తమ బ్యాంకులో అప్పు తీసుకున్నోళ్లకు ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ఇటీవల రెపో రేటును తగ్గించిన తరువాత, ప్రధాన బ్యాంకులు ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే పనిలో ఉన్నాయి. తాజాగా ఎస్‌బీఐ కూడా తన కీలక రుణ రేట్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్), ఎక్స్‌టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్), బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (బీపీఎల్ఆర్), బేస్ రేట్లో కోతలు ఉన్నాయి. డిసెంబర్ 15 నుండి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మారిన వడ్డీ రేట్లతో ఈ బ్యాంకులో రుణ గ్రహీతలకు వడ్డీ భారం తగ్గనుంది. నెలవారీ వాయిదాలు (EMI) తగ్గుతాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపోరేటు అంటే వాణిజ్య బ్యాంకులకు తాత్కాలికంగా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో ఇది 5.25 శాతానికి తగ్గింది. వృద్ధికి తోడ్పడటానికి ఈ ఏడాది నాల్గవసారి కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని గత వారం ఆర్‌బీఐ విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది.
సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు
చాలా రిటైల్ రుణాలకు కీలకమైన ఎంసీఎల్ఆర్ రేటును అన్ని కాలపరిమితిలలోనూ ఎస్‌బీఐ తగ్గించింది. ఓవర్‌నైట్, ఒక నెల రేట్లు 7.90% నుండి 7.85%కి తగ్గాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.25 శాతానికి రాగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. అనేక గృహ, వాహన రుణాలకు ఉపయోగించే క్లిష్టమైన ఒక సంవత్సరం కాలపరిమితి రుణ రేటు 8.75% నుండి 8.70%కి దిగొచ్చింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రుణాలపై 8.80% నుండి 8.75%, మూడేళ్ల కాలపరిమితి లోన్లపై 8.85 % నుండి 8.80 శాతానికి వడ్డీని ఎస్‌బీఐ సవరించింది.
ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ కోతలు
క్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP), బ్యాంక్ స్ప్రెడ్ (BSP)తో కూడిన ఈబీఎల్‌ఆర్‌ను ఎస్‌బీఐ 8.15% నుండి 7.90%కి తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటుతో నేరుగా ముడిపడి ఉన్న ఆర్ఎల్ఎల్ఆర్ 7.75% + CRP నుండి 7.50% + CRP కి దిగొచ్చింది. ఫలితంగా రుణగ్రహీతలు తమ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఈఎంఐలలో తగ్గింపులను చూస్తారు.
బీపీఎల్‌ఆర్, బేస్ రేటు మార్పులు
తమ అత్యంత విశ్వసనీయ కస్టమర్లకు (prime customers) వసూలు చేసే కనీస వడ్డీ రేటు బీపీఎల్ఆర్‌ను ఎస్‌బీఐ 14.65 శాతానికి తగ్గించింది. దీంతోపాటు బేస్ రేటును కూడా 9.90 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపులు వినియోగదారుల స్థోమతను పెంచుతాయి. గృహ కొనుగోలు, వ్యాపార పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి.


