ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సొంత నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణంలో పారిశుధ్యం పడకేసింది. ఎటు చూసినా దుర్గంధం, చెత్తా చెదారంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తుండటంతో రోడ్లపై నడిచేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు.
ధర్మవరం: పట్టుచీరలకు ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. స్వయాన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోనే అనారోగ్యకర పరిస్థితులు నెలకొన్నాయి. తాత్కాలిక కమిషనర్‌గా మున్సిపల్ ఇంజనీర్‌కు ఎఫ్‌ఏసీ ఇవ్వడంతో శానిటేషన్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ధర్మవరం మున్సిపాలిటీలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 40 వార్డులకుగాను ఒక్కో వార్డుకు ఒక్కో ఆటో చొప్పున చెత్తసేకరణ జరిగేది. వార్డులోని సచివాలయం పరిధిలో ముగ్గురు పారిశుధ్య కారి్మకులను నియమించి బాధ్యతలను అప్పగించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తసేకరణ ఆటోలను తొలగించడంతో ట్రాక్టర్లు, కాంపాక్టర్ల ద్వారా సేకరిస్తున్నారు.
అయితే చిన్న వీధులు, స్లమ్ ఏరియాల్లోకి అవి వెళ్లకపోవడం, పట్టణంలోని డ్రైనేజీలను శుభ్రం చేసే కారి్మకులపై పర్యవేక్షణ లేకపోవడంతో ఎటు చూసినా దుర్గంధం తాండవిస్తోంది. పట్టణంలో ప్రధాన వీధులు మొదలు శివారు ప్రాంతాల వరకు రహదారులకు ఇరువైపుల చెత్తను నిల్వ ఉంచుతున్నారు. వారం పదిరోజులైనా డ్రైన్‌లను శుభ్రం చేసేవారే కరువయ్యారు.
పందులు, కుక్కల నియంత్రణపై దృష్టిసారించని అధికార గణం
మున్సిపాలిటీలో కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ల కోసం మున్సిపల్ పాలకవర్గం 5 నెలల క్రితం రూ.18 లక్షల నిధులు మంజూరు చేసి ఆమోదిస్తే ఇంత వరకు కేవలం 400 కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు చేసినట్లు అధికారులు ప్రకటనలు చేయడం నిర్లక్ష్యానికి నిదర్శనం. పందుల బెడద అ«ధికంగా ఉన్నప్పటికీ పందుల పెంపకందార్లకు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
రెచ్చిపోతున్న కుక్కలు, పందులు
ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్, ఇందిరానగర్, సుందరయ్యనగర్, ఎల్‌సీకేపురం, తారకరామాపురం, గాంధీనగర్, శాంతినగర్, శివానగర్, ఇందిరమ్మకాలనీ, కేతిరెడ్డి కాలనీ, నేసేపేట వద్ద పందులు, కుక్కలు స్వౌర విహారం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం రజియా అనే మహిళ ఇంటి ముందు నిల్చుని ఉండగా పంది దాడి చేసి చేతివేళ్లను కొరికివేసిన ఘటన చోటు చేసుకుంది. వీధుల్లో సమూహాలుగా కుక్కలు సంచరిస్తూ చిన్నపిల్లలు, పాదచారులు, వాహనదారులపై దాడి చేస్తున్నాయి.
నిద్రావస్థలో శానిటేషన్ అధికారులు
ధర్మవరం పట్టణంలో పారిశుధ్య నిర్వహణలో శానిటేషన్ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 1.50 లక్షలకుపైగా జనాభా, 40 వేలకు పైగా ఇళ్లున్నాయి. డ్రైన్‌ల నిర్వహణ, చెత్తసేకరణకు పారిశుధ్య కారి్మకులను పురమాయించేందుకు రోజూ తెల్లవారుజామున ఆయా క్లస్టర్‌ల పరిధిలో మస్టర్‌లు వేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో మేస్త్రీలకు బాధ్యతలకు అప్పజెప్పడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని అంటున్నారు.
అధికారులకు పట్టదా?
సకాలంలో చెత్త సేకరణ, డ్రైన్‌లు శుభ్రం చేయకపోవడంతో పట్టణం అపరిశుభ్రంగా మారింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను శానిటేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కుక్కలు, పందుల దాడిలో ప్రజలు గాయపడుతున్నా అధికారులు నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణం.
– చందమూరి నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పంది దాడి చేసింది
మాది సత్యసాయినగర్. ఇంటి ముందు నిల్చుంటే పంది దాడి చేసి చేతివేళ్లు కొరికివేసింది. వీధుల్లో పందులు, కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు, గుంపులుగా వీధులలో సంచరిస్తున్నాయి. పెద్దవాళ్ల పరిస్థితే ఇలా ఉంటే పిల్లలు బయట ఉంటే పరిస్థితిని ఊహించడానికే భయం వేస్తోంది.
– రజియా,సత్యసాయినగర్, ధర్మవరం


