సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ-స్టాంపుల కుంభకోణం బయటపడింది. నకిలీ స్టాంపులు బ్యాంకులకు సమర్పించి వందల కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థ. సురేంద్ర బాబు సహా 12 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కళ్యాణదుర్గం కేంద్రంగా సాగిన ఈ బాగోతం.. రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది బ్యాంకుల నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది.
ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీనికోసం ముందుగా స్టాంప్ డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ స్టాంప్ పొందాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, ఎస్‌ఆర్‌సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా కేవలం రూ.1,51,700 చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించకపోవడం గమనార్హం.


