ఆ తర్వాత వాటిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్న నేతలు
ర్యాలీలకు వ్యతిరేకంగా పోలీసులను ఉసిగొల్పుతున్న చంద్రబాబు సర్కారు
దీంతో ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ జిల్లాల్లో నోటీసులు
వీటిని ఖాతరు చేయబోమంటున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలు
వాహనాల ర్యాలీలకు అనుమతివ్వాలంటూ డీజీపీకి పార్టీ లేఖ
సాక్షి, అమరావతి: పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ.. రూ.లక్ష కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి ‘నీకింత నాకింత’ అంటూ పంచుకు తినేందుకు చంద్రబాబు సర్కారు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పైగా.. ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగ–ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా కదంతొక్కడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడీ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటాన్ని నిరసిస్తూ 175 నియోజకవర్గాల్లోనూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన పత్రాలను ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు భారీ ర్యాలీలతో తరలించారు.
ఈ నేపథ్యంలో.. సోమవారం జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చాటిచెప్పేలా వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది.
ర్యాలీల్లో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు..
ఇక ఈ ర్యాలీలను అడ్డుకోవడానికి చంద్రబాబు సర్కారు అప్పుడే పోలీసులను ఉసిగొలిపింది. ర్యాలీల్లో పాల్గొనవద్దని.. పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలకు జిల్లాల్లో పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అయితే, ఈ బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయబోమని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించే ర్యాలీల్లో కదంతొక్కుతామని వారు తేల్చిచెబుతున్నారు.
కోటి సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి.. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి, బినామీలకు కట్టబెట్టి కమీషన్ల దండుకోవడానికి వేసిన ప్రణాళిక.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేయడానికి చేస్తున్న కుట్రను మరోసారి ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేతలు వివరించనున్నారు. ఆ తర్వాత కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడానికి జెండా ఊపి ప్రారంభిస్తారు.
జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఈ కోటి సంతకాల పత్రాలను ఈనెల 18న సా. 4 గంటలకు పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌కు నివేదిస్తారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరిస్తారు. ప్రభుత్వమే వాటిని పూర్తిచేసి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయనున్నారు.
వాహనాల ర్యాలీకి అనుమతివ్వండి..
కోటి సంతకాల ప్రతులున్న వాహనాల ర్యాలీలకు అనుమతివ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ర్యాలీల్లో పాల్గొనద్దంటూ జిల్లాల్లో పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా సజావుగా సాగేందుకు అనుమతి అవసరమని.. దీనికోసం అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని అప్పిరెడ్డి తన లేఖలో డీజీపీకి విజ్ఞప్తి చేశారు.


