రాష్ట్రవ్యాప్తంగా క్షీణించిన స్తిరాస్థి క్రయ విక్రయాలు
అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
భూములు, అపార్టుమెంట్లు, ప్లాట్లు అడిగేవారేరి?
అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మి కులు, కూలీలు, వ్యాపారులు
విజయవాడ, తిరుపతి, నెల్లూరులో వ్యాపారాలు డీలా
రాజధాని అమరావతిలోనూ మందగమనం
రాష్ట్రంలో వరుసగా రెండేళ్లు పడిపోయిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
స్వయంగా టార్గెట్లు తగ్గించుకున్న ప్రభుత్వం
2023–24లో ఏపీలో ఏకంగా 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్
ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్లు 13.92 లక్షలే
భూముల మార్కెట్ విలువ సగటున 50 శాతం పెంచినా లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలం
సంపద సృష్టిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిస్తూ గత ప్రభుత్వ హయాంలో అడుగులు
మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జోరుగా ఇళ్ల నిర్మాణంతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి విజయవాడ, నెట్‌వర్క్: అభివృద్ధికి చిరునామా..! మంచి ప్రభుత్వం..! విజనరీ పాలన..! సంపద సృష్టిస్తానంటూ అంటూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను దిగజారుస్తూ, అన్ని రంగాలను కుప్పకూలుస్తున్నారు. సంక్షేమం ఊసే పట్టించుకోకుండా.. అభివృద్ధి జాడే లేకుండా చేస్తున్నారు.
ఒకవైపు పారిశ్రామిక విధానం ముసుగులో తమకు నచ్చినవారికి ఖరీదైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99 పైసలకే కేటాయిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీరుగార్చడంతో అవసరాలకు అమ్ముకోలేక రైతులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో సైతం ఇదే దుస్థితి నెలకొంది.
వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా విజయవాడ, బందరులో జిల్లా కేంద్రాలు, పోర్టు, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి.
నెలకు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తారుమారైంది. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది.
విజయవాడ, తిరుపతి, నెల్లూరులో స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రచారం మినహా అభివృద్ధి జాడ లేకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రివర్స్‌లో ప్రయాణిస్తోంది.
అన్ని ప్రాంతాల్లోనూ స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. రాష్ట్రం దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు సర్కారు మాటలు నిజమైతే స్థిరాస్తి మార్కెట్ కళకళలాడాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పెరగాలి. కానీ మార్కెట్ బేల చూపులు చూస్తోంది.
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేనివిధంగా పడిపోవడమే ఇందుకు ఉదాహరణ. 2023–24లో రూ.12 వేల కోట్లుగా ఉన్న రిజి్రస్టేషన్ల టార్గెట్ తాజాగా 2025–26 ఏడాదిలో రూ.10,169 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం.
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు టార్గెట్‌ను పెంచుకుంటూ వెళ్లి అందుకనుగుణంగా ఆదాయాన్ని సముపార్జిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రివర్స్‌లో టార్గెట్‌ను తగ్గించుకుంటూ వెళుతోంది. తద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, స్థిరాస్తుల కొనుగోళ్లు జరగడం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్థారించేసింది.
2023–24లో గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజి్రస్టేషన్ జరగగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో అక్టోబర్ నాటికి 13.92 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం దిగజారిన పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.
కాగా దివంగత వైఎస్సార్ హయాంలో గొల్లపూడి నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంతోపాటు బుడమేరుపై ఫ్లైఓవర్లతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులను 2014–19 మధ్య టీడీపీ హయాంలో పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ పనులను 96 శాతం మేర పూర్తి చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరకుపైగా అవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడంలో విఫలమైంది.
రిజిస్ట్రేషన్ల టార్గెట్లు రివర్స్
చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ పాలన, విచ్చలవిడి అవినీతితోపాటు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఊహించని విధంగా పడిపోయాయి. కనీసం వసూళ్ల లక్ష్యాన్ని కూడా సరిగా నిర్దేశించుకోలేని స్థాయికి రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం నిర్దేశించిన లక్ష్యం కంటే కూడా ప్రస్తుతం తక్కువ టార్గెట్ పెట్టుకోవడం ద్వారా స్థిరాస్తి క్రయవిక్రయాలపై చంద్రబాబు సర్కారు ఆశలు వదిలేసుకుంది.
2023–24 ఆరి్థక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని రూ.9,546 కోట్లు రాబట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. 2024–25లో రూ.11,997 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని రూ.8,843 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంతకుముందు సంవత్సరం వచ్చి న ఆదాయాన్ని కూడా చంద్రబాబు సర్కారు తొలి ఏడాది సాధించలేకపోయింది.
ఇక 2025–26లో లక్ష్యాన్ని రూ.10,169 కోట్లుగా పెట్టుకుని అక్టోబర్ నాటికి రిజి్రస్టేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లు వసూలు చేయగలిగింది. వరుసగా రెండేళ్లపాటు లక్ష్యాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి స్థిరాస్థి రంగంలో ఏమాత్రం వృద్ధి లేదని ఈ ప్రభుత్వమే బయటపెట్టింది.
దీంతో తన హయాంలో పడిపోయిన ఆదాయాలనే కొలమానంగా తీసుకుని ప్రస్తుత ఆదాయాలను పోల్చుతుండడం విశేషం. ఆదాయాన్ని 2023–24 సంవత్సరంతో పోల్చకపోవడం, తక్కువ లక్ష్యాన్ని పెట్టుకుని దాంతో పోల్చడం ద్వారా ప్రజలను మభ్యపుచ్చేందుకు యత్నిస్తోంది.
నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు సర్కారు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను సగటున 50 శాతానికిపైగా పెంచింది. దీంతో ప్రజలపై భారం పడి రిజిస్ట్రేషన్ల సొమ్ము ఎక్కువగా కట్టాల్సి వస్తోంది. చార్జీలు పెంచడం ద్వారా ప్రజలను బాది ఆదాయాన్ని పెంచుకున్నా రిజి్రస్టేషన్లు మాత్రం అమాంతం తగ్గిపోవడం గమనార్హం. లేదంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇంకా భారీగా పడిపోయేదని స్పష్టంగా తెలుస్తోంది.
రాజధానిలో ‘రియల్’ షాక్..!
రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజధానికి బడా కంపెనీలు, కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నా రియల్ వ్యాపారం మాత్రం పెరగడంలేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వేయడం తగ్గిపోయింది. ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ముడు కావడంలేదు.
అపార్టుమెంట్లలో ప్లాట్లు పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థలాలు, ప్లాట్ల కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలో మునిగిపోయారు.
స్వయంగా చంద్రబాబు రాజధానిలోని వెలగపూడిలో ఇల్లు నిర్మించుకుంటున్నట్లు చెబుతున్నా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. రెండు, మూడు విడతల భూసమీకరణ ద్వారా మరింత భూమిని తీసుకుంటామని ప్రకటించడం, పూలింగ్‌కు భూములు ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరిస్తుండటంతో రాజధానిలో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. చంద్రబాబు సర్కారు భూదాహంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.
పట్ణణాలు, నగరాల్లోనూ డీలా
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమను పట్టించుకోకపోవడం, ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకపోవడంతో రియల్ రంగం కుదేలైంది. వైఎస్ జగన్ హయాంలో సీమలో పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడు కుదేలయ్యాయి. ప్రధానంగా తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల దందాలు, భూములపై పెత్తనం చేస్తుండడంతో కొనాలనుకున్న కొద్దిమంది కూడా జంకుతున్నారు.
క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాల్లోనూ రియల్ వ్యాపారం మందకొడిగా ఉంది. నగరాల్లోనూ అమ్మకాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ–మచిలీపట్నం రహదారికి ఇరువైపులా గతంలో కళకళలాడిన వ్యాపారం ఇప్పుడు పడిపోయింది.
ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం, ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం బడాయి పోతున్నా భూముల కొనుగోళ్లు మాత్రం లేకపోవడం గమనార్హం.
2019–24 మధ్య విశాఖలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిన రియల్ వ్యాపారం ఏడాదిన్నరగా దిగజారిపోయింది. పెద్ద ప్రాజెక్టులు చాలా వరకూ ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి.
నిర్మాణ రంగం విలవిల
ఒకపక్క రియల్ రంగం తిరోగమనంలో ఉండడంతో మరోపక్క దానిపై ఆధారపడిన నిర్మాణ రంగం కూడా కుదేలైంది. భవన నిర్మాణ కారి్మకులకు పనులు తగ్గిపోయాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కార్మికులకు గతంలో చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు పని దొరకడం కష్టంగా మారింది.
నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుక, సిమెంట్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇనుము. ఎలక్ట్రిసిటీ, విక్రయాల వ్యాపారాలు క్షీణించాయి. ఇలా చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ విధానాల వల్ల కీలక రంగాలు చతికిలపడ్డాయి. వ్యాపారాలు తగ్గిపోవడంతో వాటిపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోవడంతో అన్ని వ్యాపారాలు తగ్గిపోయాయి.
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ హయాంలో మంచి రోజుల్లో సగటున రోజుకు 150, ఇతర రోజుల్లో 100–120 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు మంచి రోజుల్లోనూ 70–80 దాటడం లేదు. సాధారణ రోజుల్లో 50 రిజిస్ట్రేషన్లు కావడం గగనంగా ఉంది.
2019కి ముందు మచిలీపట్నం శివారులో సెంటు రూ.3 లక్షలు ఉంటే 2024లో రెట్టింపై రూ.6 లక్షలకు చేరుకుంది. తరువాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ధరలు పెరగలేదు.
2022–23లో తూర్పు గోదావరి జిల్లాలో 1,29,355 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా 2025–26 నవంబర్ చివరి నాటికి కేవలం 61,597 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి.
విజయనగరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.10 లక్షలు ఉన్న 200 గజాల ఇంటి స్థలం 2019 తరువాత వైఎస్ జగన్ హయాంలో రూ.25 – రూ.30 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గిపోయాయి. మూడు నాలుగేళ్ల క్రితం కొన్న ధరకు అమ్ముకుందామన్నా కొనేవారు లేరని వ్యాపారులు చెబుతున్నారు.
కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ప్రభుత్వంలో రోజుకు సుమారు 250–300 రిజి్రస్టేషన్లు జరగగా ప్రస్తుతం 50–60 మించడం లేదు. ప్రొద్దుటూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయ పరిధిలో రోజుకు 80–90 రిజిస్ట్రేషన్లు నుంచి ప్రస్తుతం 30కి తగ్గిపోయాయి.
ఆదోని మెడికల్ కాలేజీ పరిసరాల్లో గతంలో ఎకరం రూ.5 కోట్లు పలకగా ఇప్పుడు అడిగే నాథుడే కరువయ్యారు.
2023–24 వైఎస్ జగన్ హయాంలో ఇలా..
1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.12,000 కోట్లు
2) రాష్ట్రంలో భారీగా పెరిగిన భూముల ధరలు
3) రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు.. 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్
4) రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, 30 లక్షలకుపైగా గృహ నిర్మాణాలు
- ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం
- తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు
- గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణాలతో స్థానికంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు సంపద సృష్టిస్తూ అడుగులు
5) భవన నిర్మాణ కార్మికులకు సమృద్ధిగా పనులు
6) సంక్షేమ పథకాల అమలుతో పెరిగిన పేదల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు
7) రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు కళకళ. జోరుగా గృహ నిర్మాణాలతో సిమెంట్, పెయింట్లు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యాపారాల జోరు
2025–26 బాబు ప్రభుత్వంలో..
1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.10,169 కోట్లకు కుదింపు
2) భూముల ధరలు ఒక్కసారిగా పతనం.. రాజధానిలోనూ మందగమనం
3) రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యకే పరిమితం.. అక్టోబర్ దాకా 13.92 లక్షలే
4) కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా ఉన్న వ్యవస్థలే నిర్వీర్యం.
5) పొట్ట కూటి కోసం కార్మికుల అవస్థలు
6) పథకాలు అందక, అభివృద్ధి జాడ లేక పేదల దీనావస్థ
7) రియల్ ఎస్టేట్ వెలవెల. ఆగిన ఇళ్ల నిర్మాణాలు. వ్యాపారులు బేజార్
కృష్ణాలో కుప్పకూలింది..!
కృష్ణా జిల్లాలో ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 20 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది.
వైఎస్సార్ సీపీ హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి పనులను పరుగులు పెట్టించింది. మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. గిలకలదిండి íఫిషింగ్ హార్బర్, పలు కొత్త హైవేలు రావడంతో జిల్లా పునర్విభజన సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
బందర్ హైవే వెంట నిడుమోలు, పామర్రు, ఉయ్యూరు. కంకిపాడు ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. కత్తిపూడి–ఒంగోలు హైవేతో పెడన, అవనిగడ్డ నియోజక వర్గాల్లో సైతం రియల్ భూమ్ అందుకొంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వేగం మందగించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొంది.
బాపట్లలో భవన రంగం బాధలు
బాపట్ల జిల్లాలో ఏడాదిన్నరగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనమైంది. గత ప్రభుత్వంతో పోలిస్తే రిజి్రస్టేషన్లు సగం తగ్గాయి. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల జిల్లాలో 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 76,215 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 50,983 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి.
ప్రభుత్వానికి రాబడి తగ్గిపోగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా దొరకడం లేదని భవన నిర్మాణ కారి్మకులు వాపోతున్నారు.
సిమెంట్, ఐరన్ విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జిల్లాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. తీరప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించడంతో రోడ్లు ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరిగాయి. బాపట్ల కేంద్రంగా గత ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసింది.
దీంతో 2019 తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అప్పటివరకూ తీర ప్రాంతంలో ఎకరం రూ.30 లక్షలు పలికిన భూమి తరువాత రూ.3 నుంచి 5 కోట్లకు చేరింది. గత ఏడాదిన్నరగా పరిస్థితి తారుమారైంది. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల మెడికల్ కళాశాల ప్రాంతంలో రూ.కోటిన్నర పలికిన ఎకరం భూమిని ప్రస్తుతం రూ.20 లక్షలకు కూడా కొనేవారు లేరు. అద్దంకి, రేపల్లె ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఎకరం రూ.కోటి దాకా పలికిన భూముల ధరలు తిరిగి రూ.20 లక్షలకు పతనమయ్యాయి.
పల్నాడులో ధరలు పతనం..
పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల రాకతో పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజుపాలెం, మాచవరం తదితర మండలాల్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. రైతుల భూములు రెట్టింపు ధరలు పలికాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ఆదాయం అమాంతం పడిపోయింది.
పల్నాడు జిల్లావ్యాప్తంగా 2023–24లో రిజి్రస్టేషన్ల ద్వారా రూ.472.38 కోట్ల ఆదాయం సమకూరగా 2024–25లో ఆదాయం రూ.396 కోట్లకు పడిపోయింది. 2025–26లో ఇప్పటిదాకా రూ.200 కోట్లు కూడా రాలేదు. గతంలో ఏటా సగటున 32 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా ప్రస్తుతం అది 14 వేలకు పడిపోయింది. దీంతో మధ్యవర్తులు ఉపాధిలేక హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు.
గతంలో వెంచర్ల ఏర్పాటుతో ఉపాధి పొందిన వేలాది మంది కూలీలు, ట్రాక్టర్, జేసీబీ, ట్రక్కు డ్రైవర్లు ప్రస్తుతం పనుల కోసం అడ్డాలలో ఎదురు చూస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చేరువలోని కామేపల్లి గ్రామ పరిధిలో 2019కి ముందు ఎకరం పొలం రోడ్డు పక్కన సుమారు రూ.30 లక్షలు ఉండగా స్థానికంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
ఏకంగా ఎకరం రూ.కోటిన్నర దాకా పలికింది. 2024లో వైఎస్సార్‌సీపీ దిగిపోయేనాటికి ఎకరం రూ.2 కోట్ల దాకా వెళ్లింది. అదే ఇప్పుడు కనీసం రూ.60 – రూ.80 లక్షలు కూడా పలకడం లేదు. కనీసం ధర గురించి అడిగే వారు లేరని రైతులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. నరసరావుపేటలోనూ వెంచర్లు వేసిన వ్యాపారులు స్థలాలు అమ్ముకోలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
నెల్లూరులో నీరసించిన వ్యాపారం
నెల్లూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగుంటుందని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన రియల్టర్లు లేఅవుట్‌లు వేశారు. అన్ని సదుపాయాలతో అధునాతనంగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేశారు. ఇప్పుడు వాటిని కొనేవారు లేరు. గత 9 నెలలుగా ఖాళీగా ఉన్నారు. కొందరు బిల్డర్‌లు నూతనంగా నిర్మించిన ఇళ్లను బాడుగలకు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. భారీగా వడ్డీలు కట్టలేక లబోదిబోమంటున్నారు. ఇక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రకటన చేసినా రియల్ ఎస్టేట్ ఏమాత్రం ఊపందుకోలేదు.
ఏడాదిలో ఒక్కటీ అమ్ముడుపోలేదు
టీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది కాలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడు పోలేదు. పెట్టుబడులు మొత్తం ప్రాజెక్టులపై పెట్టాం. వ్యాపారం దివాలా తీస్తోంది. తెచి్చన పెట్టుబడులకు వడ్డీలు కట్టడమే సరిపోతోంది.– షేక్ కిరణ్‌బాబు, బిల్డర్, ఈడుపుగల్లు, కంకిపాడు మండలం, ఎన్‌టీఆర్ జిల్లా
వలసలు పోతున్నారు
ఏడాదిన్నరగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. స్థలం అమ్మేవారు ఉన్నా.. కొనేవారు లేరు. అందుకే రిజి్రస్టేషన్లు ఆగిపోయాయి. ఇల్లు కట్టించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఓపెన్ ప్లాట్లు కూడా అమ్ముడు పోవడం లేదు. దీంతో భవన నిర్మాణ కారి్మకులు తమ పనులను వదిలేసి బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. – నాగరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు, కదిరి, సత్యసాయి జిల్లా
పూర్తిగా పతనమైన రియల్ ఎస్టేట్
ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌనైపోయింది. మార్కాపురం జిల్లా ప్రకటిస్తే మంచి ధరలు వస్తాయని ఆశించాం. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమ్మే వారు ఉన్నాగానీ కొనేవారు లేరు. నేషనల్ హైవే పక్కన కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. సంతనూతలపాడు మండలంలో రియల్ ఎస్టేట్ భూం ఇప్పుడు పూర్తిగా పతనమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నమోదవుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఇక్కడ 2022–23లో 6,029 రిజిస్ట్రేషన్లు జరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25లో ఆ సంఖ్య 3,972కు పడిపోయింది. – కుంచాల ఆంజనేయులు, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా
పూట గడవడమే కష్టంగా ఉంది
రియల్ ఎస్టేట్ కుదేలైంది. భవన నిర్మాణాలు భారీగా తగ్గిపోయాయి. గతంలో నెలలో 20 రోజులకుపైగా పనులుంటే ప్రస్తుతం 10–15 రోజులు కూడా దొరకడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు పూట గడవడమే కష్టంగా ఉంది. – జి.హరికృష్ణారెడ్డి, ఎనీ్టఆర్ జిల్లా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు
నెలలో సగం రోజులే పని
రియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ నిలిచి పోయాయి. దీంతో నిర్మాణ పనులపై ఆధారపడి ఇక్కడ జీవిస్తున్న వేల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాజధాని వస్తుందన్న సమయంలో భవనాల పనులు మొదలు పెట్టారు. అందరికీ చేతినిండా పని ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు దొరకడం లేదు. రోజుకో బ్యాచ్‌కి పని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అంటే ఒక కార్మికుడికి నెలలో 15 రోజులు కూడా పని లేకుండా పోయింది. దీంతో కారి్మకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు దొరకకపోవడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. – వైఎస్ మూర్తి, శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మధురవాడ, విశాఖ
పని దొరకడం లేదు..
గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులు పనులు దొరికేవి. ఈ ప్రభుత్వం వచ్చాక నెలకు పది రోజులు కూడా పనులు ఉండడం లేదు. ఉదయమే సెంటర్‌కు వచ్చి పడిగాపులు కాస్తున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. – నాగూర్‌బాషా, భవన నిర్మాణ కార్మికుడు, ఉప్పరపాలెం, బాపట్ల జిల్లా.



