నిర్మాణ రంగంలో ముఖ్యంగా గృహ నిర్మాణంలో అనేక కొత్త కొత్త టెక్నిక్‌లు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా ఐఐటీ తిరుచ్చి ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఇలా గతంలో అనేక ఉన్నత విద్యా సంస్థల నుంచి కూడా పలు కొత్త నిర్మాణ నిర్మాణ పద్ధతులు తెరమీదకు వచ్చాయి. అవి ఏవి.. వాటిలో ఏవి విజయవంతమై క్షేత్ర స్థాయిలో వినియోగంలో ఉన్నాయి.. చూద్దాం ఈ కథనంలో..
నెల రోజుల్లో నిర్మాణం
ఎన్‌ఐటీ తిరుచ్చి తాజాగా మరో కొత్త నిర్మాణ టెక్నిక్‌ను అభివృద్ధి చేసింది. నిర్మాణ సమయం, సిమెంట్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు భవనం ధృడంగా ఉండేలా రూపొందించిన కొత్త కోల్డ్ ఫార్మడ్ స్టీల్ (CFS)-కాంక్రీట్-బ్రిక్ కాంపోజిట్ హౌసింగ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రోటోటైప్ భవనం 'సెంటినెల్'ను ఆవిష్కరించింది సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ అండ్ ఇంక్యుబేషన్ (సీఈడీఐ) అధ్యాపకుల నేతృత్వంలోని స్టార్టప్.
కాంక్రీట్ వినియోగాన్ని 40-50% తగ్గించడంతోపాటు భూకంపానికి తట్టుకునే సామర్థ్యం కూడా ఈ నిర్మాణానికి మెరుగ్గా ఉంటుందని రూపకర్తలు చెబుతున్నారు. ఈ 400 చదరపు అడుగుల సింగిల్-బీహెచ్‌కే యూనిట్ కోసం మొత్తం సివిల్ పని కేవలం 25 పని దినాల్లో పూర్తయింది. సాధారణంగా ఇదే పరిమాణంలో సాంప్రదాయ ఆర్‌సీసీ భవనం నిర్మించాలంటే 2-3 నెలలు పడుతుంది.
గతంలో వచ్చిన టెక్నిక్‌లు
దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసిన అనేక నిర్మాణ సాంకేతికతలు క్రమంగా ప్రయోగశాలలు, పైలట్ ప్రాజెక్టుల నుండి వాస్తవ ప్రపంచ వినియోగంలోకి మారుతున్నాయి. ప్రీకాస్ట్ నిర్మాణం, కోల్డ్-ఫార్మ్డ్ స్టీల్ సిస్టమ్స్, జియోపాలిమర్ కాంక్రీట్ ఇప్పటివరకు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నిర్మాణ టెక్నిక్‌లు.
వీటిలో, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఎస్‌పీఏ ఢిల్లీ వంటి సంస్థలు రూపొందించిన ప్రీకాస్ట్, మాడ్యులర్ నిర్మాణానికి విస్తృత ఆమోదం లభించింది. సైట్లో అసెంబుల్ చేసిన ఫ్యాక్టరీ-మేడ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్లను ఇప్పుడు సాధారణంగా పట్టణ హౌసింగ్, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ప్రభుత్వ హౌసింగ్ పథకాలలో ఉపయోగిస్తున్నారు.
అదే విధంగా, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన విస్తృత పరిశోధనల ద్వారా అభివృద్ధి చెందిన జియోపాలిమర్ కాంక్రీట్ ప్రయోగాత్మక దశను దాటి ప్రాయోగిక వినియోగానికి చేరుకుంటోంది. ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలతో తయారయ్యే ఈ పదార్థం ప్రస్తుతం రహదారి పేవ్‌మెంట్లు, ప్రీకాస్ట్ విడిభాగాలు, పారిశ్రామిక నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు.
అయితే, అన్ని ఆవిష్కరణలు ఇంకా క్షేత్రస్థాయిలోకి ప్రవేశించడం లేదు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌లు ప్రదర్శించిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నిక్.. అధిక పరికర వ్యయం, నైపుణ్యం కలిగిన ఆపరేటర్ల అవసరం కారణంగా ఇప్పటికీ పైలట్ హౌసింగ్ ప్రాజెక్టులు, క్యాంపస్ స్థాయి నిర్మాణాలకే పరిమితమై ఉంది.
అలాగే, వెదురు మిశ్రమాలు, కంప్రెస్డ్ ఎర్త్ బ్లాక్స్ వంటి బయో-ఆధారిత నిర్మాణ పదార్థాలను ఎక్కువగా గ్రామీణ లేదా ప్రాంత-నిర్దిష్ట అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ నిర్మాణ సాంకేతికతలు ప్రధానంగా నిర్మాణ పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కోసం పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఓ ఎంపికగా మాత్రమే అమలు చేస్తున్నారు.


