దేశీయంగా 17 శాతం వాటా
శావిల్స్ ఇండియా నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) లీజింగ్‌కి సంబంధించి హైదరాబాద్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. 2020–24 మధ్య కాలంలో 18.6 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌తో దేశం మొత్తం మీద 17 శాతం వాటా దక్కించుకుంది. బెంగళూరు తర్వాత రెండో స్థానంలో నిలి్చంది. జీసీసీలపై శావిల్స్ ఇండియా రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం దేశవ్యాప్తంగా 112 మిలియన్ చ.అ. జీసీసీల లీజింగ్‌లో టెక్ సిటీల త్రయం
(బెంగళూరు, హైదరాబాద్, పుణె) 70 శాతం వాటా దక్కించుకుంది. ప్రతిభావంతుల లభ్యత, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) తక్కువగా ఉండటం మొదలైనవి హైదరాబాద్‌కి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
→ 2020–24 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 262 మిలియన్ చ.అ.లుగా ఉండగా, అందులో జీసీసీ లీజింగ్ వాటా 112 మిలియన్ చ.అ.తో 43 శాతంగా నమోదైంది.
→ హెల్త్‌కేర్, ఫార్మా జీసీసీల విషయంలో బెంగళూరు, పుణెలతో పాటు హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. జీనోమ్ వేలీలాంటి వ్యవస్థలు ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్ రంగాల జీసీసీలకు కూడా నగరం కేంద్రంగా నిలుస్తోంది.
→ దేశీయంగా ప్రస్తుతం 1,800 జీసీసీలు ఉండగా, 19 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 2,200 జీసీసీలు, 28 లక్షల మంది ఉద్యోగులకు చేరనుంది.
→ సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీసులు, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్–తయారీ, ఫార్మా, రిటైల్, కన్జూమర్ సర్వీసుల ఆధిపత్యం కొనసాగనుంది.
→ సంప్రదాయ ఐటీ సరీ్వసుల ఉద్యోగాలతో పోలిస్తే జీసీసీల్లో జీతభత్యాలు 12–20 శాతం అధికంగా ఉంటున్నాయి. ఏఐ/ఎంఎల్, డేటా ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌లాంటి అధునాతన అంశాలకు ప్రాధాన్యత ఉంటోంది.
→ రాబోయే రోజుల్లో 2030 నాటికి జీసీసీల లీజింగ్ ఏటా 30 మిలియన్ చ.అ. మేర పెరగనుంది.
→ 2025–30 మధ్య కాలంలో భవిష్యత్తులో దేశీయంగా ఏర్పాటయ్యే జీసీసీల్లో ఆటోమోటివ్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్ కేంద్రాల వాటా 30 శాతంగా ఉంటుంది.
→ అంతర్జాతీయంగా 100 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఆదాయాలు ఉండే జీసీసీ సెగ్మెంట్ కంపెనీలకు వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
→ నిపుణుల లభ్యత, తక్కువ నిర్వహణ వ్యయాలు, పాలసీ సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలు మొదలైనవి భారత్‌ను అగ్రగామి జీసీసీ హబ్‌గా నిలుపుతాయి.


