అమ్మగారిపల్లెలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయిన గ్రామస్తులు
మూడు కుటుంబాలను పార్టీలో చేర్చుకునేందుకు వెళ్లిన దేశం నాయకులు
సంబంధిత విందులో గ్రామ ప్రజలందరూ పాల్గొనాలని ఒత్తిడి
నిరసనగా ఇళ్లకు తాళాలు వేసి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక విందు ఏర్పాటు
వైఎస్సార్ జిల్లాలో ఘటన
వేంపల్లె: వైఎస్సార్‌సీపీకి ప్రజా మద్దతు మరోసారి స్పష్టమైంది. మూడు కుటుంబాలను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)తో పాటు టీడీపీ నాయకులు గ్రామంలోకి అడుగుపెట్టగానే, ప్రజాస్వామ్య స్ఫూర్తితో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి.. ఆ గ్రామాన్నే వదిలివెళ్లిన ఘటన వైఎస్సార్‌జిల్లా వేంపల్లె మండలం అమ్మగారిపల్లెలో చోటుచేసుకుంది. నిరసనను అణచివేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, ఈ చర్యలు స్థానికులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి.
దేశం కుతంత్రాలకు సమాధానం
గత కొన్నేళ్లుగా వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్న గ్రామస్తులను రాజకీయంగా చీల్చే ప్రయత్నంలో భాగంగా ప్రలోభాలకు తెరలేపుతూ అడ్వకేట్ వెన్నపూస ఈశ్వర్‌రెడ్డితో పాటు మరో రెండు కుటుంబాలను టీడీపీలోకి చేర్చుకునేందుకు బీటెక్ రవి తదితర టీడీపీ నాయకులు గ్రామానికి వచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసే విందులో గ్రామంలోని ప్రజలంతా పాల్గొనాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పోలీసులనూ ఇందుకు వినియోగించుకున్నారు.
ఈ రాజకీయ కుతంత్రాలకు గ్రామస్తులు గట్టి సమాధానం చెప్పారు. టీడీపీ నాయకుల ముఖాలను కూడా చూడకూడదన్న సంకల్పంతో గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరును ఖాళీ చేశారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలోని కొండ గంగమ్మ వద్ద వైఎస్సార్‌సీపీకి సంఘీభావంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామం వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని పోలీసులు అంతక్రితం గ్రామస్తులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
అనుమతి లేదంటూ విందును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు లెక్కచేయలేదు. ఈ ఘటనతో టీడీపీ నాయకులకు తీవ్ర అవమానం ఎదురైంది. గ్రామంలో ఒక్కరూ లేకపోవడంతో బీటెక్ రవిసహా ఇతర అధికార పార్టీ నాయకులు కంగుతిన్నారు. ఇదిలావుండగా టీడీపీ నాయకులు, పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎంత ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్‌సీపీలోనే ఉంటామని, వైఎస్ కుటుంబం వెంటే నడుస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు.
పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు
పోలీసులను అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలహీనపడుతోందనడానికి అమ్మగారిపల్లె ఘటనే రుజువు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని మాజీ సీఎం వైఎస్ జగన్ కోరుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేక టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు.
– ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ


