ఆంధ్రప్రదేశ్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసినట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి ఆయన చేసినవేనా? లేక బీజేపీలోని టీడీపీ విధేయ ఎంపీలెవరైనా కావాలని అలా రాయించారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిదైందని, ఏపీలో పాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని మోదీ వ్యాఖ్యానించినట్లు ఎల్లోమీడియాలో వార్తలొచ్చాయి. ఆయన ఏ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారో? ఏది బాగుందన్నారో? ఎవరకీ తెలియదు..
బహుశా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే అర్థమైఉంటాయి. ఏదో సాధారణంగా అన్నమాటలను చంద్రబాబుకు మరిన్ని భుజకీర్తులు తొడగవచ్చు అని ఈ రెండు పత్రికలు అనుకుని ఉండవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రాల సమాచారం రాకుండా ఉంటుందా? అలాంటిది ఏపీలో ఏమి జరుగుతుందో తెలియకుండానే గుడ్డిగా ప్రశంసిస్తారా?..
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును మోదీ ఎలా విమర్శించింది, వారసత్వ రాజకీయాల గురించి ఎలా ధ్వజమెత్తింది, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిన విషయమే కదా!. అలాగే చంద్రబాబు కూడా ప్రధాని అని కూడా చూడకుండా మోదీని దారుణమైన విమర్శలు చేశారు. ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి ఆ పార్టీని మేనేజ్ చేసే పని మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముందుగా బీజేపీతో జత కట్టించారు. ఒక సందర్భంలో బీజేపీకి టీడీసీ కలవడం ఇష్టం లేదని, తాను తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా.
అప్పట్లో సీబీటీడీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.2,000 కోట్ల మేరకు జరిగాయని ప్రకటించింది. ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది.
2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీ, అమిత్‌షాల అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీలో ఎదురుచూసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఆ తరువాత ఏం చేశారో తెలియదు కానీ.. బీజేపీతో పొత్తు అయితే కొదిరింది. ఈ నేపథ్యం మొత్తానఇన పరిగణలోకి తీసుకుంటే.. మోదీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు మంచిదని అన్నాడంటే నమ్మడం కష్టమే. అది మంచి, చెడు కాదు. అవకాశవాద రాజకీయ పరిణామం అని మోదీకి కూడా తెలిసే ఉంటుంది.
ఆ సంగతి పక్కనబెడితే గత పద్దెనిమిది నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అధ్వాన్నపు, అరాచకపు పాలనకు మోదీ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అంతకన్నా ఘోరం లేదు. ఫీడ్‌బ్యాక్ అంత బాగుంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్రం చిట్టచివరి ర్యాంకు ఎలా ఇచ్చింది? రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఏపీలో పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం ఇంకో చోట ఉండకపోవచ్చు. తమ పార్టీ వ్యతిరేకమని పలుమార్లు ప్రకటించిన మోదీకి ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రజాస్వామ్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? లోకేశ్‌ను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా గుర్తించే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా? మోదీ సైతం డబుల్ స్టాండర్స్ అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది.
ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి చూస్తే ఈ ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడాన్ని మోదీ సమర్థిస్తారా? ఇదే చంద్రబాబు సమర్థత అని అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై మోదీ పెదవి విరిచారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరీ తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని అడిగారట. ఏపీలో మాత్రం పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారట.అసలు ఏపీలో బీజేపీ ఉనికి ఉందా? టీడీపీనే మొత్తం డామినేట్ చేస్తోంది కదా? మోదీకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలోని టీడీపీ కోవర్టులు ఎప్పటికప్పుడు చంద్రబాబు తరపున కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేస్తుంటారేమో తెలియదు.
తెలంగాణ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంటల కొద్ది భేటీ అవడాన్ని తప్పుపట్టారట..బాగానే ఉంది. మరి తెలంగాణ ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ అభ్యర్ధికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? పైగా కాంగ్రెస్ కు సపోర్టు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు కిమ్మనలేదు? దీనిపై మోదీకి ఎవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదా? చంద్రబాబు ,పవన్ కళ్యాణ్, లోకేశ్ లు ఇక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు? ఇదేనా ఎన్డీయే పక్షాల తీరు!
ఏపీలో జగన్‌ను, వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని కూడా రాయించారు. అంటే వైఎస్సార్సీపీ అంత బలంగా ఉందని మోదీ భావిస్తున్నట్లే కదా! లేదంటే ఒరిజినల్ బీజేపీ వారు కూడా వైఎస్సార్‌సీపీపై తప్పుడు ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో ఇలా కథ అల్లి ఉండవచ్చన్న సందేహం ఉంది. ఏపీలో టీడీపీ, జనసేనలు సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను బీజేపీ తనదని చెప్పలేకపోయింది. అయినా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆ హామీలకు బీజేపీ కూడా ఒప్పుకున్నట్లే కదా! వాటి అమలు తీరు తెన్నుల గురించి, ప్రధాని ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఉంటే బాగుండేది కదా! అప్పుడు వాస్తవాలు తెలిసేవి కదా!
ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఎల్లో మీడియానే ఆయా సందర్భాలలో కథనాలు ఇచ్చింది.అంతదాకా ఎందుకు మోదీ వ్యాఖ్యల కథనం వచ్చిన రోజునే పరిశీలిస్తే వివిధ పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం కనుక ప్రధాని దృష్టికి వెళితే ఏపీలో కూటమి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదు.ఎపి ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చిన బాగ్ లు రెండు నెలల్లోనే చిరిగిపోయాయి. రెవెన్యూ శాఖలో గందరగోళంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు తనపై ఉన్న పలు అవినీతి కేసులను, మాఫీ చేయించుకుంటున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది.
తాజాగా ఫైబర్ నెట్ అవినీతి కేసును కూడా సిఐడి ని ప్రభావితం చేసి మూసివేయించుకున్నారు. ఇది ఏ మేర నైతికతో ప్రధాని చెప్పగలరా? మిత్రపక్షం కాకుండా ఉంటే టీడీపీపైన, చంద్రబాబుపైన మోదీ తదితర బీజేపీ నేతలు ఎంతగా విరుచుకుపడేవారో! చంద్రబాబు తన టూర్ లకు వాడే హెలికాఫ్టర్, విమానం అద్దె ఛార్జీల చెల్లింపునకు నలభైకోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారట. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన కార్పొరేటర్ ను పోలీసులే కిడ్పాన్ చేశారని వార్తలు వచ్చాయి. విజయవాడలో సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే పోలీసుల సమక్షంలో 42 ఇళ్లు కూల్చిన దారుణ ఘటన జరిగింది. ఆ బాధితులు మాజీ సీఎం జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమరావతిలో రాజధాని అభివృద్ది సంస్థే చెరువులను చెరబట్టి రైతులకు వాటిలో ప్లాట్లు ఇస్తోందన్న స్టోరీ వచ్చింది.దీనిపై రైతులు మండిపడుతున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసు పెట్టిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వారు లొంగిపోవడానికి కోర్టుకు వెళుతుంటే పోలీసులు ఎంత నిర్భంధ కాండ అమలు చేశారో ఆశ్చర్యంగా ఉంటుంది.
ఏపీలో గంజాయి వ్యాసారం సాగుతున్న తీరు అందరిని కలవర పరుస్తోంది.కుల వివాదంగా మారిన ఒక హత్య కేసులో భారీ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం, నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు హత్యకు గురైతే కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారుతోందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా? ఒకవైపు పోలీసుల దౌర్జన్యాలు, మరో వైపు టీడీపీ నేతల దాష్టికాలతో ఏపీ అంతటా అరాచకం ప్రబలుతుంటే మోదీకి ఈ పాలన ఎలా బాగుందో, ఆయనకు ఎవరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో తెలియదు. కేంద్రం నుంచి మోంథా తుపాను సహాయనిధిగా రూ.544 కోట్ల వస్తే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతంచర్లలో ఒక లిక్కర్ షాపు యజమాని ఎక్సైజ్ అధికారులు అడిగినంత మామూళ్లు ఇవ్వలేక ఏకంగా షాపునే మూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎల్లో మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి.
రవాణా మంత్రి రామ ప్రసాదరెడ్డి పేషీ లో అవినీతి గురించి ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక వార్త ఇచ్చింది.రాష్ట్రంలో ప్రతినెల మొదటి తేదీన అందరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ లోటు నిపుణులను భయపెడుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లూలూ గ్రూప్‌కు విజయవాడలో వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని కట్టబెట్టడంపై జనం మండిపడుతున్నారు.ఇలా ఏ రంగం గురించి చూసినా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. వీటిని కవర్ చేయడానికి మత రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ను టీడీపీ ఆపరేట్ చేస్తోందన్న అభిప్రాయం ఉంది.
వైఎస్సార్‌సీపీని బదనాం చేయాలన్న దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, జనసేనలు వెనుకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి ఏపీ ప్రజలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా, వాస్తవికమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా చంద్రబాబు సర్కార్ కు సరైన సలహాలు ఇవ్వగలిగితే అంతా సంతోషిస్తారు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


