సినిమా కూడా సనాతన హైందవ ధర్మం కోసం తెరకెక్కించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా సినిమా చూసి బాగుందని సనాతన హైందవ ధర్మం గురించి చాలా చక్కగా చూపించారని మెచ్చుకుంటున్నారు. కొన్ని వీడియో క్లింప్స్ కూడా షేర్ చేస్తూ బాలయ్య, బోయపాటిని అభినందిస్తున్నారు. కానీ, సనాతన బోధనలు చెప్పే పవన్ కల్యాణ్ మాత్రం కనీసం ట్వీట్ కూడా వేయలేకపోయారు.
అఖండపై పవన్ కల్యాణ్ మౌనం గురించి సోషల్‌మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. అతను తరచుగా తనను తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముద్ర వేసుకుంటారని అలాంటింది అఖండ గురించి ఎందుకు స్పందించడంలేదని నెట్టింట చర్చ జరుగుతుంది. మరోవైపు అఖండ-2ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. సనాతన ధర్మంతో సంబంధం ఉన్న మరికొంతమంది కూడా రియాక్ట్ అయ్యారు. కానీ, పవన్ నుంచి నో కామెంట్.. కనీసం తన సినిమా ఓజీ కోసం అఖండను వాయిదా వేసుకున్నందుకైనా కృతజ్ఞతగా పవన్ స్పందించలేదు.
అంతేకాకుండా, పవన్ కల్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగం. దీంతో అతని మౌనం మరింత చర్చనియాంశంగా మారింది. సనాతన ధర్మం కోసం తీసిన ఒక సినిమాపై అతని స్పందన లేదా ప్రమోషన్ లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీని వల్ల బాలకృష్ణ అభిమానులు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. అఖండ గురించి పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ షేర్ చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తీసిన సినిమాను చూడమని ప్రేక్షకులను ఎందుకు ప్రోత్సహించడం లేదని బహిరంగంగానే వారు ప్రశ్నించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఈ మౌనం వెనుక ఏదైనా లెక్క ఉందా..? అనేది వారికే తెలియాలి.


