ఈ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్
దేశవ్యాప్తంగా వీక్షించిన 58 లక్షల మంది
ఆసక్తి కలిగిస్తున్న బుక్‌మైషో తాజా నివేదిక
సినిమా అంటేనే వినోదం.. భారతీయుల జీవితంలో ఒక భాగం. థియేటర్‌లో కొత్త మూవీ రిలీజ్ అయినప్పడే కాదు.. పాత సినిమాలు మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై విడుదల అయినా జనంలో ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. రీరిలీజ్ సినిమాలను ఆదరించడంలో భారత్‌లో మన హైదరాబాద్ ముందుండటం విశేషం.
థ్రో బ్యాక్–2025 పేరుతో...
సినిమాలు, లైవ్ ఈవెంట్స్, నాటకాలు, కచేరీలు, క్రీడల ఆన్‌లైన్ టికెటింగ్‌లో మార్కెట్ లీడర్ బుక్‌మైషో.. థ్రోబ్యాక్–2025 పేరుతో రూపొందించిన నివేదిక ద్వారా ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి–నవంబర్ మధ్య దేశవ్యాప్తంగా 58 లక్షల మంది రీరిలీజ్ సినిమాలను థియేటర్లలో వీక్షించారు.
రీరిలీజ్ విభాగంలో దేశంలో ఇంటర్‌స్టెల్లర్ టాప్‌లో నిలిచింది. అభిమాన తారల సినిమా మళ్లీ వెండి తెరపైకి రావడం ఒక ఎత్తు అయితే.. ఏళ్లు గడిచినా ఆ చిత్రం తాలూకా జ్ఞాపకాలు, కథ, పాత్రలు వీక్షకుల మదిలో ఎంత పాతుకుపోయాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. రీరిలీజ్ మూవీలకు అడ్డాగా మన భాగ్యనగరి నిలవడం గమనార్హం.
మరో నగరానికి వెళ్లి మరీ..
లైవ్ ఈవెంట్స్‌ను ఆస్వాదించేందుకు జనం గడప దాటుతున్నారు. అంతేకాదు మరో నగరానికి వెళ్లి మరీ ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్‌లోని 1,32,000 సీట్ల సామర్థ్యం గల నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన కోల్డ్‌ప్లే లైవ్ మ్యూజిక్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఈవెంట్‌తో స్థానికంగా రూ.649 కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం.
భారతీయులు వినోదాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకున్నారని నివేదిక తెలిపింది. ఇందుకోసం ఖర్చుకూ వెనుకాడడం లేదు. 18 లక్షల మందికిపైగా సోలోగా వెళ్లి ఈవెంట్స్‌ను ఎంజాయ్ చేశారు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల పెరుగుతున్న విశ్వాసానికి ఇది శక్తివంతమైన నిదర్శనం. ముఖ్యంగా పట్టణ మిలీనియల్స్, జెన్‌జీ ప్రేక్షకులు సోలో హాజరును సామాజిక వైఫల్యానికి బదులుగా స్వీయ భరోసాకు చిహ్నంగా భావిస్తున్నారు.
వినోదానికే పండుగ
» దేశవ్యాప్తంగా దసరా వీకెండ్‌లో 68 లక్షల మంది థియేటర్లలో అడుగుపెట్టారు. సంఖ్యాపరంగా ఆ తర్వాతి స్థానంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ నిలిచింది.
» ముందస్తు టికెట్ల బుకింగ్‌లో రజనీకాంత్ ‘కూలీ’మూవీ రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే 24 లక్షల మంది తమ టికెట్లను సొంతం చేసుకున్నారు.
» కాంతార చాప్టర్–1 సినిమాను 6 లక్షల మందికిపైగా అభిమానులు రెండుసార్లు వీక్షించారు.
» ఒక నగరం నుంచి మరోచోటకు వెళ్లి 5.62 లక్షల మంది ఫ్యాన్స్ లైవ్ మ్యూజిక్‌ను ఆస్వాదించారు.
» రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య థియేటర్లకు పరుగుతీయడంలో బెంగళూరు వరుసగా రెండేళ్లు టాప్‌లో నిలిచింది.
» 34,086 లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే వీటి సంఖ్య 17% పెరిగింది.
» ప్రీమియం సీట్స్ బుకింగ్స్ రెట్టింపు అయ్యింది. అభిమానులు వీఐపీ సీట్స్, ఎలివేటెడ్ డెక్స్, ప్రీమియం లాంజ్, ఖరీదైన ఆతిథ్యం కోరుకుంటున్నారు.
» లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ వీక్షకుల సంఖ్య వైజాగ్‌లో 409%, వడోదర 230, ఇండోర్‌లో 214, షిల్లాంగ్‌లో 213% పెరిగింది.
» నాటక ప్రదర్శనలు వీక్షిస్తున్న అభిమానుల సంఖ్య 45% అధికమైంది.


