గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగితే తగ్గుతున్న కార్బోహైడ్రేట్లు
తగ్గుతున్న ప్రొటీన్లు, జింక్ ముఖ్యమైన సూక్ష్మపోషకాలు
పెరుగుతున్న సీసం, నికెల్ వంటి భార ఖనిజాలు
వరి, గోధుమలు, జొన్నలపై తాజా అధ్యయనంలో వెల్లడి
గాలిలో అంతకంతకూ పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ (సీఓ2)కు.. మన ఆహారంలో పోషకాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని మీకు తెలుసా? భూతాపం పెరుగుతున్న కొద్దీ మనం రోజూ తినే వరి బియ్యంలో, గోధుమల్లో, ఇంకా చెప్పాలంటే.. జొన్నల్లో కూడా పిండి పదార్థాల శాతం పెరిగిపోతోంది.
ప్రొటీన్లు, సూక్ష్మపోషకాల శాతం ఆ మేరకు తగ్గిపోతోంది. అంతేకాదు, విషతుల్యమైన సీసం వంటి భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఆహార గింజల్లోకి చేరిపోతున్నాయి. టూకీగా చెప్పుకోవాలంటే.. భూతాపం పెరుగుతున్నకొద్దీ మన దైనందిన ఆహారంలో పోషకాల సమతుల్యత అస్తవ్యస్తమవుతోందని తాజా అధ్యయనం చెబుతోంది. – సాక్షి, సాగుబడి
గాలిలో నానాటికీ పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ స్థాయులు వాతావరణ మార్పులకు కారణమవుతాయని అందరికీ తెలుసు. కానీ ఇటీవల వెలువడిన ఒక కొత్త అధ్యయనం.. అధిక సీఓ2 వల్ల ఇప్పుడు ఆహార పంటల పోషకవిలువలు స్థిరంగా క్షీణిస్తున్నాయని తేల్చింది. మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు పెరిగిపోయి, ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు తగ్గిపోతే.. అధిక బరువు, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఏకకాలంలో మరింత పెరుగుతాయి.
ఆ మూడింటిలో..
నెదర్లాండ్స్‌లోని లీడెన్ యూనివర్సిటీ నిపుణుల పరిశోధన వివరాలు ‘గ్లోబల్ ఛేంజ్ బయాలజీ’ జర్న ల్‌లో ప్రచురితమయ్యాయి. పెరుగుతున్న సీఓ2 ప్రభావం వల్ల పంటల్లో పోషకాలు తగ్గిపోయి, మనం తినే ప్రతి ముద్దలోనూ కేలరీలు గతం కన్నా ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. వరి, గోధుమ, జొన్న వంటి ప్రధాన ఆహార ధాన్యాల్లో పిండి పదార్థాలు పెరుగుతుండగా, ప్రొటీన్ తగ్గిపోతోందన్నారు. ఐరన్, జింక్, మెగ్నీషి యం, కాల్షియం వంటి అతిముఖ్యమైన సూక్ష్మపోషకాలు కూడా తగ్గిపోతున్నాయి. పప్పుధాన్యాల్లో జింక్ 38% తగ్గినట్లు గుర్తించారు.
కిం కర్తవ్యం?!
భారతీయులు ఆహారంలో కార్బోహైడ్రేట్ల (పిండి పదార్థాల)ను మితిమీరి తీసుకోవటం, ప్రొటీన్లను అవసరం కన్నా తక్కువగా తీసుకోవటం వల్ల ఊబకాయం, షుగర్ వంటి జీవనశైలి వ్యాధుల బెడద ఏటేటా పెరుగుతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్న విషయం మనకు తెలిసిందే. రోజువారీ మొత్తం ఆహారంలో 45%కి మించి పిండి పదార్థాలు తీసుకోవద్దని, 15%పైగా ప్రొటీన్లు తీసుకోవాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సూచిస్తోంది.
అయితే, ప్రజలు 62% మేరకు పిండి పదార్థాలు అధికంగా తింటున్నారని, 11.5% మేరకు ప్రొటీన్లు అవసరం కన్నా తక్కువగా తింటున్నారని ఇటీవలి సర్వేల్లో తేలింది. ప్రపంచ దేశాలన్నీ సీఓ2 స్థాయులు తగ్గించడంపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఎందుకిలా?
గాలిలో ఒకప్పుడు 350 పీపీఎం స్థాయిలో ఉండే సీఓ2 ప్రస్తుతం 426 పీపీఎంకు పెరిగింది. గాలిలో సీఓ2 లభ్యత పెరుగుతున్నకొద్దీ మొక్కలు దాన్ని ఎక్కువగా తీసుకుంటూ షుగర్‌ను, పిండిపదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటున్నాయి. తత్ఫలితంగా మట్టి నుంచి వేర్ల ద్వారా ఇతర పోషకాలను తీసుకునే సామర్థ్యం తగ్గిపోతోంది.
వరి, గోధుమ, జొన్నల్లో ఇలా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పిండి పదార్థాలు పెరగటం, ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు తగ్గటం అనేది మనం తినే గింజలు, పూలు, కాయలు, ఆకులు, దుంపలన్నిటిలోనూ ఒకేలా ఉన్నట్లు వారు తెలిపారు.
భార లోహాల ముప్పు
అధిక సీఓ2 ప్రభావంతో ధాన్యాల్లో క్రోమియం, నికెల్, సీసం వంటి విషతుల్యమైన భార లోహాలు ఎక్కువగా పోగుపడుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఇవి అతి స్వల్ప మోతాదుల్లో ఉన్నప్పటికీ మెదడు, గుండె, నాడీ మండలాలకు హాని చేస్తాయి. సీఓ2 స్థాయి పెరగటంతో గోధుమలో సీసం 170% పెరిగింది.


