పంచాయతీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య
కాంగ్రెస్ పోలీసులను అడ్డుపెట్టుకున్నా ప్రజలు మా వెంటే నిలిచారు
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ బీఆర్‌ఎస్‌కు మద్దతు
కేటీఆర్‌ను కలిసేందుకు జిల్లాల నుంచి తరలివచ్చిన సర్పంచ్‌లు
రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్ యాదవ్‌తో కేటీఆర్ లంచ్
ఇండియా కూటమి కొనసాగుతుంది సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, కాంగ్రెస్ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్ వెంటే నిలిచారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఈ నెల 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలవడమే దీనికి నిదర్శమన్నారు.
కాంగ్రెస్ ప్రలోభాలు, బెదిరింపులు తట్టుకుని ప్రజల మద్దతుతో తమ పార్టీ అభ్యర్థులు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు శనివారం నందినగర్ నివాసంలో కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ నేతలు, సర్పంచ్‌లు వందలాదిగా తరలిరావడంతో నందినగర్ నివాసం సందడిగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సర్పంచ్‌లుగా గెలుపొందిన వారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడం కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.
కేటీఆర్‌ను కలిసిన వారిలో నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచ్‌లు ఉన్నారు. మరో వారం, పదిరోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచ్‌లను కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్ యాదవ్‌తో కేటీఆర్ లంచ్
హైదరాబాద్ మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ చేశారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు.
సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు. కేఫ్ యజమాని శరత్ ఇద్దరు నేతలకు ఘన స్వాగతం పలికి లంచ్ ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేశ్.. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను విజయవంతంగా నడుపుతుండటంపై యజమాని శరత్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు.
కాగా, లంచ్ అనంతరం కేటీఆర్, అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు.


